రాజు మ‌ర‌ణంపై హైకోర్టులో పిల్‌.. కస్టోడియల్‌ మృతిగా అనుమానం!

మృగం చ‌చ్చింది. అయినా వివాదం కొన‌సాగుతోంది. సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు మృతిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిల్‌ దాఖలు చేశారు. రాజుది కస్టోడియల్‌ మృతిగా అనుమానం ఉందని పిటిషనర్ తెలిపారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది.  

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన నిందితుడు రాజు గురువారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై మృతిచెందాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు వెయ్యి మంది పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌గా.. ఆ ఒత్తిడి త‌ట్టుకోలేక‌, తానిక త‌ప్పించుకోలేన‌ని భావించి రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. 

అయితే, త‌మ కొడుకును పోలీసులే ఉరికించి చంపేశార‌ని రాజు త‌ల్లి వీర‌మ్మ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. పోలీసులు అంత‌కు మూడు రోజుల ముందే రాజును అదుపులోకి తీసుకున్నార‌ని ఆమె ఆరోపించారు. దీంతో.. ఇది పోలీసులు చేసిన హ‌త్యా? లేక‌, ఆత్మ‌హ‌త్యా? అనే అనుమానం వ్య‌క్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్ హైకోర్టులో పిల్‌ దాఖలు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.