రాహుల్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరేనా?

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరి కొద్ది రోజులలో అంటే ఈ నెలాఖరుకు ముగియనుంది. కన్యాకుమారి టు కాశ్మీర్ ఆయన సాగించిన సుదీర్ఘ పాదయాత్ర ప్రజలలో ఆయన ఇమేజ్ పెరిగేందుకు దోహదపడింది. అందులో సందేహం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీలోనూ నూతనోత్సాహం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయినంత మాత్రాన ఈ పాదయాత్ర కాంగ్రెస్ ను వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అధికార పీఠంపై కూర్చోపెడుతుందా? అంటే మాత్రం కచ్చితంగా ఔను అనే సమాధానం రావడం లేదు.

అందుకు కారణాలు అనేకం ఉన్నా.. ప్రధాన కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న నమ్మకం, విశ్వాసం ఆ పార్టీ సీనియర్ నేతలలో కనిపించకపోవడమే. అలాగే రాష్ట్రాలలో ఆ పార్టీ నాయకుల మధ్య విభేదాలు, వాటిని నియంత్రించే స్థితిలో పార్టీ అధిష్ఠానం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చ. పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చూపినంతగా గాంధీ కుటుంబానికి పార్టీలోని మిగిలిన నేతలు విధేయంగా లేరన్న సంగతి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ అధినాయకత్వం అంటే ఇప్పటికీ గాంధీ కుటుంబమే. పేరుకు మాత్రమే ఖర్గే అధ్యక్షుడు.. కానీ పార్టీ వ్యవహారాలన్నీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల కనుసన్నలలోనే సాగుతాయన్నది బహిరంగ రహస్యమే.

జాతీయ పార్టీగా కాంగ్రెస్ పునాదులు కదలడం 2014లో పరాజయంతోనే ప్రారంభమయ్యాయి. 2019 ఎన్నికల పరాజయం తో కాంగ్రెస్ సౌథం బీటలు వారడం ఆరంభమైంది. ఇప్పుడు కాంగ్రెస్ మరమ్మతులు చేపట్టింది. ఆ మరమ్మతులు పూర్తై పార్టీకి పూర్వవైభవం రావాలంటే ఇంకా చాలా చాలా సమయం పడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి దీటుగా నిలవగలుగుతుందా అంటే  అనుమానమే. అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల నాటి తో పోలిస్తే చాలా చాలా మెరుగుపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వారి విశ్లేషణలకు ఆధారంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగిన మార్గాన్నీ, తీరునూ వారు ఉదహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉన్న యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలను రాహుల్ పాదయాత్ర పట్టించుకోలేదు. అలాగే పార్టీ అంతో ఇంతో బలంగా ఉన్న కేరళ, కర్నాటక, మధ్య ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ రోజులు, ఎక్కువ కిలోమీటర్లు సాగింది. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా.. ప్రజలలో గుర్తింపు సాధించడానికి కూడా ఈ యాత్ర దోహదపడింది. అలాగే ఈ యాత్రలో మోడీకి ప్రత్యామ్నాయం తానేనని చాటేందుకు రాహుల్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఫలించిందా లేదా అన్నది వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాతే తేలుతుంది. కానీ ఆ దిశగా రాహుల్ ప్రయత్నమైతే చేశారు. యాత్ర ప్రారంభం నాటికి రాహుల్ లో పరిణితి చెందిన నేతను ఎవరూ చూడలేదు..

కానీ యాత్ర సాగిన కొద్దీ ఆయనలో పరిపక్వతను పార్టీ శ్రేణులే కాదు, విపక్షాలు, ప్రజలూ కూడా గుర్తించాయి. అంగీకరించాయి. ఎక్కడా ఏ చిన్న అవాంతరం, అవాంఛనీయ సంఘటనా లేకుండా యాత్ర సాగడం నిజంగా రాహుల్ ఘనతే. యాత్ర సమయంలో పెరిగిన ఆయన గడ్డం.. అమృతసర్ లో కాషాయ వస్త్రధారణ.. ఆయనలో మోడీకి దీటుగా ఎదుగుతున్న నేతను ప్రజల కళ్లకు కట్టింది.   ఈ యాత్ర లక్ష్యం విషయంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏ కారణం చెప్పినా.. వాస్తవం మాత్రం పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చి.. మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడమే. అయితే అందుకు రాహుల్ గాంధీ యాత్ర చాలా వరకూ దోహదం చేసిందనడంలో సందేహం లేదు. ఇక మిగిలిన పని పార్టీ రాష్ట్రాల శాఖలపై ఆధారపడి ఉంది. రాష్ట్రాలలో కాంగ్రెస్ లో విభేదాలను పరిష్కరించుకుని ఏకతాటిపైకి వస్తేనే రాహుల్ పాదయాత్ర ఫలితాలు పార్టీకి దక్కుతాయి.