సినిమా టికెట్లపై సీరియస్.. ప్రజా సమస్యలపై సైలెన్స్! ఇదేందయ్యా పవన్ కల్యాణ్.. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రాజుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం సాగుతోంది. రిప‌బ్లిక్ సినిమా ఈవెంట్ లో  వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలతో రాజుకున్న వేడి.. మరింత తీవ్రమవుతోంది. ఏపీ పాల‌కుల‌ను స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లూ అంటూ మొద‌లుపెట్టి.. సినిమా టికెట్ల‌ ఆన్‌లైన్ అమ్మ‌కాల‌పై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు పవన్. వెంటనే రియాక్ట్ అయిన  మంత్రులు, వైసీపీ నేతలు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మంత్రులు, వైసీపీ నేతలు త‌న‌పై అటాక్‌కు దిగ‌డంతో మ‌రోసారి ట్వీట్‌తో పంచ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతల మాటలను గ్రామ సింహాల అరుపులతో పోల్చారు. 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. మొరిగే కుక్క‌ల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌నే అర్థం వ‌చ్చేలా ట్వీట్ చేశారు. పవన్ కౌంటర్ ట్వీట్ కు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి పేర్నినాని. 

పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య వార్ సాగుతుండగానే మరో అంశంపై జనాల్లో చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఎందుకు స్పందించారన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. సినిమా టికెట్లను ఆన్ లైన్ విక్రయించాలన్న జగన్ సర్కార్ నిర్ణయంపై ఓ రేంజ్ లో ఫైరైన పవన్ కల్యాణ్.. ఏపీ సమస్యల విషయంలో ఎందుకు ఇంతలా స్పందించలేదని కొన్ని వర్గాల నుంచి ప్రశ్న వస్తోంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో పాలనా అస్తవ్యస్థంగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఏపీ ప్రస్తుతం అప్పుల ఊబిలో చిక్కుకుంది. దేశంలోనే అప్పులు ఎక్కువ చేసిన రాష్ట్రాల్లో టాప్ లో ఉంది. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. ప్రతి నెలా అప్పులు తెస్తేనే ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులపై పవన్ కల్యాణ్ ఎందుకు ఈ స్థాయిలో ప్రశ్నించలేదని కొందరు అడుగుతున్నారు.

టీడీపీ ప్రభుత్వం అంతర్జాతీయ రాజధానిగా నిర్మించేందుకు ప్లాన్ చేసిన అమరావతిని జగన్ సర్కార్ మూడు ముక్కలు చేసే ప్రతిపాదన చేసింది. కోర్టు కేసులతో ప్రస్తుతానికి ఆగిపోయినా.. అమరావతిని మాత్రం గాలికొదిలేసింది. రాజధాని రైతులు 20 నెలలకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే అమరావతి విషయంలో ఏదో మాట్లాడాలన్నట్లుగా స్పందించారు కాని.. సినిమా టికెట్లపై స్పందించినంత రేంజ్ లో పవన్ ఎందుకు రియాక్ట్ కాలేదనే ప్రశ్న వస్తోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమించలేదని కొందరు అడుగుతున్నారు. గతంలో అమరావతికి మద్దతు తెలిపిన పవన్.. ఆ రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నా సీరియస్ గా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి.  సినిమా టికెట్ల ఇష్యూపై మాట్లాడినంత ఘాటుగా అమరావతి విషయంలో మాట్లాడితే  రాజధాని ఉద్యమానికి మరింత ఊపు వచ్చేదని అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్... ఆంధ్రుల హక్కుగా సాధించిన కర్మాగారం. విశాఖ ఉక్కును ప్రైవేటుకు అమ్మేస్తోంది మోడీ ప్రభుత్వం. ఆంధ్రుల ఆత్మగౌరవంగా చెప్పుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాత్రం సీరియస్ గా రియాక్ట్ కాలేదు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంతో.. ఆయన ఈ విషయంలో సైలెంటుగానే ఉండిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయవద్దంటూ కొన్ని ప్రకటనలు చేయడం తప్ప... బీజేపీని తీవ్రంగా విమర్శించి లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి కీలకమైన అంశంలో మాట్లాడని పవర్ స్టార్... సినిమా టికెట్ల విషయంలో మాత్రం తీవ్రంగా రియాక్ట్ కావడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీ అధినేతగా ఉంటూ... ప్రజా సమస్యలపై పెద్దగా పట్టింపు లేదన్నట్లుగా వ్యవహరిస్తూ... సినిమాల విషయంలో మాత్రం సీరియస్ గా రియాక్ట్ కావడం చర్చగా మారింది. 

ఇవే కాదు.. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆలయాలపై దాడులు జరిగాయి. టీటీడీ నిత్యం వివాదాల్లో ఉంటుంది. ఆస్తి పన్ను పెంచిన ప్రజలపై భారం మోపారు. పెట్రోల్, డీజిల్ ధరలు... దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ. లిక్కర్ పాలసీపై మొదటి నుంచి వివాదమే ఉంది. ఇసుక, మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలోనే గ్యాంగ్ రేప్ జరిగింది.  ఇలాంటి సమస్యలపై పవన్ కల్యాణ్ ఏనాడు సీరియస్ గా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. ఇవే ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రజా సమస్యలు చాలా ఉన్నా పెద్దగా స్పందించని పవన్ కల్యాణ్... తన సినిమాకు అడ్డంకులు స్పష్టించారనే కారణంగా ప్రభుత్వంపై రెచ్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. 

పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే... ఆయనకు రాజకీయాలకన్నా సినిమాలే ముఖ్యమన్నట్లుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. జనసేన పార్టీకి  చీఫ్ గా ఉంటూ రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువన్నట్లుగా వ్యవహరించడం ఆయనకు మైనస్ అవుతుందంటున్నారు. ఇలాంటి చర్యలతో రాజకీయాలపై సీరియస్ నెస్ లేదనే ముద్ర ఆయనపై పడుతుందని చెబుతున్నారు.