1000 మంది ప్రైవేట్ లెక్చరర్ల పోటీ ? హుజురాబాద్ లో నిజమాబాద్ సీన్.. 

ఎక్కడి వారణాసి ఎక్కడి నిజామాబాద్.. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి నామినేషన్లు వేయడం ఏమిటి? అది కూడా  ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా ఓ 50 మంది వరకు  ఊరు కానీ ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి, అక్కడి నుంచి లోక్ సభకు పోటీచేయడం ఏమిటి? ఏంటి, గెలుద్దామనే, లేదు, గెలవాలన్న ఆశే కాదు అలాంటి ఆలోచన కూడా లేదు. అయినా, నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు, ఎర్ర జొన్న రైతులు 2019 లోక్ సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్’లోని వారణాసి నుంచి నామినేషన్లు వేశారు. అందుకు కారణం, ఆ నియోజక వర్గం నుంఛి పోటీ చేస్తున్న ప్రధాని  నరేంద్ర మోడీకి  నిజామాబాద్’లో  పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న తమ గోడు వినిపించుకోవడమే.. అందుకోసమే కట్టకట్టుకుని వెళ్లి అక్కడ నామినేషన్ వేశారు. నిజామాబాద్ రైతులకు  మద్దతుగా తమిళనాడు రైతులు  కూడ  వారణాసిలో  నామినేషన్లు దాఖలు చేశారు. రైతులు  తమ డిమాండ్‌ను  దేశ వ్యాప్తంగా తెలిపేందుకు ఇలా వారణాసిలో నామినేషన్లు దాఖలు చేశారు.

అదే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేసిన నిజమాబాద్ లోక్ సభ స్థానం నుంచి కూడా 178 రైతులు నామినేషన్ వేశారు. అంతే కాదు కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేసి గుర్తులు తెచ్చుకున్నారు. నిజామబాద్ నుంచి మొత్తం 185 మంది  పోటీకి దిగితే అందులో పార్టీల తరపున పోటీలో నిలిచింది ఏడుగురు, మిగిలిన 178 పసుపు రైతులే ఉన్నారు. ఈ నిరసన నామినేషన్ల వలన ప్రయోజనం కలిగిందా, అంటే, పూర్తి ప్రయోజనం జరగలేదు, కానీ, కొద్దిపాటి ప్రయోజనం అయితే జరిగింది. ముఖ్యమంత్రి కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవిత ఓడిపోయారు. బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ గెలిచారు. అధికార పార్టీ సభ్యుడిగా ఆయన కింద మీద పడి,నిజామాబాద్‌ కేంద్రంగా తెలంగాణ సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ మండలి (స్పెసిస్ రీజినల్ బోర్డు) ఏర్పాతు చేయించారు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, అన్నట్లుగా రైతులు సర్దుకున్నారు.    

ఇప్పుడు ఇటు అధికార తెరాస పార్టీకి, మరీ ముఖ్యంమంత్రి కేసీఆర్ సార్’కి అలాగే మాజీ మంత్రి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్’కు మెడ మీద కత్తిలా వేళ్ళాడుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికలలో, రాష్ట్ర ప్రభుత్వ అన్యాయ పోకడలకు వ్యతిరేకంగా వివిధ వర్గాల ప్రజలు మూకుమ్మడి నామినేషన్’కు సిద్దమవుతున్నారు. ఇప్పటికే హుజురాబాద్‌లో తాము పోటీ చేస్తామంటూ 1000 మంది ఫీల్ట్ అసిస్టెంట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారిని విధుల నుంచి తొలగించినందుకు నిరసనగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. అలాగే, ఇప్పుడు తాజాగా, ఉ‌ ఎఎన్నికల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ను ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ గోడు వినిపించేందుకు వంద మంది ప్రైవేట్ లెక్చరర్లు పోటీ చేస్తారని తెలంగాణ లెక్చరర్ల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీ మనోహర్ ప్రకటించారు.ఒక్క ప్రైవేటు లెక్చరర్లు మాత్రమే కాదు, ప్రైవేట్ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రైవేట్ లెక్చరర్లు పోటీ చేస్తారని మురళీ మనోహర్ ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో ప్రైవేటు స్కూల్ టీచర్లకు నెలకు రూ.2వేల నగదు, రేషన్ బియ్యం సహాయం అందించిని తెలంగాణ సర్కారు ప్రైవేట్ లెక్చరర్లకు మాత్రం మొండి చేయి చూపించిందని మురళీ మనోహర్ ఆరోపించారు. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు నెలకు రూ.10 వేల చొప్పున ప్రైవేట్ అధ్యాపకులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే హుజురాబాద్‌లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.మరి దళిత బంధు సీఎం, ఉద్యోగ బంధు, ఉపాధ్యాయ బంధు అవుతారో ..లేదో చూడాలి..