Top Stories

భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఏడుగురు కూలీలు మృతి

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బుధవారం ఘోర విషాదం సంభవించింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన నిర్మాణ పనులలో ఉన్న కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. కొందరిని స్థానికులు రక్షించారు. ఇప్పటి వరకూ అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఏడుగురు కూలీలు మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మృతుల వివరాలు కూడా తెలియరాలేదు.  
భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఏడుగురు కూలీలు మృతి Publish Date: Mar 26, 2025 5:18PM

బెట్టింగ్ యాప్ లపై రేవంత్ రెడ్డి సీరియస్ 

బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఐపిఎస్ అధికారి , ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు. యాంకర్ , ఇన్ ప్లూయెర్స్ పై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిండు అసెంబ్లీలో   బాసటగా నిలిచారు.   బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను నిషేధం విధించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహిస్తున్నవారు  రెచ్చిపోతున్నారన్నారు.  తమ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్నా సరే ఉపేక్షించబోదన్నారు.  పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.  ప్రస్తుతం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న వారిని కట్టడి చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయనుంది. 
బెట్టింగ్ యాప్ లపై రేవంత్ రెడ్డి సీరియస్  Publish Date: Mar 26, 2025 5:01PM

ఠారెత్తిస్తున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి 3వ వారంలోనే తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదౌతున్నాయి. ఎండకు తోడు వడగాల్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేద్ లో ఎండ తీవ్రత దడపుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక ప్రజలను మరింత భయపెడుతోంది. రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఎండ వేళల్లో బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. అనివార్యంగా బయటకు రావలసి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  
ఠారెత్తిస్తున్న ఎండలు Publish Date: Mar 26, 2025 4:56PM

వంశీకి ఇప్పట్లో బెయిలు కష్టమే!?

గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్థం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఏ1 గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగాను పోలీసులు అరెస్టు చేశారు. రంగాను మంగళవారం (మార్చి 25) రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఓలుపల్లి మోహన్ రంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడు. దీంతో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే అంటున్నారు. ఎందుకంటే తొలుత గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వంశీ పేరు లేదు. అయితే తరువాత వరుసగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించిన సందర్భంలో వంశీ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో  ఆయన పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. అలా చేర్చిన తరువాతే అరెస్టు భయంతో ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేసిన వంశీ ఆ క్రమంలో నిండా మునిగారు. కిడ్నాప్ కేసులో అరెస్టై జైలుపాలయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో వంశీకి కుడి భుజంగా చెప్పుకునే మోహన్ రంగా పోలీసులకు చిక్కడంతో  వంశీకి  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ పెండింగులో ఉంది. ఇక కిడ్నాప్ కేసులో వంశీ బెయిలు పిటిషన్ విచారణ దశలో ఉంది. ఇప్పుడు వంశీ కుడిభుజం మోహన్ రంగా అరెస్టుతో.. వంశీకి బెయిలుపై బయటకు వచ్చే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసులో ఒక వేళ బెయిలు దొరికినా.. తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో మాత్రం ఇప్పట్లో బెయిలు లభించే అవకాశాలు దాదాపు లేనట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఎలా చూసినా మోహన్ రంగా అరెస్టుతో వంశీకి మరిన్ని చిక్కులు తప్పవని అంటున్నారు. 
వంశీకి ఇప్పట్లో బెయిలు కష్టమే!? Publish Date: Mar 26, 2025 4:11PM

నకిరేకల్ లో కేటీఆర్ పై రెండు కేసులు

బిఆర్‌ఎస్‌  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై నల్లొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నల్గొండ జిల్లా కకిరేకల్ పోలీసు స్టేషన్ లో కేటీఆర్ పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్టులు మన్నె క్రిశాంక్‌, కొణతం దిలీప్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.  నకిరేకల్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో   సోషల్ మీడియా వేదికగా  తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ  నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్‌ వేర్వేరుగా నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేపర్‌ లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం ఉందంటూ తెలుగు స్క్రైబ్‌లో వచ్చిన కథనాన్ని కేటీఆర్‌  ఎక్స్‌  లో షేర్‌ చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు   ఏ 1గా మన్నె క్రిశాంక్‌, ఏ 2 గా కేటీఆర్‌, ఏ 3గా కొణతం దిలీప్‌ కుమార్‌లతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఉగ్గిడి శ్రీనివాస్‌  ఫిర్యాదు మేరకు  ఏ1 గా కొణతం దిలీప్‌ కుమార్‌ , ఏ2గా మన్నే క్రిశాంక్‌, ఏ 3గా కేటీఆర్‌, మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.   పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మొత్తం 11 మంది నిందితులతోపాటు ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మైనర్‌ బాలునితో పాట ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.  
నకిరేకల్ లో కేటీఆర్ పై రెండు కేసులు Publish Date: Mar 26, 2025 3:49PM