దేశ‌భ‌క్తి..  జాతీయ‌మా..గుజ‌రాతీయ‌మా!

అడుగో అరి భయంకరుడు కట్టబ్ర‌హ్మ‌న్నా..అది వీర పాండ్య వంశాంకురా సింహ గర్జన.. అంటూ పెద్ద ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఆవేశంగా న‌టిస్తుంటే ఇంత‌కంటే దేశ‌బ‌త్తి ఎవ‌రుకుంట‌దిరా బావా! అనుకున్నారంతా! అల్లూరి గ‌ర్జ‌న కృష్ణ గొంతులో విని ఈడ్రా మొన‌గాడంటే.. అన్నారంతా. దేశ‌భ‌క్తిని స‌రిగ్గా ఆజాదీ కా అమృతోత్స‌వ్ స‌మ‌యంలోనే విపరీతంగా  ప్ర‌చారం చేస్తోంది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే బీజేపీవారి  దేశ‌భ‌క్తి అన‌న్య‌సామాన్యం. ఎవ్వ‌రికీ ఉండ‌డానికి వీల్లేదు. వారి ప్రేమ ఎల్ల‌లు దాటిపోయింది. అయినా అలా వెళ్లిన వారు తిరిగి వ‌స్తార‌నే భ్ర‌మ‌లో పెట్టి దేశానికి మాత్రం దేశ‌భ‌క్తి గీతాలను పెద్ద ఎల్పీలోనే వినిపిస్తున్నారు బీజేపీ నేత‌లు. స్వాతంత్య్ర‌  సమరంలో ఫ‌లానా ఆయ‌న గాంధీగారు అడ‌గ్గానే ఇంట్లో బంగార‌మంతా ఇచ్చేశాడ‌ట‌, ఒకామె ఏకంగా పుస్తెలే తీసిచ్చేసింది. క‌థ‌లు క‌థ‌లుగా అనాదిగా చెప్పుకుంటున్న ఇలాంటి సంఘ‌ట‌న‌లు  కోకొల్ల‌లు. కానీ తాజాగా బీజేపీ మాత్రం ఇక్కడ బ్యాంకుల నుంచి కోట్లు రుణాల రూపంలో కొల్లగొట్టి దేశ సరిహద్దు దాటేసిన దేశ భక్తులను వదిలే స్తోంది. అలా ఇక్కడ సంపద దోచుకుని పరారైన ‘దేశభక్తు’లలో  మోడీగారి గుజ‌రాత్ సంబంధీకులే అత్యధికులు కావ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ వీరు ఎల‌గ‌బెట్టిందేమిట‌య్యా అంటే ఇక్క‌డి వంటింట్లో పొపుల డ‌బ్బాలో చిల్ల‌ర‌తో స‌హా బ్యాంక్ మేనేజ‌ర్ల జేబుల్లో వంద‌రూపాయ‌ల‌తో స‌హా అమాంతం లాక్కుపోయి విదేశాల్లో స‌రదాగా కాలం గ‌డుపుతున్నారు. వారికి ఇక్క‌డికి రావ‌డం బొత్తిగా ఇష్టం లేద‌ు. విజ‌య్ మాల్యా, మొహుల్ చోక్సీ, నీర‌వ్ మోడీ వంటివారు అక్క‌డే కులాసాగా జీవితాంతం ఉండాల‌ను కుంటున్నారు. ఎందుకంటే ఇక్క‌డ బ్యాం కులు, జ‌నాల సొమ్ము చ‌క్క‌గా అక్క‌డ విందులు వినోదాల‌కి స‌రిపోతుంది. ప్ర‌త్యేకించి అక్క‌డ ఏ ఉద్యోగం చేయ‌క్క‌ర్లేదు. చ‌దువు కోసం విదేశానికి వెళ్లిన కుర్రాడు మాత్రం ఓ పూట చీపురు ప‌ట్టుకుని రోడ్డూడిచే ప‌ని చేస్తు న్నాడు. 

పార్ల‌మెంటులో, బ‌య‌టా ఈ ఆధునిక దేశ‌భ‌క్తుల బాగోతం గురించి ప్ర‌భుత్వాన్ని, ఎంపీల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. కానీ వారికి చీమ కుట్టిన‌ట్ట‌యినా లేదు. కాబోతే, అప్పుడే మ‌త్తు నుంచి తేరుకున్న‌ట్టు తోచిన స‌మాధానం ఇచ్చి ఊరుకుంటున్నారు. కాకుంటే జ్యోతిష్యుడి ద‌గ్గ‌రికి వెళ్లి చిల‌క జ్యోసం లో ప్ర‌శ్ని స్తామంటున్నారు. అంతే త‌ప్ప వారిని  క‌నీసం  ముంబ‌యి కూడా తీసుకురాల‌ని ప‌రిస్థి తుల్లో ప్ర‌భుత్వం ఉంది. మ‌న దేశం, మ‌న వ్యాపారులు, మ‌న పారిశ్రామిక‌వేత్త‌లు, విద్యావేత్త‌లు అంటూ భారీ ప్ర‌సంగాలు చేస్తుండే ప్ర‌ధాని మోదీ అనేక ప‌ర్యాయాలు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లారే గాని ఎక్క‌డో ఒక‌చోట వీరిని గురించి వాక‌బు చేయ‌లేదు. అంటే మ‌నోడు. మ‌నూరోడు అనే భావ‌న పాపం ఆయ‌న్ను క‌ట్టేస్తోంది. ఆయ‌న‌మాత్రం ఏం చేస్తాడు. ఎంత‌యినా ప్రాంతీయాభిమానం. ఆయ‌న‌కు దేశ‌భ‌క్తి ప్ర‌జ‌ల‌కు ప్ర‌చార సామ గ్రి కానీ నిజానికి ఇలాంటి వార‌ని లాక్కొచ్చి పోలీస్ స్టేష‌న్లో ప‌డేసి ఉత‌కాల‌న్న ప‌ట్టు ద‌ల ఏమాత్రం లేదు. అది దేశ‌భ‌క్తి అనిపించుకోదు. ఇది దేశానికి ప‌ట్టిన దౌర్భాగ్యం. 

బ్యాంకుల‌ను మోసం చేయ‌డం ఎంత తేలిక అన్న‌ది నీర‌వ్ మోడీ లాంటివారు నిరూపించారు.  ఇటువంటి వారిని దేశానికి లాక్కొచ్చి వారు దోచేసిన సొమ్మును కక్కిస్తే దేశ ఆర్థిక కష్టాలు చాలా వరకూ గట్టెక్కుతాయి. మోడీ ఎన్నికల ప్రచారంలో విదేశాలలో మూలుగుతున్న మన వారి నల్లడబ్బును వెనక్కు రప్పించి పేదలకు పంచేస్తామని ఎంతో ఘనంగా వాగ్దానం చేశారు. ఆ తరువాత ఎందుకో మరి అక్కడి సొమ్మును వెనక్కు తీసుకుకోవడం సంగతి అటుంచి.. ఇక్కడ నుంచి తన రాష్ట్రం వారు సొమ్ము దోచుకుని విదేశాలకు పారిపోతున్నా చూస్తూ ఊరుకున్నారు. ఎంతైనా దేశ భక్తి (గుజరాత్ భక్తి) కదా?  ప్రభుత్వమే ఇక్కడి బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన వారి జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో ఉన్న 28 మందిలో ఒక్క విజయ్ మాల్యాను మినహాయిస్తే మిగిలిన 27 మందీ గుజరాతీ యులే కావడం కాకతాళీయమంటే నమ్మి తీరాలి మరి. ఇంతకీ వీరు దోచేసి తీసుకుపోయిన సొమ్ము ఎంతో తెలుసా అక్షరాలా పది ట్రిలియన్ డాలర్లు.