పవన్ డైలాగ్ చెబితే.. రాహుల్ కు తిరుగులేదు..

 

పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ను రాహుల్ గాంధీ చెబితే.. రాహుల్ గాంధీకి ఇక రాజకీయ భవిష్యత్ లో ఎలాంటి డోకా ఉండదట. రాహుల్ గాంధీ ఏంటీ.. ? పవన్ డైలాగ్ చెప్పడం ఏంటీ... ?దానికి రాజకీయ భవిష్యత్ కు సంబంధం ఏంటీ..? అని అనుకుంటున్నారా..? అదేంటో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగురోజుల పాటు ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే కదా. ఈ పర్యటనలో పవన్ చేసిన ప్రసంగాలు ఏపీ రాజకీయాల్లోనే వేడిని పుట్టిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై పెద్ద పెద్ద డిబేట్ లే జరుగుతున్నాయి. ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ఎలాంటి పదవులు, అధికారాలు తనకి అవసరం లేదని అన్నారు. అంతేకాదు.. ఆయన అభిమానులు పదే పదే సీఎం సీఎం అని అంటున్నా.. ఆ నినాదాలు వద్దని ఎక్కడికక్కడ ఫ్యాన్స్ కి క్లాస్ పీకుతున్నారు దీంతో కుర్చీ రాజకీయాలు మాత్రమే చూసిన వారికి ఈ వ్యవహారం మింగుడు పడడం లేదు. జనసేన కార్యకర్తలు సైతం పవన్ వాదనను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అవస్థ పడుతున్నారు.

 

అయితే ఇప్పుడు పవన్ చెప్పిన ఈ డైలాగ్ నే రాహుల్ చెబితే ఆయన రాజకీయ భవిష్యత్తు బావుంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని..  సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే తమకు అధికారం వచ్చినా ప్రధాని పదవిని తాను తీసుకోకుండా అన్ని విధాలుగా అర్హుడైన వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెడతామని రాహుల్ చెప్పాలని థాపర్ సూచిస్తున్నారు. ఒకప్పుడు సోనియా గాంధీ కూడా ఇలాంటి మాటకు కట్టుబడి ఉండడం వల్లే యూపీఏ రెండు సార్లు విజయం సాధించిందని థాపర్ అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే థాపర్ అభిప్రాయంతో విభేదించేవాళ్లు కూడా లేకపోలేదు. ఇప్పటికే రాహుల్ మీద బాధ్యతలకు దూరంగా ఉంటాడని పేరుందని, ప్రధాని పదవి వద్దంటే చెడు సంకేతాలు జనంలోకి వెళతాయని కొందరి వాదన. మరి ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీపై ఉన్న పప్పు అన్న ముద్ర మాత్రం తొలిగిపోయింది. కాస్త మెచ్చూరిటీతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు. మరి థాపర్ చెప్పినట్టు రాహుల్ ఆ నిర్ణయం తీసుకుంటాడో.. లేదో చూద్దాం...