రాళ్లురువ్వినోడి బదులు ‘ఆమె’ను జీపుకి కట్టేయాలన్న రావల్!

 

కాశ్మీర్ కాష్టంలా మండుతోంది. పోయిన సంవత్సరం ఒక్క ఉగ్రవాది ఛస్తే ఇప్పటి దాకా యుద్ధం కొనసాగుతూనే వుంది. బుర్హాన్ వని అనే టెర్రరిస్ట్ భద్రతా దళాల కాల్పుల్లో హతుడయ్యాడు. అప్పట్నుంచీ ఇప్పటి దాకా వేర్పాటు వాదుల రాళ్ల రణరంగం ఆగటమే లేదు. అయితే, రాను రాను కాశ్మీరీ వేర్పాటువాదుల దుర్మార్గాలు అన్ని హద్దులు చెరిపేస్తున్నాయి. తాజాగా ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా దేశ వ్యతిరేక శక్తులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన జాతీయ గీతం ఆలపించారట! ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాక్ జెండాలు ప్రదర్శించే వేర్పాటు వాద కాశ్మీరీలకు ఇది మామూలు విషయమే కావచ్చు. కాని, మిగతా భారతీయులకి ఎంతో మనస్తాపం కలిగిస్తుంది. మోదీ వస్తే కాశ్మీర్ సమస్య కోలిక్కి వస్తుందనుకున్న వారైతే మరింత ఆవేదనకి గురవుతున్నారు పరస్థితుల్ని చూసి…

 

ఒక వైపు కాశ్మీర్ ను దేశం నుంచి వేరు చేయాలని దేశ ద్రోహులు కుట్రలు పన్నుతుంటే మరో వైపు మన మేధావులు కొందరు కాశ్మీరీ స్వాతంత్ర్యం అంటూ అమానుష వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి వారిలో ఎప్పుడూ వినిపించే కరుడుగట్టిన పేరు అరుంధతీ రాయ్. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే ఆమె పదే పదే అక్కడ జరిగే ఆజాదీ పోరాటాల్ని కూడా సమర్థిస్తుంటారు. ఈ  మధ్య అరుంధతీ ‘’ 7వేలు కాదు 7లక్షలు కాదు 70లక్షల మంది భారతీయ సైన్యం వచ్చినా ఆజాదీ బృందం గొంతు నొక్క’’లేరని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించింది. అందుకు ప్రతిస్పందనగా అన్నట్టు బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ట్విట్టర్ లో ఘాటైన కామెంట్స్ చేశాడు.

 

ఆ మధ్య రాళ్లు రువ్వే అల్లరి మూకల నుంచి తమని తాము కాపాడుకోవటానికి ఆర్మీ వారు ఒక కాశ్మీరీ వేర్పాటు వాదిని జీపుకి కట్టేసి తీసుకెళ్లారు. అతడి బదులు అరుంధతీ రాయ్ ని కట్టేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించాడు పరేష్ రావల్! ఇది ఇప్పుడు ట్విట్టర్ లో పెద్ద దుమారంగా మారింది. చాలా మంది బీజేపి ఎంపీ అయిన రావల్ ను సమర్థిస్తున్నప్పటికీ విమర్శించే వారు కూడా చాలా మందే వున్నారు. అంతటి హింసాత్మక ట్విట్స్ పరేష్ స్థాయి నటుడి నుంచి ఆశించలేదని చాలా మంది ఖండించారు. అంతే కాదు, ఒక స్త్రీ పట్ల, రచయిత్రి పట్ల హింసాత్మాకంగా మాట్లాడటం దుర్మార్గమని తిట్టారు.

 

పరేష్ రావల్ ట్వీట్ నిజంగానే సమర్థనీయం కాదు. కాని, అదే సమయంలో అరుంధతీ రాయ్ దేశం కోసం పోరాడుతున్న ఆర్మీపై పదే పదే చేసే వ్యాఖ్యలు కూడా అత్యంత దిగువ స్థాయికే చెందుతాయి. ఎక్కడో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన బూచిగా చూపి కాశ్మీర్ నే పాకిస్తాన్ కు వదిలేయమని ఆమె చేసే వాదన పరమ దుర్మార్గం. దానికి ప్రతిగానే పరేష్ రావల్ అలా స్పందించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, వివాదాలు రాజేసేలా కాకుండా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపేలా పరేష్ రావల్, అరుంధతీ రాయ్ లాంటి సెలబ్రిటీలు మాట్లాడితే బావుంటుంది…