చింతన్ శిబిర్ ఓ విఫల ప్రయత్నం తేల్చేసిన పీకే ..

పూర్వ వైభవమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల  పాటు ‘చింతన్‌ శిబిర్ర్‌’ నిర్వహించింది. సుమారు 400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ శిబిరంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ భవిష్యత్ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. తీర్మానాలు చేశారు.ఒక విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం తర్వాత ఒక కదలిక వచ్చిందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే, చివరాఖరుకు, అలాంటి పాజిటివ్ వైబ్స్ ఏమీ కనిపించలేదనే విశ్లేషణలు వినిపించాయి. 

అదలా ఉంటే ఈ మూడు రోజుల శిబిరం పై ఇప్పటికే చాలా వాఖ్యలు, విశ్లేషణలు వచ్చాయి. రాజకీయ పండితులు మొదలు చాల మంది చాలా చాలా విశ్లేషణలు చేశారు. ఇంచు మించుగా దేశంలో ఉన్న అన్ని పత్రికలు, చింతన్ శిబిరంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి కథనాలు ప్రచురించాయి.టీవీ చానల్స్ చర్చలు జరిపాయి. అయితే, అదంతా ఒకెత్తు అయితే, ఇప్పుదు తాజాగా రాజకీయ విశ్లేషణలో, వ్యూహ రచనలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈమూడు రోజుల ముచ్చటపై స్పందించారు. ఆయన అన్నీ ఇన్నీ మాటలు లేకుండా ఒకే ఒక్క ముక్కలో , ‘అదొక విఫల ప్రయత్నం’ అని తేల్చేశారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమై, పార్టీ పునర్జీవనానికి ప్రణాళికను సైతం సిద్ధం చేసిన పీకే చేసిన ఈ తాజా వ్యాఖ్య ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్’ను మరో మారు చర్చనీయాంశం చేసింది. 

ప్రశాంత్ కిశోర్, చింతన్ శిబిర్’ విఫల ప్రయత్నం అనడంతో పాటుగా కొంత వివరణ కూడా ఇచ్చారు. ‘‘ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌ గురించి మాట్లాడాలని నన్ను పదే పదే అడుగుతున్నారు.నా అభిప్రాయంలో అదో విఫలమైన ప్రయత్నం.గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల ఓటమి వరకు కాంగ్రెస్‌ అధినాయకత్వానికి సమయం ఇవ్వడం, యథాతథ స్థితిని మరింత కాలం కొనసాగించడానికి తప్ప అర్థవంతమైన పరిష్కారాన్ని సాధించడంలో ఆ శిబిరం విఫలమైంది’’ అని పీకే వ్యాఖ్యానించారు.అంటే పరోక్షంగానే అయినా, చింతన వ్యర్ధం అని చెప్పడంతో పాటుగా, మరో ఆరు నెలల్లో జరిగే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పకనే చెప్పారు. 
నిజానికి ఇది ఒక్క పీకే అభిప్రాయం కాదు. కాంగ్రెస్ పార్టీ పునర్జీవనాన్ని గట్టిగా కోరుకుంటున్న వామపక్ష మేథావులు సహా రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఇంచుమించుగా ఇదే అభిప్రాయం వ్యక్త పరిచారు. అయితే, చింతన శిబిరానికి కొద్ది రోజుల ముందు, కాంగ్రెస్‌, ప్రశాంత్‌ కిశోర్‌ మధ్య పలుమార్లు చర్చలు జరగడం  ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు వచ్చిన నేపధ్యంలో పీకే వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

అదలా ఉంటే చింతన్ శిబిర్ ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ ఝాకర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీతో ఝాకర్ కుటుంబానికి సుదీర్ఘ అనుబందం వుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బలరాం ఝాకర్ కుమారుడే, సునీల్ ఝాకర్.అలాగే గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,  పటేదార్ ఉద్యమ నాయకుడు, హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు కానీ, చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో గుజరాత్’ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే, హిమాచల్ ప్రదేశ్’లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడు భజన్ లాల్ కుమారుడు. కులదీప్ బిషన్ కూడా రేపో మాపో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కులదీప్ బిషన్ రాష్ట్ర బీజీపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేసంయ్యారు.  దీంతో ఆయన కూడా బీజేపీలో చేరతారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. 

మరోవంక ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీలో చేరిన నాయకులను బీజేపీ పదవులతో కట్టి పడేస్తోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిస్వాస్ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ షా, మణిపూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్, ఇలా అనేక మంది మాజీ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో ముఖ్యమంత్రులు, రాష్ట్ర  మంత్రులుగానే కాదు, జ్యోతిరాదిత్య సిందియా, చౌదరి బీరేంద్ర సింగ్, రావు ఇంద్రజిత్ సింగ్ వంటి మాజీ కాంగ్రెస్ నాయకులు  కేంద్ర ప్రభుత్వంలోనూ మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. దీంతో ఇంకొందరు యువ నాయకులు, ముఖ్య్మగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్’ను వదిలి బీజేపీలో చేరే అవకాశం లేక పోలేదని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిరం’ లో సరైన నిర్నాయ్లు తీసుకోక పోవడంతో  పార్టీ పునర్జీవన అవకాశాన్ని మరోమారు జడవిదాచుకుందని పరిశీలకులు భావిస్తున్నారు.