వరుసగా ఐదో రోజూ అదే సీన్.. లోక్ సభ సోమవారానికి వాయిదా
posted on Nov 29, 2024 3:23PM
అదానీ వ్యవహారం పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ నినాదాలు చేస్తుండటంతో సభలో వాయిదాల పర్వం సాగుతోంది. ఐదు రోజులుగా సభ ఎలాంటి కార్యకలాపాలూ లేకుండానే వాయిదా పడుతూ వస్తున్నది. శుక్రవారం (నవంబర్ 29) కూడా లోక్ సభ వాయిదా పడింది.
సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు అదానీ వ్యవహారం, యూపీలోని సంభాల్ లో చెలరేగిన హింసపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను సాగనీయకుండా అడ్డుపడ్డాయి. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. మిగిలిన వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితిలో సోమవారానికి వాయిదా పడింది.