పవన్ కు భజన మొదలైంది.. బీజేపీతో పవన్

 

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి టీడీపీని టార్గెట్ చేసినట్టు క్లియర్ కట్ గా అర్ధమైపోయింది. ఇన్ని రోజులు బీజేపీ, వైసీపీపైనే విమర్శలు గుప్పిస్తాడు.. టీడీపీపై ఎందుకు విమర్శలు చేయరు అని అనుకునే వాళ్లకు పవన్ ఈ రకంగా సమాధానం చెప్పినట్టు ఉంది. మొదట ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై నిప్పులు చెరిగిన పవవ్.. ఆతరువాత టీడీపీనే టార్గెట్ చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన కొడుకు నారా లోకేశ్ నుండి టీడీపీ నేతలందరిపై మండిపడ్డారు. అసలు లోకేశ్ అవినీతి గురించి మీకు తెలుసా... అని డైరెక్ట్ గా చంద్రబాబునే ప్రశ్నించారు. ఇంకా టీడీపీ నేతలపై పలు ఆరోపణలే గుప్పించారు.


మరి ఇంత బహిరంగంగా ఆరోపణలు చేసిన పవన్ ను ఊరికే వదిలిపెడతారా..? అప్పుడే టీడీపీ నుండి భజన మొదలైంది. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు..ప్రత్యేక హోదా రాలేదన్న ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా పెల్లుబుకుతున్న వేళ, హోదా సాధన కోసం ఏం చేస్తామన్న విషయాన్ని చెప్పకుండా, వేరెవరి చేతుల్లోనో కీలుబొమ్మగా మారిన పవన్, చౌకబారు విమర్శలతో ప్రచారం పొందాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సమయంలో ఎవరి ప్రయోజనాల కోసం తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారో పవన్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. హోదాను ఇవ్వని నరేంద్ర మోదీ గురించి ఒక్క విమర్శ కూడా చేయని ఆయన తీరును చూస్తుంటే తనకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఇంకా పల్లె రఘునాథ్ మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ నేతల హస్తముందని ఆరోపించారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మగా మారిపోయారని, వారు ఏం చెబితే పవన్ అది చేసే స్థితికి వచ్చేశారని నిప్పులు చెరిగారు. మంత్రి కేఎస్ జవహర్ కూడా ఘాటుగా స్పందించారు. పవన్ మతిలేకుండా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. గత నాలుగేళ్లుగా కనిపించని అవినితి పవన్‌కు ఇప్పుడే కనిపించిందా? అని ప్రశ్నించారు. బీజేపీతో పవన్ లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకున్నారని, అదేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా పలువురు టీడీపీ నేతలు పవన్ వ్యాఖ్యలపై స్పందించి పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పవన్ కల్యాణ్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. వెంటనే, అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని, చెదరగొట్టారు. మొత్తానికి ఇన్ని రోజులు పవన్ పై ఒక్క విమర్శ కూడా చేయని టీడీపీ.. ఇప్పుడు టీడీపీ పైనే పవన్ రివర్స్ అవ్వడంతో.. పవన్ పై మండిపడుతున్నారు. పవన్ పై విమర్శలు గుప్పించేందుకు పోటీ పడుతున్నారు. చూద్దాం మరి ఈ పోరు ఎంతు వరకూ వెళుతుందో...