న్యాయ ప్రముఖుల ఫోన్లు హ్యాక్! పెగాసస్ మరో కలకలం.. 

పెగాసస్ స్పైవేర్ అంశం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు సహా 300 మంది భారతీయుల ఫోన్లపై పెగాసస్ నిఘా పెట్టిందనే ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. పెగాసస్‌పై పార్లమెంట్ వేదికగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. పెగాసస్ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంత వివాదం సాగుతుండగానే పెగాసస్ కు సంబంధించి మరో సంచలం విషయాలు తాజాగా వెలుగులోనికి వచ్చాయి.

పెగాసస్ స్పై వేర్ కు సంబంధించి ది వైర్ మరో సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. పెగాసస్ నిఘా పెట్టిన వారిలో  న్యాయ వ్యవస్థకు చెందిన ప్రముఖులు ఉన్నట్లుగా పేర్కోంది. తాజాగా పబ్లిష్ చేసిన కథనంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పాత ఫోన్ నంబరు.. మాజీ అటార్నీ జనరల్ సహాయకుడి ఫోన్ నంబరు కూడా నిఘా పెట్టాల్సిన జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు ఎన్ కే గాంధీ టీఐ రాజ్ పుత్ ల ఫోన్లను 2019లోనే నిఘా జాబితాలో ఉన్నట్లుగా ది వైర్ తాజా కథనంలో వెల్లడించింది.  సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ల ఫోన్లపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు ది వైర్ వివరణ ఇచ్చింది. సుప్రీంకోర్టులో కీలకమైన రిట్ పిటిషన్ల విభాగంలో రిజిస్ట్రార్లు పని చేస్తుంటారు. సంవత్సరానికి దాదాపు వెయ్యికి పైగా రిట్ పిటిషన్లు వస్తుంటాయి. వాటిల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికిగురి చేసేవి.. రాజకీయంగా సున్నితమైన అంశాలు కూడా సదరు పిటిషన్ లో ఉంటాయి కాబట్టి.. అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్రం నిఘా పెట్టి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని ది వైర్  వ్యక్తం చేసింది. 

ఇక మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వద్ద పని చేసే జూనియర్ న్యాయవాది తంగతురై ఫోన్ నెంబరు కూడా స్నూపింగ్ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. అటార్నీజనరల్ పదవి నుంచి రోహత్గీ వైదొలిగిన రెండేళ్ల తర్వాత తుంగతురై ఫోన్ నెంబరును హ్యాక్ చేయాల్సిన జాబితాలో ఉన్నట్లుగా రోహత్గీ అధికారపక్షానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారు. అందుకే.. ఆయన పేరును కూడా నిఘా జాబితాలో చేర్చి ఉండొచ్చని విశ్లేషించింది. గతంలో వచ్చిన కథనమే తీవ్ర కలకలం రేపుతుండగా.. తాజాగా న్యాయ ప్రముఖులపైనా నిఘా పెట్టారని తేలడంతో ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి మరీ..