ప‌ట్టాభి క‌స్ట‌డీ కోరిన పోలీసులు.. షాక్ ఇచ్చిన కోర్టు..

ఏపీలో డ్ర‌గ్స్‌, గంజాయి దందాపై మండిప‌డుతూ.. సీఎం జ‌గ‌న్‌రెడ్డిని ఉద్దేశించి బోసిడీకే అన్నారు టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి. అంతే.. వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. విజ‌య‌వాడ‌లోని ప‌ట్టాభి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. అంత‌టితో ఆగ‌కుండా.. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలోనూ వంద‌లాది వైసీపీ మూక‌లు బీభ‌త్సం సృష్టించారు. ప్ర‌భుత్వ ఉగ్ర‌వాదంపై పోరంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు 36 గంట‌ల నిర‌వ‌ధిక దీక్ష చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ని క‌లిసి ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని కోరారు. విష‌యం తెలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. చంద్ర‌బాబుకు స్వ‌యంగా ఫోన్ చేసి వివ‌రాలు క‌నుగొన్నారు. ఓవైపు ఇంత ర‌చ్చ జ‌రుగుతుంటే.. పోలీసులేమో.. ప‌ట్టాభిపై ప‌డ్డారు. ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌ ప‌ట్టాభి ఇంటి త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కోర్టు రిమాండ్ విధించ‌డంతో జైలుకూ త‌ర‌లించారు. బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌ట్టాభిని.. తాము క‌స్ట‌డీలోకి తీసుకుంటామంటూ తాజాగా కోర్టును ఆశ్ర‌యించారు గ‌వ‌ర్న‌ర్‌పేట పోలీసులు.
  
పట్టాభిరామ్‌ పోలీసు కస్టడీ పిటిషన్‌ను విజయవాడ న్యాయస్థానం కొట్టేసింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవల అరెస్టై బెయిల్‌పై విడుదలైన పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలని గవర్నర్‌పేట పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల్లో కుట్ర కోణం దాగి ఉందని.. పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీలోకి ఇవ్వాలని కోరారు. 

పట్టాభి అరెస్టు ప్రక్రియ సరిగా లేదని.. ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం కూడా ప్రస్తావించిందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పోలీసుల పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. దాడి చేసిన వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా.. బాధితుడైన ప‌ట్టాభినే పోలీసులు ఇలా టార్గెట్ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.