ఆదర్శ యువరాజు మళ్ళీ నాన్సెన్స్ అన్నారహో

 

ఒరే బాబు.. నువ్వా మీడియా సమావేశాలకి వెళ్ళకురా నాయినా.. నీ పుణ్యం ఉంటుంది. నా బీపీ ఒకటే ఇదిగా పెరిగిపోతోందిరా అవి చూస్తుంటే..

 

అదేంటి మమ్మీ.. అవినీతిని పారద్రోలాలని మన పార్టీ ఎప్పటి నుండో పాడుతున్నపాచి పాటనే కదా నేను పాడింది. నేనేం తప్పు మాట్లాడేనని వద్దంటున్నావు?

 

బావుందిరా నాయినా.. అదివరకు మన ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ ని నువ్వు ‘నాన్సెన్స్’అని తీసిపారేసినప్పుడు మన పరువు కాపాడుకోవడానికి ఎన్నితిప్పలుపడ్డామో చూసిన తరువాతయినా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటావనుకొన్నాను. కానీ..మళ్ళీ..

 

అదేమిటి మమ్మీ... నువ్వు కూడా అపోజిషన్ పార్టీలాగ నన్నేఆడిపోసుకొంటావు? మనమిద్దరం కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగినా నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయామా? అందుకే మన పార్టీని వచ్చేఎన్నికలలో ఎలాగయినా గెలిపించాలనే తాపత్రయంతో మనల్ని చీపురు కట్టతో ఊడ్చేసిన ఆ అమాద్మీవాళ్ళలాగే నేను కూడాఅవినీతికి వ్యతిరేఖంగా పోరాడుదామన్నాను.... అందుకు నువ్వు సంతోషించకపోగా నన్నే తిడతావేమిటి?

 

ఆ.. తిట్టక మరేమీ చేస్తాను? అయినా నీకు మరేదీ దొరకనట్లు పోయిపోయి మన ఆదర్శ కుంభకోణం గురించే మాట్లాడి మన కొంపముంచాలా నాయినా...? అందులో నలుగురు మన మాజీ ముఖ్యమంత్రులు, మన కొమ్ముకాసే అనేకమంది అధికారులు ఉన్నారు. వారు పాపం ఏదో ముచ్చటపడి ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం చేసుకొంటే, దానిని కప్పెట్టేందుకు మేము నానా తిప్పలుపడుతూ ఆ కమీషన్ రిపోర్టుని త్రొక్కిపెడుతుంటే , నువ్వు తగుదునమ్మా అంటూ టాట్..మన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్టును తిరస్కరించడం చాలా తప్పు..మళ్ళీ పునః పరిశీలించవలసిందేనని.. మీడియా ముందే అలా అనేస్తే మేము తలలు ఎక్కడ పెట్టుకోవాలిరా బాబు?

 

అయినా ఆ రిపోర్టు గురించి నీకేమి తెలుసనీ అలా మాట్లాడేసావు. అందులో మన సుషీల్ కుమార్ షిండే అంకుల్ పేరు కూడా ఉంది తెలుసా? నీ అవినీతి పోరాటంతో పార్టీ గెలవడం మాట దేవుడెరుగు అదే మన కొంప ముంచేలా ఉందిరా అబ్బాయ్...ఇప్పటికే నాలుగు రాష్ట్రాలో తుడిచిపెట్టుకు పోయాము. ఇప్పుడు నీ మాటలతో మహారాష్ట్రాలో కూడా క్లీన్ అయిపోతామేమో..అయినా నీకు పుణ్యం ఉంటుంది గానీ నువ్వా మీడియా సమావేశాలు మానుకోరా అబ్బాయ్! అసలే ఎన్నికల వేళ..నువ్విలా మాటిమాటికి నోరు జారుతుంటే ఇక మనల్ని ఆ నరేంద్ర మోడీయే దింపనవసరం లేదు. మనమే దిగిపోయి మోడీకి ఆ కుర్చీఅప్పగించవలసి వస్తుంది జాగ్రత్త!

 

ఓహ్! మన వెనుక ఇంత డర్టీ స్టోరీ ఉందన్నమాట! సారీ మమ్మీ..నాకు ఈ స్టోరీ అంతా తెలీక రొటీన్ గా అవినీతి మీద లెక్చర్ దంచుతుంటే ఏదో ఫ్లోలో అలా అనేసాను. ఇంకెప్పుడు అవినీతిపై పోరాటం గురించి మాట్లాడను. ఓకేనా!

 

ప్రామిస్!

 

యస్ మమ్మీ! మదర్ ప్రామిస్!

 

దట్ ఈజ్ గుడ్ బేటా..కీప్ ఇట్ అప్!

 

ఆ..మమ్మీ! మొన్న కిరణ్ అంకుల్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ కి వచ్చినప్పుడు రాష్ట్ర విభజన గురించి నన్ను ఒకే ఒక్కసారి ‘నాన్సెన్స్’ అనమని చాలా రిక్వెస్ట్ చేసారు..మమ్మీ. పాపం! ఆయన అంతగా అడుగుతున్నారు కదా...పోనీ.. ఓసారి ‘నాన్సెన్స్’ అనమంటావా...భలే థ్రిల్లింగా ఉంటుంది....

 

అయ్య బాబోయ్...ఇదిగో సెక్రెటరీ నిన్నే.. త్వరగా ఆ బీపీ మాత్రలు అందుకో..ఆ క్విక్...

Related Segment News