మెగా అన్నదమ్ముల సవాల్..

 

పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ప్రవేశిస్తాడని కాంగ్రెస్ పార్టీ గ్రహించినందునే చాల దురాలోచనతో పదవి కోసం తహతహలాడిపోతున్న చిరంజీవిని రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా నియమించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతలు తనకే కట్టబెట్టినందుకు బహుశః చిరంజీవి హనుమంతుడిలా పొంగి పోయుండవచ్చును. కానీ తన ద్వారానే లక్షమణుడు వంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ న్ని దూరం చేసి అతనికి చెక్ పెట్టించాలని పధకం పన్నిందని ఆయన గ్రహించలేకపోయారు. గ్రహించలేకపోయారు అనే కంటే పదవి కోసమే ఆయన గ్రహించలేదని చెప్పుకోవడమే సముచితంగా ఉంటుందేమో! కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవికున్న మెగా ఇమేజ్ ద్వారా ప్రజలను, అభిమానులను, చివరికి తన కాపు కులస్తులను కూడా చీల్చి సోదరుడు పవన్ కళ్యాణ్ నుండి దూరం చేయగల సమర్ధుడనే ఆయనకు ఆ పదవి కట్టబెట్టింది.

 

అయితే పవన్ కళ్యాణ్ నిర్ద్వందంగా తనకు ఏ (కాపు) కులస్థుల మద్దతు అవసరం లేదని, ఎందుకంటే తను పదవులకోసమో, అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి దేశం నుండి తరిమికొట్టి మళ్ళీ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకే రాజకీయాలలో ప్రవేశించానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి, ఒకేసారి కాంగ్రెస్ పార్టీకి, తను అభిమానించే అన్న చిరంజీవికి, కాపు కుల నేతలకూ కూడా గట్టిగా చురకలు వేసారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు చిరంజీవి బయలు దేరితే, దానిని తుడిచి పెట్టేస్తానని తమ్ముడు పవన్ కళ్యాణ్ శపదం చేయడం విశేషం. వీరిద్దరి పోరాటంలో ప్రజలు, అభిమానులు, మీడియా చివరికి ఆయన వద్దన్న కాపు కులస్తులు కూడా పవన్ కళ్యాణ్ పక్షాన్నే నిలివడం తధ్యం. ఎందుకంటే ఆయన మాటలలో నీజాయితీ కొట్టవచ్చినట్లు కనబడుతోంది. ఆయన మాటలలో తమ ఆవేదన స్పష్టంగా కనబడుతోంది. కాంగ్రెస్ పట్ల తమలో రగులుతున్న కసినే వారు ఆయనలో కూడా చూడగలిగారు. ఇదంతా చూస్తే మూలిగే ముసలి నక్క మీద తాటి పండు పడినట్లుగా ఇప్పటికే సగం చచ్చి జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ పాడి కట్టడానికే వచ్చాడేమో.. అనిపిస్తోంది. ఇక సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఏ జీవీ రక్షించాలేదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu