ఢిల్లీ సిఎంగా రేఖా గుప్తా ప్రమాణం

27 ఏళ్ల తర్వాత  ఢిల్లీలో బిజెపి అధికారంలో వచ్చింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తో బాటు ఆరుగురు మంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా  వారి చేత ప్ర‌మాణం చేయించారు.  మంత్రులుగా ప‌ర్వేశ్ శ‌ర్మ‌, సాహిబ్ సింగ్‌, అశీశ్ సూద్‌, మంజీంద‌ర్ సింగ్‌, ర‌వీంద‌ర్ ఇంద్ర‌జ్ సింగ్, క‌పిల్ మిశ్రా, పంక‌జ్ కుమార్ సింగ్ ప్ర‌మాణం చేశారు.  ఈ వేడుకకు  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా,  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. 
Publish Date: Feb 20, 2025 12:06PM

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. జగన్ పై కేసు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆంక్షలను ఉల్లంఘించి, నియమావళిని పట్టించుకోకుండా జగన్ బుధవారం (ఫిబ్రవరి 19) గుంటూరు మిర్చియార్డ్ లో పర్యటించిన సంగతి విదితమే. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కనుక మిర్చియార్డ్ పర్యటనకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినా, పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించినా జగన్ లేక్క చేయకుండా మిర్చియార్డు ను సందర్శించి అక్కడ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ పై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.  ఈసీ, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై కూడా కేసు నమోదైంది.  
Publish Date: Feb 20, 2025 11:55AM

విపత్తు నిధులలో ఏపీకి సింహ భాగం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మాటకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నది. ఆయన విజ్ణప్తుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నది. బడ్జెట్ కేటాయింపులలోనూ, అమరావతి, పోలవరం లకు సహకారం విషయంలోనూ ఈ విషయం ఇప్పటికే ధృవపడింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన విపత్తు, వరదల సహాయం నిధుల విషయంలోనూ ఏపీకి సింహభాగం దక్కింది. కేంద్రం తాజాగా ఐదు రాష్ట్రాలకు కలిపి విపత్తు, వరదల సహాయం కింద1,554.99 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధులలో అత్యధికంగా ఏపీకి 608.08 కోట్ల రూపాయలు కేటాయించింది.  ఇక మిగిలిన రాష్ట్రాలలో తెలంగాణకు  231 కోట్ల రూపాయలు, త్రిపురకు  288.93 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అలాగే ఒడిశాకు 255.24, నాగాల్యాండ్ కు 170.99 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసింది. 
Publish Date: Feb 20, 2025 11:42AM

ముడా కేసులో పీచేముఢ్.. కర్నాటక సీఎంకు లోకాయుక్త క్లీన్ చిట్

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ  (ముడా) స్థల కేటాయింపుల వ్యవహారంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లోకాయయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో  కర్ణాటక ముఖ్యమంత్రి   సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని లోకాయుక్త పేర్కొంది. ఈ మేరకు పోలీసుల ఇప్పటికే హైకోర్టుకు తిది నివేదిక సమర్పించినట్లు లోకాయుక్త పోలీసులు తెలిపారు. త ఈ కేసులో సిద్ధరామయ్య  , ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, భూ యజమాని దేవరాజు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.   ఈ కేసులో సిద్ధరామయ్య భార్య పార్వతికి ముడా అధిక విలువ ఉన్న ప్రాంతంలో స్ధలాలు కేటాయించిందన్న ఆరోపణలు ఉన్నాయి.   ప్రస్తుత నివేదికలో.. పార్వతికి కేటాయించిన స్థలంపై అనుమానాలు ఉన్నా.. ఆమె వద్ద 3.16 ఎకరాల భూమికి చట్టపరమైన హక్కులున్నాయా? లేదా? అనే అంశంపై ఇంకా విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.  లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఈడీ మాత్రం ఈ కేసులో దర్యాప్తు కొనసాగించనుంది.  
Publish Date: Feb 20, 2025 11:21AM

టీటీడీ ఉద్యోగుల ఆందోళన వెనుక రాజకీయ హస్తంపై అనుమానాలు!

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.   ఇటీవల వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. ఇందుకు టీటీడీ పాలకమండలి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల మధ్య సమన్వయ లోపమే కారణమన్నవిమర్శలు వెల్లువెత్తాయి. ఆ వివాదం ఇంకా పూర్తిగా మరుగున పడకుండానే టీటీడీ పాలకమండలి సభ్యులు, ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం మరోసారి ప్రస్ఫుటంగా వెలుగులోకి వచ్చింది.   కర్ణాటక నుంచి టీటీడీ బోర్డులో సభ్యుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నసురేష్ కుమార్ సహనం కోల్పోయి ఆలయ మహద్వారా వద్ద దూషించారు. దీనిపై అధికారులు, బోర్డు పెద్దలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటనపై టీటీడీ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి.   ఉద్యోగిపై దూషణల పర్వానికి దిగిన బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగులు టీటీడీ పరిపాలనా భవన్ వద్ద నిరసనకు దిగారు.   తిరుమలలో టీటీడీ ఉద్యోగిని దుర్భాషలాడి దౌర్జన్యానికి పూనుకున్న బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ను బోర్డు నుండి తొలగించి, ఆయనపై కేసు నమోదు చేయాలని  ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.  బాధ్యతాయుతంగా ఉండాల్సిన బోర్డు సభ్యుడు సురేశ్ కుమార్ సంయమనం కోల్పోయి ఉద్యోగిని దూషించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు పవిత్రమైన వెంకన్న స్వామి దేవాలయ మహాద్వారం వద్ద అమర్యాదగా ప్రవర్తించిన సురేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి.లేకుంటే ఆయనను బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.   జగన్ హయాంలో తిరుమల  పవిత్రతకు భంగం కలిగేలా పలు సంఘటనలు చోటు చేసుకున్నా కిమ్మనని ఉద్యోగులు ఇప్పడు ఒక బోర్డు మెంబర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన బాట పట్టడం వెనుక రాజకీయ ప్రమేయం ఉన్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జగన్ హయాంలో టీటీడీలో జరిగిన  ఆర్థిక వ్యవహారాలపై అవక తవకలపై ఎన్నడూ  నోరెత్తని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఆందోళన బాటపట్టడం వెనుక ఏదో కుట్ర ఉందని అంటున్నారు.  బోర్డు సభ్యుడు ఉద్యోగిపై దూషణల పర్వానికి దిగడం ఏ విధంగా చూసినా తప్పే. దీనిపై సమగ్ర విచారణ జరిపి సదరు సభ్యుడిపై చర్య తీసుకోవాలి డిమాండ్ చేయడాన్ని కూడా ఎవరూ తప్పుపట్టరు. అయితే ఏకంగా విధులు మానేసి టీటీడీ పరిపాలనా విభాగం వద్ద ధర్నాకు దిగడమే దీని వెనుక రాజకీయం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. 
Publish Date: Feb 20, 2025 11:05AM