ప్రియాంకే సీఎం.. కాంగ్రెస్ చివ‌రి అస్త్రం..

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి. బీజేపీ నుంచి ముగ్గురు మంత్రులు మరి కొందరు ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ (ఎస్పీ) తీర్ధం పుచ్చుకున్నారు. మరో వంక ఎస్పీ ఫస్ట్ ఫ్యామిలీ నుంచి ములాయం సింగ్ యాదవ్ రెండవ కోడలు అపర్ణ, ములాయం తోడల్లుడు, మాకీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా కమలం గూటికి చేరారు. కాంగ్రెస్, బీఎస్పీ కూడా పోటీలో ఉన్నా ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్ వాదీ కూటమి మధ్యనే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ చాలా కాలం తర్వాత ఒంటరిగా బరిలో నిలుస్తోంది.అంతే కాకుండా, సర్వేలన్నీ హస్తం పార్టీకి సింగిల్ డిజిట్ చూపిస్తున్నా, కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా వాద్రా మాత్రం దూకుడుగా ముందుకు సాగుతున్నారు. 

అదలా ఉంటే,  ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా, బీజేపీ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్ది  అఖిలేశ్‌ యాదవ్‌ తొలి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో  దిగుతున్నారు. యోగి గోరఖ్‌పూర్‌ నుంచి బరిలోకి దిగుతుండగా.. అఖిలేశ్‌ గతంలో ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురిలోని కర్హాల్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దుగుతున్నారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరు పోటీ చేస్తారన్న విషయంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే, ప్రియాంక గాంధీ వాద్రాను ముఖ్యమంత్రి  అభ్యర్థిగా ప్రకటిస్తారని చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, తాజాగా ప్రియాంక గాంధీ  ఈరోజు (శుక్రవారం) వ్యూహాగానాలకు తెరదించారు. ఇందుకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రియాంక . “నేను గాక ఇంకెవరు” కాంగ్రెస్ పార్టీలో నేను గాక  ఇంకో చహారా (ముఖం) కనిపిస్తుందా అని ఎదురు ప్రశ్నవెశారు. ఆవిధంగా ‘స్పెక్యులేషన్’ కు చుక్క పెట్టారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ యూత్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం మీడియాసమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ప్రియాంక స్పందిస్తూ.. ‘‘ఇంకెవరైనా కన్పిస్తున్నారా? మరి ఇంకేంటీ? ఎక్కడ చూసినా నేనే కన్పిస్తున్నానుగా..! చూడట్లేదా?’’ అని అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు.దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక పేరునే ప్రకటించే అవకాశాలు దాదాపు ఖాయంగానే కన్పిస్తున్నాయి. త్వరలోనే కాంగ్రెస్‌ దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ప్రియాంక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టొచ్చు. అయితే ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనసమండలి ఏదో ఒకదానికి ఎన్నికవ్వాల్సి ఉంటుంది. గతంలో యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఎమ్మెల్సీనే కావడం గమనార్హం. 

మొత్తం403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు. నిజంగానే కాంగ్రెస్ గెలిచి, ప్రియాంక సీఎం అయితే, గాంధీ నెహ్రు ఫ్యామిలీ నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి ప్రియాంకే అవుతారు. నెహ్రు నుంచి రాజీవ్ వరకు అందరూ నేరుగా ప్రధాని పదవినే చేపట్టారు తప్పు ముఖ్యమంత్రి పదవిని చెప్పట్టలేదు.