కోమట్లను రగిల్చిన "కంచె"

ఎప్పుడూ తమ వ్యాపారాలు..తమ పనులు తప్ప బయటి విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వని ఆర్యవైశ్యులు ఇప్పుడు రగిలిపోతున్నారు. ఏకంగా రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇంతటి వివాదానికి కారణం ఎవరో తెలుసా..? సామాజిక వేత్త, ప్రముఖ రచయిత ప్రో. కంచె ఐలయ్య. ఆయన రాసిన "సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు" పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ పుస్తకం తమ మనోభావాలని కించపరిచేలా..తమ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు..ఐలయ్య దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సదరు పుస్తకాన్ని నిషేధించడంతో పాటు పబ్లిషింగ్ సంస్థపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

చిన్ననాటి నుంచి ఏ సంఘటనలు ఐలయ్యపై ప్రభావం చూపాయో తెలియదు కానీ ఆయన అగ్రవర్ణాలకు బద్ధ వ్యతిరేకి అన్న ముద్ర పడిపోయింది. వారిలోనూ బ్రాహ్మణులు అంటే మంట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పాపాలు పొగొట్టుకునేందుకే బ్రాహ్మణుల కాళ్లకు మొక్కుతున్నారంటూ మీడియా సాక్షిగా ఆరోపించారు. భారతదేశంలో నిమ్మ కులాల వారికి నేటికీ తగిన గౌరవం దక్కలేదని వాదించే ఆయన..కులాల మధ్య వైషమ్యాలను..నిమ్న జాతుల స్థితిగతులను తన రచనల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా తాను హిందుమత వ్యతిరేకినని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.."నేను హిందువు నెట్లయితే" అనే పుస్తకాన్ని రాసి సంచలనం సృష్టించారు.

 

తాజాగా దేశంలోని కులాల గురించి ప్రస్తావిస్తూ 'సామాజిక స్మగ్లర్లు-కొమటోళ్లు' పుస్తకం రాశారు..హిందు ధర్మ శాస్త్రాలను అడ్డుపెట్టుకుని..గ్రామాల్లో వ్యాపారం కోమట్లు మాత్రమే చేయాలన్న నిబంధనను తీసుకొచ్చారని..ఈ విధానం వల్ల గ్రామీణ వ్యాపార వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోయిందని..దేశంలో అంటరానితనం పెరగడానికి కోమట్లు కూడా ఒక కారణమేనని .. వేల యేళ్లుగా వ్యాపారం పేరు మీద వారు చేసిందీ..చేస్తున్నదీ స్మగ్లింగ్ కాకపోతే ఏమిటో చెప్పండి అంటూ ఐలయ్య ప్రశ్నించారు. అదే ఇప్పుడు ఆర్యవైశ్యులకు కంటగింపుగా మారింది. తాము బతుకుతూ పదిమందికి ఉపాధి చూపిస్తూ..సమాజ ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తున్న తమను స్మగ్లర్లు అనడం ఎంత వరకు సమంజసమమని ఆర్యవైశ్య సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఐలయ్య ఒక్కటి మరచిపోయినట్లున్నారు..మారిన కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు వ్యాపారాలు కేవలం వైశ్యులే చేయడం లేదు..అన్ని కులాలు, మతాలకు చెందిన వారు నిర్వహిస్తున్నారు. వీరిని అందరినీ కలిపి నిందించకుండా కేవలం కోమట్లను మాత్రమే వేలేత్తిచూపడం సబబు కాదు.