రంగనాయకులగుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

మహిషాసుర మర్దని, భైరవ శిల్పాలు రంగనాయకులగుట్ట కాకతీయ శిల్పాలపై రంగులు తొలగించాలి పురావస్తు పరిశోధకుడు డాక్టర్ఈమని‌ శివనాగిరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా లో ప్రముఖ వర్తక కేంద్రమైన జడ్చర్ల రంగనాయక స్వామి గుట్టపై గల కాకతీయుల కాలుపు శిల్పాలపై రంగులు తొలగించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి అన్నారు. చారిత్రక శిల్పాలు, శాసనాలు, స్థలాలు, కట్టడాలను గుర్తించి గ్రామస్తులకు వాటిపై అవగాహన కల్పించే "ప్రిసర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ" కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం నాడు రంగనాయక గుట్టపై విస్తృతంగా అధ్యయనం చేశారు. కోటగోడ ఆనవాళ్లు ప్రధాన ఆలయమైన రంగనాయక స్వామి రాతి శిల్పం, దాని వెనక 100 అడుగుల దూరంలో గల మహిషాసుర మర్దిని, భైరవ శిల్పాలు క్రీ.శ. 13 వ శతాబ్ది నాటి కాకతీయ కాలానికి చెందినవి, అలాగే గుట్టపై విశాలమైన కోట గోడ ఆనవాళ్లు ఉన్నాయని, పునాది కోసం కొండపైన ఏడడుగుల విశాలంగా రాతిని మలిచారని, అనేక చోట్ల బండలపై ఆనాటి రాతిని చీల్చిన క్వారీ గుర్తులు ఉన్నాయని, రాతిని చీల్చిన క్వారీ గుర్తులు మరో బండపై  ఉలితో చెక్కిన విజయనగర కాలపు ఆంజనేయుని రేఖా చిత్రం ఉందని, ఇంకా ఆదిమానవుడు నివసించిన కొండచరియ ఆవాసాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆదిమానవుని ఆవాసాలు ఇన్ని ఆకర్షణలు గల రంగనాయక స్వామి గుట్టపై పార్కింగ్ సౌకర్యం, టాయిలెట్స్, విశ్రాంతి, మందిరాలు, నడవలు, ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేసి సాహస క్రీడలు, పిల్లలు ఆడుకునే ఆహ్లాదకర ప్రదేశాలను, భద్రత కోసం ఇనుప రైలింగ్ ఏర్పాటు చేసి జిల్లాల్లోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలయ పాలకమండలి, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Publish Date: Jan 27, 2025 9:44PM

31న టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం.. రథసప్తమి ఏర్పాట్లపై సమీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి ఈనెల 31న అత్యవసరంగా సమావేశం కానుంది. తిరుమలలో మినీబ్రహ్మోత్సవంగా చెప్పబడే రథసప్తమి ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ సందర్బంగా తిరుపతిలో తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో రథ సప్తమి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 31న జరగనున్న టీటీడీ అత్యవసర సమావేశంలో   భక్తులకు సౌకర్యాలపై అధికారులకు ఛైర్మన్ దిశానిర్దేశం చేస్తారు. వచ్చే నెల 4న రథ సప్తమి సందర్భంగా ఆ రోజు స్వామి వారు మొత్తం ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేయనుంది.  సాధారణంగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో మాత్రమే ఉదయం, రాత్రి శ్రీవారి పల్లకీసేవ ఉంటుంది. రథసప్తమి రోజు మాత్రమే తిరుమలలో ఉదయం సూర్యప్రభ వాహనం నుంచి ప్రారంభమయ్యే పల్లకీ సేవలు సాయంత్రం వరకు ఏడు వాహనసేవలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో బ్రహ్మో త్సవాల్లో నిర్వహించే వాహన సేవలతో పాటు మధ్యలో రథోత్సవం, బంగారురథంపై విహారం, చక్రతాళ్వార్లకు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయించడం వంటి ఘట్టాలు కూడా నిర్వహిస్తారు. దీంతో రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవంగా పరిగణిస్తారు.  రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలను   టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.  తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. 
Publish Date: Jan 27, 2025 3:47PM

తెలంగాణ ఆర్టీసీ సమ్మె సైరన్

సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ జేఏసీ తెలంగాణ ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ కు సమ్మె నోటీసు ఇచ్చింది. బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఆయనకు సమ్మె నోటీసు అందజేశారు. దీంతో  నాలుగేళ్ల తరువాత ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టినట్లైంది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో  యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని కార్మీక నేతలు ఆరోపించారు. సర్వీసులో ఉన్న వారి సమస్యలే కాదు, పదవీ విరమణ చేసిన వారి సమస్యలు సైతం అపరిష్కృతంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. పేస్లేలు విషయంలో ముందడుగు పడలేదనీ, డీఏ బకాయిలు చెల్లించలేదని వారీ సందర్భంగా సజ్జనార్ కు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలను సవరిస్తామన్న హామీని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.  
Publish Date: Jan 27, 2025 3:27PM

స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే కంటే.. యువగళం పాదయాత్రే ఎక్కువ నేర్పింది.. నారా లోకేష్

