సొమ్ము ప్రజలది సోకు సర్కార్’ ది పంజాబ్ ‘పందారం’ పై జనాగ్రహం

తెలంగాణ సాధన కోసం సుమారు పుష్కర కాలానికి పైగా సాగిన మలి దశ ఉద్యమంలో 1200 మందికి పైగా తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేశారు. అమరులయ్యారు. మరో వారం పది రోజులలో (జూన్ 2 తేదీ) తెలంగాణ రాష్ట్రం అవతరించి ఎనిమిది (8) సంవత్సరాలు పూర్తవుతాయి. అయినా, రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన ఆ 1200 మంది అమర వీరుల కుటుంబాలలో సగం కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పూర్తిగా అందలేదు. అందులో సగం మందిని తెలంగాణ ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. మరి కొందరి చిరునామాలే లేవని ఫైల్స్ క్లోజ్ చేసింది. అందుకే అమర వీరుల కుటుంబాలను గుర్తించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలే కాదు అమరుల కుటుంబాలు,సైతం ఆరోపిస్తున్నాయి. 

అంతే కాదు, ఈరోజుకు కుడా  నిధులు, నీళ్ళు, నియామకాల కోసం ఉద్యమించిన యువత కలలు నెరవేరలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు, రైతులు ఆత్మహత్యలు ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగానే సాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు చనిపోయారు. అనధికారిక లెక్కల ప్రకారం 40 వేల మంది చనిపోయారు. ఆ కుటుంబాలకు ఇవ్వవలసిన పరిహారం ఇవ్వ‌లేద‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకసారి కాదు, అనేక సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు.పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే, నిరుద్యోగ యువకులు ఇక తమకు ఉద్యోగ యోగం లేదనే నిరాశకుగురై, ముఖ్యమంత్రికి లేఖలు రాసి మరీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు.  

అయితే, జాతీయ రాజకీయాల్లో స్థానం కోసం తహతహ లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన ఆరు వందల మంది పంజాబ్ రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షల చొప్పున దాదాపుగా రూ. పద్దెనిమిది కోట్లను నష్టపరిహారంగా అందించేందుకు పంజాబ్’ కు పయనమయ్యారు. మంచిదే, పొరుగు వారికి సహాయం చేస్తామంటే, వద్దనే వారుండరు. అయితే, తెలంగాణ అమరవీరులకు, అదే విధంగా తెలంగాణలో బలవన్మరణాలకు పాల్పడిన  రైతులు, నిరుద్యోగ యువకులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం, పంజాబ్ రైతులకు పరిహారం చెల్లించడం ఏమిటని, ప్రశ్నిస్తున్నారు.ఇది అమ్మకు అన్నం పెట్టని వాడు, పిన్నమ్మకు వడ్డాణం చేయిస్తానని, అన్నట్లుగా ఉందని అంటున్నారు. 
అదే సమయంలో రాజకీయ వర్గాల్లోనూ ముఖ్యమత్రి కేసీఆర్ ‘దాతృత్వం’ పై చర్చ జరుగుతోంది. విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓ వంక తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తుంటే, వారిని పట్టించుకోకుండా… ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్’లో చనిపోయిన రైతులను  ఆదుకుంటామని బయలుదేరారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని సామాన్య  ప్రజలు కూడా గుర్తించారు. 

ఓ వంక కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల లెక్కలు తీస్తున్న తెరాస ప్రభుత్వం,  తెలంగాణ రైతుల వద్ద నుంచి  బాయిల్డ్ రైస్ కొనేందుకు నిరాకరించి, కేంద్రంతో కయ్యానికి కాలు దువ్విన ముఖ్యమంత్రి, పంజాబ్ రైతులకు తెలంగాణ ప్రజలు చెల్లించిన పన్ను పైసలు ఎలా పందారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.  దేశంలో 28 రాష్ట్రాలున్నాయి, అయినా మరే రాష్ట్రం కూడా పంజాబ్ రైతులను ఆదుకుంటామని ముందుకు రాలేదు. నిజానికి ఆ అవసరం కూడా లేదు. అందుకే, మరో రాష్ట్ర ప్రభుత్వమే కాదు , పంజాబ్ ప్రభుత్వం కూడా ఢిల్లీ ఆందోళనలో చని పోయిన రైతులకు పరిహారం చెల్లించలేదు. చివరకు పంజాబ్’లో అధికారంలో ఉన్న ఆప్’ ఢిల్లీలోనూ అధికారంలో ఉంది,

అయినా పంజాబ్ రైతులకు పైసా సాయం చేయలేదు. అలాంటప్పుడు  తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధమన్న వాదన వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ వంద కోట్లకు చేరిన తెరాస నిధుల నుంచి పంజాబ్ రైతులకు అడుకోవచ్చని, కానీ,   తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో రాజకీయం చేస్తున్నారని.. అక్కడ మైలేజీ కోసం ప్రజా ధనం వాడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్ష పార్టీలు అదే విమర్శలు చేస్తున్నాయి. రైతు కుటుంబాలను ఆదుకోవడాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ.. ముందుగా సొంత రాష్ట్ర రైతుల్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. అది ఎవరి సొమ్ము.. ఎవరు, ఎందుకోసం దానం చేస్తున్నారు? అనే ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాదానం చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు