అసత్య వార్తలు రాస్తే కేసు వేస్తా! జర్నలిస్టుపై పీవీ సింధు గుస్సా

గ్రౌండ్ లోనూ, బయట కూడా ఎప్పుడూ కూల్ గా కనిపించే భారత బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించింది. ఓ స్పోర్ట్స్ జర్నలిస్టుపై మండిపడుతూ వరుసగా ట్వీట్లు చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ రిపోర్టర్ నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు.. వార్తలు రాసేటప్పుడు నిజాలు ఏంటో తెలుసుకుని రాయాలి. అతడు ఇటువంటి చర్యలను మానుకోకపోతే నేను అతడిపై చట్టబద్ధంగా పోరాడతానని ట్వీట్ లో పీవీ సింధు హెచ్చరించింది.

 

పీవీ సింధు ప్రస్తుతం లండన్ లో ఉంది. అయితే  ఆమె మొట్టమొదటి సారి తన తల్లిదండ్రులతో కాకుండా ఒక్కరే విదేశాలకు వెళ్లిందని టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ జర్నలిస్టు కథనం రాశాడు. మరో రెండు నెలలు ఆమె అక్కడే ఉంటుందని అందులో పేర్కొన్నాడు. కుటుంబంలో సమస్యలు తలెత్తడం వల్లే సింధు పది రోజుల క్రితం లండన్ వెళ్లిందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ టీమ్ తో కలిసి ఆమె అక్కడే ప్రాక్టీసును మొదలు పెట్టనుందని, ఆమెను తిరిగి ఇంటికి రప్పించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆ కథనంలో రాసుకొచ్చాడు ఆ జర్నలిస్ట్. 

ఈ కథనంపైనే పీవీ సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిట్‌నెస్‌లో భాగంగా న్యూట్రిషన్ కోసం తాను కొన్ని రోజుల క్రితం లండన్‌కు వచ్చానని, నిజానికి తన తల్లిదండ్రుల అనుమతితోనే వచ్చానని ఆమె చెప్పింది. ఈ విషయంలో వారితో ఎటువంటి గొడవలూ లేవని వివరించింది. నాకోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులతో నాకు సమస్యలు, గొడవలు ఎందుకు ఉంటాయి? నా కుటుంబంతో నేను చాలా క్లోజ్ గా ఉంటాను.. వారు నన్ను ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు నేను వారితో మాట్లాడుతూనే ఉన్నానని సింధు తెలిపింది. అలాగే  కోచ్ పుల్లెల గోపిచంద్ తోనూ ఆయన శిక్షణ సంస్థతోనూ తనకు ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేసింది పీవీ సింధు.