యువగళం పాదయాత్ర తనను ఎంతో మార్చిందనీ, ప్రజా నాయకుడిగా తనను తాను ట్రాన్స్ ఫార్మ్ చేసుకునే విషయంలో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే కంటే పాదయాత్రే ఎక్కవ దోహదం చేసిందనీ అన్నారు. రాజకీయాలలో పాదయాత్ర ఎంబీయే లాంటిదన్నారు యువగళం పాదయాత్రలో భాగంగా నాడు తాను ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తానన్నారు. అలాగే  జగన్ హయాంలో చట్టాలను ఉల్లంఘించిన నాయకులు, అధికారులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని పునరుద్ఘాటించారు. విశాఖలో సోమవారం (జనవరి 27) మీడియాతో మాట్లాడిన ఆయన రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతున్నదనీ, అక్రమాలు, అన్యాయాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనన్నారు. జగన్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయనీ, వాటన్నిటినై ఒకే సారివిచారణ చేపట్డడం సాధ్యం కాదన్నారు. జగన్ హయాంలో జరిగిన  అన్ని వ్యవహారాలపై ఏకకాలంలో విచారణ జరిపించాలంటే రాష్ట్రంలో ఉన్న పోలీసులు సరిపోరని లోకేష్ చెప్పారు. ఇక దావోస్ పర్యటనలో ఎంవోయూలు లేకపోవడంపై మీడియా ప్రశ్నలకూ లోకేష్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఎంవోయూలు, దావోస్ తో సంబంధం లేకుండానే ఈ ఏడు నెలలలో కూటమి సర్కార్ ఆరు లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా రాష్ట్రానికి ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకువచ్చిందని చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను మీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏమిటో చెప్పగలరా అని నిలదీశారు.  ఇక విజయసాయి రాజీనామాపై మీడియా అడిగిన ప్రశ్నకు సొంత తల్లి చెల్లినే నమ్మని జగన్ ఎవరినీ నమ్మరని, అవసరం తీరిన తరువాత కరివేపాకులా విసిరి ఆవల పారేస్తారనీ, విజయసాయి రెడ్డిదీ అదే పరిస్థితని బదులిచ్చారు. విజయసాయిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  
Publish Date: Jan 27, 2025 2:13PM

మరో సారి ఆ పదవి చేపట్టను.. నారా లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఏ విధంగా చూసినా ఒక ప్రత్యేక నేత. ఆయన ఉన్నది ఉన్నట్లు చెబుతారు. ఎలాంటి శషబిషలూ ఉండవు. ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఆయన అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అరహరం ఆలోచించే నారా లోకేష్ సోమవారం (జనవరి 27) విశాఖ వచ్చారు. మంత్రి హోదాలో కాకుండా తన వ్యక్తిగత పని మీద విశాఖ వచ్చానని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇంతకీ ఆ వ్యక్తిగత పని ఏమిటంటారా.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఒక మీడియా సంస్థ తన పత్రికలో ప్రచురించిన వార్తపై ఆయన సదరు పత్రికపై పరువునష్టం దావా వేశారు. 2019లో ఆ పత్రికలో చినబాబు చిరుతిండి… 25 లక్షలండి… అన్న శీర్షికన లోకేశ్ పై ఓ కథనం ప్రచురించింది. మంత్రి హోదాలో విశాఖ వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్టు లాంజిలో స్నాక్స్ కోసం  ఆయన ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చుచేశారన్నది ఆ పత్రిక ప్రచురించిన కథనం సారాంశం. దానిపై నారా లోకేష్ అప్పట్లోనే సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపారు. దానికి సమాధానం ఇవ్వకపోగా పదే పదే అసత్య కథనాలు ప్రచురిస్తుండటంతో లోకేష్ ఆ పత్రికపై పరువునష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకు ఆయన విశాఖ వచ్చారు. విచారణ వాయిదా పడింది. తిరుగు ప్రయాణం అవుతూ మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.  ఇటీవల లోకేష్ ఉప ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం నేతలూ, శ్రేణులూ కూడా పోటీపడి లోకేష్ కు డిప్యటీ సీఎంగా ప్రమోషన్ అంటే గొంతెత్తారు. ఆ తరువాత పార్టీ ఆదేశాల మేరకు ఎవరూ ఈ విషయంపై గళమెత్తడం లేదనుకోండి. అది వేరు సంగతి. ఇప్పుడు విశాఖలో మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి లోకేష్ చాలా సంయమనంతో ఉప ముఖ్యమంత్రి పదవి అనే కాదు.. పార్టీ అధినేత చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా అహర్నిషలూ కష్టపడతా, పార్టీని బలోపేతం చేస్తానని బదులిచ్చారు. ఈ సందర్భంగానే ఆయన ఒక సంచలన విషయం చెప్పారు. ఇప్పటికే తాను రెండు సార్లుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నాననీ, మరో సారి ఆ పదవి తీసుకునే ఉద్దేశం లేదనీ చెప్పారు. అంతే కాదు ఏ వ్యక్తి అయినా వరుసగా రెండు సార్లకు మించి ఒకే పదవిలో ఉండకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. 
Publish Date: Jan 27, 2025 1:52PM