పవన్ కళ్యాణ్ సమస్యలు పరిష్కరించే స్పెషలిస్టా?

 

పార్ట్ టైమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ మరోసారి పోరాటం చేస్తానని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ  కళాశాల డిగ్రీ   విద్యార్థులు తమకు సంబంధించిన సమస్యల చిట్టాని తీసుకుని పవన్ కళ్యాణ్ సార్ అడ్రస్ కనుక్కుని మరీ హైదరాబాద్‌లో వున్న ఆయన దగ్గరకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్‌ని కలిసిన  వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆయనకు తమ సమస్యలను ఏకరవు పెట్టేశారు. వ్యవసాయ అధికారుల నియామకం అంశం మీద ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 24ని రద్దు చేసి, గతంలో  వున్న జీవో నంబర్ 16ని కొనసాగించాలని కోరారు. దాంతో మన వాగ్దాన కర్ణుడు పవన్ కళ్యాణ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేస్తానని హామీ ఇచ్చేశారు.  వ్యవసాయ విద్యార్థుల సమస్యలని ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేసేశారు. వ్యవసాయ విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటం మొదలు పెట్టేస్తానని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించేశారు.

 

అసలు సదరు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? ఆ సమస్యలో సహేతుకత వుందా? గతంలో వున్న 16వ నంబర్ జీవోని పక్కన పెట్టి ప్రభుత్వం 24వ నంబర్ జీవోని ఎందుకు తీసుకొచ్చింది? దాని వెనుక ప్రత్యేక కారణాలు ఏవైనా వున్నాయా? పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళిన విద్యార్థులు కోరినట్టుగా చేస్తే వేరే ఎవరికైనా నష్టం జరిగే అవకాశం వుందా? తన దగ్గరికి ఎవరొచ్చి ఏం మొర పెట్టుకున్నా, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయిపోతుందా? ప్రభుత్వం కానీ, ప్రభుత్వాధికారులు కానీ పవన్ కళ్యాణ్ తరహాలో ఆలోచించలేక కొత్త జీవో తీసుకొచ్చారా? ఈ ఇష్యూలో ఇలాంటి సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. మరి పది మంది విద్యార్థులు తన దగ్గరకి వచ్చి మొరపెట్టుకోగానే ప్రభుత్వాన్ని హెచ్చరించేసిన పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి సందేహాలు కలిగాయో లేదో మరి!

 

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న కొంతమంది పవన్ కళ్యాణ్ దగ్గరకే ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారన్నది సమాధానం దొరకని ప్రశ్న. ఉద్దానం కిడ్నీ బాధితుల దగ్గర నుంచి, చేనేత కార్మికుల వరకు పవన్ కళ్యాణ్‌ని ఆశ్రయించారు. ప్రస్తుతం చాలామంది ఏదైనా సమస్య వుంటే పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళి చెప్పుకోవాలన్న ధోరణిలో వున్నారు. అసలు ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరకే ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో! ఆయన దగ్గరకి వెళ్తే సమస్య పరిష్కారమైపోతుందన్న నమ్మకం కూడా ఎందుకు కలుగుతోందో!

 

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్నో, ప్రజా ప్రతినిధులనో, అధికారులనో సంప్రదించడం సాధారణంగా ఎవరైనా చేసే పని. కానీ కొంతమంది అలా ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం లేదా? ప్రభుత్వం పరిష్కరించదనుకుంటే ప్రతిపక్షం సహకారాన్ని తీసుకోవాలి. ప్రతిపక్షాన్ని కూడా సంప్రదించడం లేదంటే ఇప్పుడు ఏపీలో వున్న ప్రతిపక్షం చేతగాని ప్రతిపక్షమన్న అభిప్రాయం జనంలో వుందా? అధికార, ప్రతిపక్షాలని కాకుండా  ప్రజాక్షేత్రంలో నిలవని, ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎందుకు కలుస్తున్నారు? ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలిగే స్పెషలిస్టనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందా? సినిమాల్లో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించే హీరోగారు రిజల్ లైఫ్‌లో కూడా అలాగే పరిష్కరిస్తారని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్‌ని ఆశ్రయిస్తున్న వారి తీరుగానీ, అలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరుగానీ ఇలాంటి ఎన్నో సందేహాలను కలిగిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu