హద్దులు దాటిన పోసాని, పీకే వార్.. దాడులతో హై టెన్షన్..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ మధ్య సాగుతున్న వివాదం హద్దులు దాటేసింది. వ్యక్తిగత విమర్శలు దాటి కుటుంబ సభ్యులకు వరకు వచ్చింది. పచ్చి బూతులు నాట్యం చేస్తున్నాయి. చివరకు దాడుల వరకు వచ్చింది.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణ మురళీపై దాడికి జనసైనికులు ప్రయత్నించడం హై టెన్షన్ పుట్టించింది.  తెలంగాణ పోలీసులు స‌రైన స‌మ‌యంలో స్పందించడంతో పోసాని క్షేమంగా బయటపడ్డారు. లేదంటే పీకే ఫ్యాన్స్ చేతిలో పోసాని భౌతిక దాడికి కూడా గుర‌య్యేవారే. పోసాని ప్రెస్ మీట్ కు ముందే ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌చ్చి హంగామా చేసినా.. పోలీసులు వారిని నిరోధించారు. ఆ త‌ర్వాత పోసాని అక్క‌డి నుంచచి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో ఎక్క‌డున్నారో గానీ.. ఒక్క‌సారిగా ప‌లువురు ప‌వ‌న్ ఫ్యాన్స్ పోసానిపై దాడికి య‌త్నించారు. అయితే అప్ప‌టికే భారీ సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఈ దాడిని నివారించారు.

పవన్ కల్యాణ్ వైసీపీపై ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది.వైసీపీ స‌ర్కారుపై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఓ వైపు ఏపీ మంత్రులు వ‌రుస‌బెట్టి కౌంట‌ర్లు ఇస్తుండగానే.. సోమ‌వారం  మీడియా ముందుకు వ‌చ్చి 
కౌంటర్ ఇచ్చారు పోసాని. ప‌వ‌న్ ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఆ వ్యాఖ్య‌ల్లో వ్య‌క్తిగ‌త అంశాలు అంత‌గా లేకున్నా.. ఓ యువ‌తిని ప‌వ‌న్ గ‌ర్భ‌వ‌తిని చేశారంటూ పోసాని నోరు జారారు. ఈ కామెంట్లు విన్నంత‌నే.. ప‌వ‌న్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోసానిని బండ బూతులు తిట్ట‌డం మొద‌లెట్టార‌ట. అంతేకాకుండా నేరుగా పోసానికే ఫోన్ చేసి బెదిరింపుల‌కు దిగార‌ట‌. ఈ సంద‌ర్భంగా పోసాని ఫ్యామిలీ మెంబ‌ర్ల ప్ర‌స్తావ‌న‌ను తీసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ అస‌భ్య‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేశార‌ట‌. 

వీరి మ‌ధ్య సాగుతున్న మాట‌ల యుద్ధం మంగ‌ళ‌వారం నాడు హ‌ద్దులు దాటేసింది. మీడియా ముందుకు వ‌చ్చిన పోసాని.. ప‌వ‌న్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ రాయ‌డానికి వీల్లేని ప‌ద‌జాలంతో దూషించారు. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా జ‌రుగుతున్న పోసాని ప్రెస్ మీట్ ను లైవ్‌లో చూసిన జ‌న‌సైనికులు, ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఒక్క‌రొక్క‌రుగానే అక్క‌డికి చేరుకున్నారు. ప‌రిస్థితిని ముందుగానే అంచ‌నా వేసిన పోలీసు అధికారులు అప్ప‌టికే అక్క‌డికి భారీ ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రు జ‌న‌సైనికుల‌ను పోలీసులు అప్ప‌టికే అదుపులోకి తీసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించినా.. స‌రిగ్గా పోసాని బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఒక్క‌సారిగా ఆయ‌న‌పైకి దూకారు. అయితే అప్ప‌టికే అక్క‌డ మోహ‌రించిన పోలీసులు వారిని అదుపు చేసి వారి దాడి నుంచి పోసానిని కాపాడారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి

పీకే ఫ్యాన్స్‌, జ‌న‌సైనికుల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించిన పోలీసులు.. పోసానిని పోలీసు ఎస్కార్ట్ తో అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ఈ సందర్భంగా పీకే ఫ్యాన్స్ దాడితో పోసాని పోలీసు వ్యాన్‌లో చ‌ప్పుడు చేయ‌కుండా కూర్చుండిపోయారు. ఆ త‌ర్వాత మీడియాతో మ‌రోమారు మాట్లాడిన పోసాని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అభిమానుల‌ను త‌న‌పైకి దాడికి ప్రోత్స‌హించార‌ని ఆరోపించారు. త‌న‌కు ఏం జ‌రిగినా దానికి ప‌వ‌నే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని కూడా వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తాను పోలీసు కేసు పెట్ట‌నున్న‌ట్లుగా కూడా పోసాని సంచ‌ల‌న కామెంట్ చేశారు. దీంతో పీకే వర్సెస్ పోసాని వివాదం పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్క‌నుంద‌న్న మాట‌. మ‌రి ఈ వివాదం ఏ మేర ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను సృష్టిస్తుందో చూడాలి..