టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్‌.. క‌మాన్ ఇండియా..

అండ‌ర్ 19లో జాతిర‌త్నాల‌ను సాన‌బ‌ట్టాడు. దేశ‌న‌లుమూల‌ల ఉన్న ఆట‌గాళ్ల‌ను ఆవిష్క‌రించాడు. టీమిండియాకు అనేక మంది యువ క్రికెట‌ర్ల‌ను అందించాడు. అలాంటి రాహుల్ ద్ర‌విడ్‌.. త్వ‌ర‌లోనే ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా సేవ‌లందించ‌నున్నారు. ఆ మేర‌కు బీసీసీఐ ప్ర‌తినిధి మీడియాకు తెలిపారు. రాహుల్ రాక‌.. టీమిండియాకు కేక‌. 

దుబాయ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జై షా.. ద్రవిడ్‌ని కలిసి చ‌ర్చించారు. రాహుల్‌ను టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా ఉండేందుకు ఒప్పించారు. 2023 వరకు రెండేళ్ల పాటు కోచ్‌గా ఉండటానికి అంగీకరించారు. ప్రస్తుతం నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ హెడ్‌గా ద్ర‌విడ్‌ కొనసాగుతున్నారు. జంట ప‌ద‌వుల ప్రాబ్ల‌మ్ రాకుండా త్వ‌ర‌లోనే ఎన్‌సీఏ బాధ్యతల నుంచి తప్పుకొనున్నారు. 

రాహుల్ ద్ర‌విడ్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఉంటే.. బౌలింగ్‌ కోచ్‌గా పరాస్ మాంబ్రేను తీసుకోనున్నారు. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాఠోడ్‌ను కొన‌సాగించే ఛాన్సెస్ ఉన్నాయి. ఫీల్డింగ్ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. 

టీ20 ప్రపంచకప్‌ తర్వాత ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగియ‌నుండ‌టంతో.. త‌ర్వాతి కోచ్ ఎవ‌ర‌నే దానిపై ఎప్ప‌టినుంచో ఆస‌క్తి నెల‌కొంది. ద్ర‌విడ్‌నే కోచ్‌ను చేస్తార‌ని అంతా అనుకున్నారు. అనుకున్న‌ట్టే.. మాజీ టీమిండియా కెప్టెన్‌.. ది వాల్‌.. రాహుల్ ద్ర‌విడ్ ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌కు హెడ్ కోచ్ కానున్నారు. త‌న శిక్ష‌ణ‌తో ఎందరో యువ ఆట‌గాళ్ల‌కు జ‌ట్టుకు అందించిన ద్ర‌విడ్‌.. ఇక‌పై హెడ్ కోచ్‌గా ఇంకెన్ని మిరాకిల్స్ చేస్తారో చూడాలి.. టీమిండియా దూకుడుకు.. మిస్ట‌ర్ కూల్ ద్ర‌విడ్ వ్యూహాలు తోడైతే.. ఇక వాల్డ్ క్రికెట్‌లో భార‌త్‌కు తిరుగే ఉండ‌దు...