ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్ గఢ్  మాజీ ముఖ్యమంత్రి  భూపేశ్ బఘేల్  నివాసంలో సీబీఐ అధికారలు సోదాలు నిర్వహిస్తున్నారు,  భూపేశ్ బఘేల్ నివాసంతో పాటు  రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలు,   సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  అదే విధంగా బఘేల్  సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసాలలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  వాస్తవానికి భూపేశ్ ప్రభుత్వ హయాంలో మద్యం, బొగ్గు, మహాదేవ్ సత్తా యాప్ వంటి అనేక కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు ఇటీవల  బాఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించారు.  ఈ సోదాలు ఈ నెల  10న జరిగాయి. ఛత్తీస్ గఢ్ లిక్కర్ కుంభకోణంలో భూపేశ్ బాఘేల్ కుమారుడిపై మనీలాండరింగ్  కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే  భిలాయ్ లోని ఆయన నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. ఇప్పుడు తాజాగా బహేల్ నివాసాలపై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నది. 
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు Publish Date: Mar 26, 2025 11:29AM

మొగల్తూరు, పెనుగొండలలో పవన్ పర్యటన 28న

శ్రీమంతుడు సినిమాలో ఊరు చాలా ఇచ్చింది.. తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతాను అనే డైలాగ్ ఒకటి ఉంది.   పుట్టి పెరిగిన ఊరు అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలన్న సందేశం ఆ డైలాగ్ లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను పుట్టి పెరిగిన గ్రామాల కోసం ఏదైనా చేయాలని తపన పడుతున్నారు. వాటి రుణం తీర్చుకోవాలని ఆరాట పడుతున్నారు.  అందుకే తాను పుట్టి పెరిగిన మొగల్తూరు అభివృద్ధిపై దృష్టి సారించారు.  ఈ నేపథ్యంలోనే  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, పెనుగొండలలో పర్యటించనున్నారు. మొగల్తూరుతో పాటు పెనుగొండతో కూడా పవన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ప్రత్యేకంగా ఆ రెండు గ్రామాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆయా గ్రామాలలో ప్రజల సమస్యలన తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కూడా చేయనున్నారు.   ఈ నెల 28 ఉదయం మొగల్తూరు. సాయంత్రం పెనుగొండ గ్రామాలలో పర్యటించనున్న పవన్ కల్యాణ్ రెండు గ్రామాలలోనే గ్రామ సభలు నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా ప్రజల నుంచి గ్రామాభివృద్ధి కి సంబంధించిన ప్రతిపాదనలు స్వీకరిస్తారు. రెండు గ్రామాలలో  మౌలిక వసతుల కల్పన, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 
మొగల్తూరు, పెనుగొండలలో పవన్ పర్యటన 28న Publish Date: Mar 26, 2025 11:01AM

ఏఐ టెక్నాలజీతో న్యూస్ పేపర్ ప్రింట్ ఎడిషన్!

రిపోర్టర్లు లేరు… సబ్ ఎడిటర్లు లేరు… ప్రూఫ్ రీడర్లు లేరు… పేజీ మేకప్ ఆర్టిస్టుల్లేరు… ఫోటోగ్రాఫర్లు లేరు… ఐనా సరే, డెయిలీ పేపర్ పబ్లిషైంది… ప్రింట్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చేశాయి. నిజం..  ఇల్ ఫోగ్లియోఅనే ఇటాలియన్ పత్రిక తొలిసారిగా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్   సాయంతో ఒక ఎడిషన్‌ను ప్రచురించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం 2025 మార్చి 18 నుంచి ప్రారంభమైంది, ఒక నెలపాటు కొనసాగుతుంది. జర్నలిజంలో ఏఐ ప్రభావాన్ని పరీక్షించడానికి,  దాని ఉపయోగాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడాని ఈ పత్రికను తీసుకువచ్చినట్లు ఇల్ ఫోగ్లియో సంపాదకుడు క్లాడియో సెరాసా  తెలిపారు. జర్నలిజాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఇదొక సదవ కాశంగా అభివర్ణించారు.  
ఏఐ టెక్నాలజీతో న్యూస్ పేపర్ ప్రింట్ ఎడిషన్! Publish Date: Mar 26, 2025 10:36AM

రంజాన్ వేళ పొలిటీషియన్లకు ఈసీ షాక్

రంజాన్ పండగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో  ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొనడానికి అనుమతి లేదని ఈసీ పేర్కొంది.   ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో ఈసీ ఈ ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో కోడ్ కారణంగా రంజాన్ వేడుకలలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిథులు పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఏటా రంజాన్ మాసంలో ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీ. అలాగే  రాజకీయ పార్టీలు,   నేతలూ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుంటారు. ఎన్నికల కోడ్ పుణ్యమా అని ఈ సారి ఇక నుంచి అందుకు అవకాశం లేకుండా పోయింది. 
రంజాన్ వేళ పొలిటీషియన్లకు ఈసీ షాక్ Publish Date: Mar 26, 2025 10:25AM

రూ. 59.70 కోట్లతో పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం

పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేందర రోడ్డు, మౌలిక సదుపాయాల నిధి (ఆఆర్ఐఎఫ్) పథకం కింద సామర్లకోట- ఉప్పాడ రోడ్డులో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించింది. ఇందు కోసం 59 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.  గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చనున్నారు. ఇందు కోసం మంగళవారం (మార్చి 25) పరిపాలనా అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ తరువాత ఈ వ్యయాన్ని సీఆర్ఐఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం రియింబర్స్ చేస్తుంది.   రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు కావడం పట్ల పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని పవన్ కల్యాణ్ నెరవేర్చుకుంటున్నారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. 
రూ. 59.70 కోట్లతో పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం Publish Date: Mar 26, 2025 9:40AM