కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ లేనట్టేనా? హుజురాబాద్ లో ఏం జరగబోతోంది? 

ఇలా పార్టీలో చేరి .. అలా ఎమ్మెల్సీగా నామినేట్ అయిన కౌశిక్ రెడ్డి, అదృష్టమే అదృష్టం. ఏళ్ల తరబడి క్యూలో నిలబడిన వారిని కనికరించని కేసీఆర్, కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డిని పట్టుమని పక్షం రోజులు తిరక్కుండానే ఎమ్మెల్సీ చేశారు. అది కూడా చుక్క చెమట, రూపాయి ఖర్చులేకుండా ఉచిత (గవర్నర్) కోటాలో  కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయారు... అనుకున్నారు. అదృష్టం అంటే అది కదా, అంటూ చాలా మంది చాలా విధాలుగా ఆశ్చర్యానికి గురయ్యారు. 

నిజం చెప్పాలంటే చాలా మంది కౌశిక్ రెడ్డి అదృష్టాన్ని చూసి ఈర్షకు కూడా గురయ్యే ఉంటారు. అందులో ఎవరు ఎలాంటి శాపనార్ధాలు పెట్టారో ఏమో గానీ, అడక్కుండానే వచ్చి పడిన అదృష్టం, ఇప్పడు చెప్పా పెట్టకుండా చెట్టెక్కి కూర్చుంది. అంతే కాదు,అది ఇప్పట్లో చెట్టు దిగే దారి కూడా కనిపించడం లేదు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని సిఫార్సు చేస్తూ, రాష్ట్ర మంత్రివర్గం పంపిన తీర్మానం ఫైలును గవర్నర్ భద్రంగా పెండింగ్ లో పెట్టారు. అంతే కాదు, ఇప్పట్లో ఆ ఫైల్ కు మోక్షం లేదని, రాదని గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో  వచ్చినట్లే వచ్చిన ఎమ్మెల్ల్సీ పదవి, ఓ జీవిత కాలం లేటైనా కావచ్చని, ఇప్పట్లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ముచ్చట తీరక పోవచ్చని, అంతర్గత వర్గాల సమాచారం. 

గతంలో ఒక సారి, కౌశిక్ రెడ్డి ఫైల్ పరిశీలనలో ఉందని, అయన అర్హతలను పరిశీలించేందుకు ఇంకొంత సమయం పడుతుందని చెప్పిన గవర్నర్ తమిళి సై మళ్ళీ మరో మారు అదే మాట రిపీట్ చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో,  ఇట్ ఈజ్ స్టిల్ ఇన్ పెండింగ్. ఇంకా పెండింగ్’లోనే  ఉంది, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సిగా అమోదించేందుకు మరింత సమయం కావాలని అమె స్పష్ట చేశారు. అంతే కాదు, అది అంత ఇంపార్టెంట్ విషయం కాదన్నట్లుగా, ఇప్పట్లో తేలే విషయం అసలే కాదన్నట్ల్గు గవర్నర్ మాట్లాడారు. గవర్నర్ ఇలా మళ్ళీ మళ్ళీ వాయిదా వేస్తున్నారంటే, అందుకు అయితే, ఆయన అర్హత, యోగ్యతల విషయంలో గవర్నర్’కు అనుమానాలైనా ఉంది ఉండాలి ... లేదంటే గవర్నర్ అడిగిన వివరాలను ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేయడం అయినా కారణం అయ్యుండాలని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.  

రాజకీయ నిర్ణయాల విషయంలో ఆచి తూచి అడుగులు వేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలోనూ  క్యాలిక్యూటెడ్ నిర్ణయమే తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నీ తెలిసే, ముఖ్యమత్రి కౌశిక్ రెడ్డిని రెంటికి చెడ్డ రేవడిని చేశారని అటు కాంగ్రెస్ వర్గాల్లో, ఇటు తెరాస వర్గాల్లో వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డికి  త్రిశంకు సభలో పెర్మనెంట్ సీటు ఇచ్చేందుకే, ముఖ్యమంత్రి ఆయనకు పెద్దల సభలో సీటును ఎరగా వేశారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం మాత్రం ఇక లేదనే అనికోవచ్చని అంటున్నారు.

ఎమ్మెల్సీ విషయంలో సీఎం కేసీఆర్ తీరుపై కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా అసహనానికి లోనవుతున్నారు. ఎమ్మెల్సీ ఆమోదంపై గవర్నర్ తో ముఖ్యమంత్రి మాట్లాడకపోవతంపై వాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా విషయాల్లో రాజ్ భవన్ కు వెళ్లి కేసీఆర్ చర్చించారని.. ఎమ్మెల్సీ విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డిని నమ్మించి నట్టేట ముంచారనే ఆరోపణలు కొందరు చేస్తున్నారు. దీని ప్రభావం హుజురాబాద్ ఉప ఎన్నికలో ఉంటుందని కూడా చెబుతున్నారు.