ఆహార మార్గాలే ఆరోగ్య సూత్రాలు!! 

 

ఆహారం మనిషికి శక్తివనరు. అది లేకపోతే ఈ శరీరం కాలంతో పాటు కదలదు. అయితే చాలామందికి శరీరం మీద వ్యామోహం ఉంటుంది, ఆహారం మీద వ్యామోహం ఉంటుంది కానీ ఆరోగ్యం మీద స్పృహ కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ ఆరోగ్య స్పృహ తక్కువ వుండటం వల్లనే ప్రస్తుత కాలంలో ప్రతి మనిషి ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే ఉన్నాడు. వాటికి పరిష్కారం వాడే మందుల్లో ఉండదు, తీసుకునే ఆహారం తీసుకునే విధానంలో ఇంకా చెప్పాలంటే తీసుకునే తీరులో ఉంటుంది.

ఏమి తింటున్నాం?? ఎలా తింటున్నాం??

ఆహారమే అమృతం అంటారు పెద్దలు. ఒకప్పటి కాలంలో మనిషికి రోగం వస్తే ఆహారాన్నే ఔషధంగా పెట్టేవారు. పత్యం, కషాయం లాంటివి ఇస్తూ రోగాన్ని తరిమికొట్టేవారు. కాన్సర్ లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మహిళల గర్భాశయ సమస్యలు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి కానే కాదు. పాశ్చాత్య జీవన విధానం ఎప్పుడైతే ఇక్కడ మొదలయ్యిందో అప్పుడే ఇక్కడ రోగాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. అంటే ఆహారంలో అలవాట్లు, ఆహారం తీసుకునే విధానంలో మార్పులు ఎంతో స్పష్టమైపోయాయి జీవితంలో.

పచ్చిగా తినాల్సినవి ఉడికిస్తూ, ఉడికించి తినాల్సినవి వేయిస్తూ, వేయించాల్సినవి కాలుస్తూ, ఇట్లా ఆహారాన్ని గందరగోళం చేయడం మొదలుపెట్టాకే మన జీర్ణవ్యవస్థ గందరగోళం అయ్యి, ఆరోగ్యం అయోమయం అయిందని చెప్పచ్చు.

ప్రోటీన్లు, పోషకాలు ఎక్కడున్నాయి??

అందరికీ ప్రోటీన్లు, పోషకాలు అంటే మాంసాహరమే గుర్తొస్తుంది. నిజానికి మన భారతీయ అసలైన పోషకాలు ధాన్యాలు, గింజలు, పాలు వంటి వాటిలో ఉంది. ఒకప్పుడు అందరూ నువ్వులు, బెల్లం, పాలు, పంట ధాన్యాలు, పల్లీలు, పప్పులు ఇవి మాత్రమే కాకుండా ఉలవలు, అవిసెలు వంటివి విరివిగా వాడేవారు. దానివల్ల శరీరం ఎంతో పటిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మినపసున్నుండలు మన ఆహార సంపదలో గొప్పగా చెప్పుకోదగ్గవని, అవి మాంసహారాన్ని మించి పోషకాలు అందిస్తాయని అందరికీ తెలిసిందే. అందుబాటులో ఇన్ని ఉన్నా మనుషులు మాంసాహారం కోసమే తహతహలాడటం ఏమిటో మరి!!

 ఉత్పత్తులు ఉత్తుత్తి బడాయిలు!!

మీ పేస్ట్ లో ఉప్పు ఉందా?? ఇదిగో కొత్త ప్రొడక్ట్ ఇందులో ఉప్పు ఉంది. పళ్ళను బలంగా చేస్తుంది. నారింజ పోషకాలు నిండిన డ్రింక్, విటమిన్ సి ను సమర్థవంతంగా శరీరానికి అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరిగేపిల్లల కోసం కొత్త హెల్తీ  డ్రింక్. ఒక స్పూన్ పొడి పాలలో కలిపిస్తే రోజుకు మొత్తం కావాల్సిన పోషకాలు అందుతాయి.

అబ్బాబ్బా ఏమైనా ప్రచారాలా ఇవి. కాస్త దుచి కోసం ఎక్కలేని రసాయనాలు కలిపి దాన్ని పోషకాల డ్రింక్ గానూ, పోషక పదార్థాలుగానూ కలర్ ఇస్తూ వందల, వేలకు అమ్ముతూ కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పుకుంటున్నాయి. 

ఫ్యాక్టరీలలో బాదం, నువ్వులు, పల్లీలు వంటి నూనె గింజల నుండి నూనె ఉత్పత్తి చేయగా మిగిలిన పిప్పితో ఈ హెల్త్ డ్రింక్ లు తయారు చేసి ప్రజల సొమ్మును దోచుకుంటున్న ఈ మాయజాలన్ని గుర్తించక అందులో పడిపోతున్నారు పిచ్చి జనం.

ఏది అసలైన ఆహారం!!

నానబెట్టిన పల్లీలు ఎంతో గొప్ప పోషకం, అలాగే  నువ్వులు, బెల్మ్, అవిశేలు, ముఖ్యంగా ఉలవలు. అవి వేడి చేసినపుడు వేడి తగ్గడానికి ప్రత్యామ్నాయంగా పెసలు. ఇంకా జొన్నలు, రాగులు, సద్దలు, వీటితో పాటు సిరిధాన్యాలు. ఇవన్నీ గొప్ప ఆహారం.

బాటల్స్ లో ఉన్న పండ్ల రసాలకు బదులు తాజాగా ఉన్న ఒక్క పండు తిన్నా ఎంతో ఆరోగ్యకరం. అలాగే వండిన ఏ పదార్థమైనా గంట లోపు గింటే అది గొప్ప అమృత గుణం కలిగి ఉంటుంది.

ఇట్లా భారతీయ ఆహార సంపద, అది చేకూర్చే ఆరోగ్యం, అనారోగ్యానికి అవే విరుగుడు. ఇవన్నీ తెలుసుకుంటే మన ఆహార మార్గాలే ఆరోగ్య సూత్రాలు అవుతాయి.

◆ వెంకటేష్ పువ్వాడ