పానీపూరీ... ఎంత రుచో అంత ప్ర‌మాదం!

సాయింత్రాలు స‌ర‌దాగా స్నేహితులు క‌లుసుకోవ‌డానికి పెద్ద అడ్డా పానీపూరీ బ‌ళ్లే. అందులో రుచి ఏమిటో గాని కుర్రాళ్లంతా ప‌రుగులు తీస్తుంటారు. గోలుగా ఉండే చిన్న పూరీలాంటి దానికి రంధ్రంచేసి పెద్ద కుండలోంచి చింత‌పులుసులాంటి నీళ్లుపోసి, కాసింత శెన‌గ‌లు,ఉల్లిముక్క‌లు వేసి ఇస్తాడు. అదో టేస్టు.. క‌బుర్ల‌లో ప‌డిన‌వారంతా లెక్క‌లే న‌న్ని తినేస్తుంటారు. బండివాడికి క‌ళ్ల‌లో మెరుపు... ఈపూట‌కి బాగానే సంపాదించాన‌ని! 

అయితే ఇలాంటి చిరుతిళ్ల జోలికి వ‌ర్షాకాలం వెళ్ల‌వ‌ద్ద‌ని డాక్ట‌ర్లు ప్ర‌చారం చేస్తున్నారు. వ‌ర్షాకాలానికి, పానీ పూరీకి సంబంధంలేద‌ని తినేవాళ్లు మాత్రం అటుకేసి వెళుతూనే ఉన్నారు. దీనికి ప్రాంతాల‌తో సంబం ధం లేదు. ఈ రోజుల్లో దాదాపు అన్ని ప‌ట్ట‌ణాల్లో పానీపూరీ బళ్లు చాలా ఫేమ‌స్‌. మునుపు కాల‌క్షేపం బ‌ఠా ణీలు అనేవారు. ఇపుడు కాలంతో పాటు రుచులూ, చిరుతిళ్ల‌లో నూ మార్పులు వ‌చ్చేశాయి. అందుకే పానీ పూరీకి ప‌ట్టంగ‌ట్టారు. కానీ ఇది అంత ఆరోగ్య‌క‌రం కాద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు ప‌శ్చిమ బెంగాల్ సంఘ‌ట‌న‌ను ఉద‌హ‌రిస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలోని వీధి దుకా ణంలో చాలామంది పానీపూరీ తిన్నారు. అక్కడ పానీ పూరీ తిన్న వంద‌ మందికి పైగా అస్వస్థతకు గుర య్యారు. బాధిత వ్యక్తులు అతిసారంతో ఇబ్బంది పడుతున్నారు. విరోచనాలు, వాంతులు , కడుపు నొప్పి తో విలవిలలాడుతున్నారు. పానీపూరీ తినటం వల్లే అని వారు గుర్తించారు,

సమాచారం అందుకున్న వైద్యఆరోగ్య శాఖ అధికారుల ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రోగులకు మందులు అందించారు. కొందరు తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్న కారణంగా వారిని ఆసుపత్రులకు తరలించారు. వారంతా డయేరియా బారిన పడినట్టుగా వైద్యాధికారులు గుర్తించారు. మొత్తం మూడు గ్రామాలకు చెందిన ప్రజలు సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలో  ఓ వీధి చివ‌రి బండి ద‌గ్గ‌ర  పానీపూరి తిన్నారు. అస్వస్థతకు గురైన వ్యక్తులు డోగాచియా, బహిర్ రణగాచా  మకల్తలా నివాసితులుగా తెలుస్తుంది.

మే నెలలో మధ్యప్రదేశ్ లోనూ  పానీపూరి తినడం వల్ల 97 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మం డాలా జిల్లా లో సింగర్పూర్లో  జరిగిన ఓ జాతరకు వెళ్లిన పిల్లలు అక్కడ పానీపూరి తిన్నారు. తిన్న కాసేప టికే వాంతులు, విరోచనాలతో, కడుపు నొప్పితో బాధపడుతూ పిల్లలు అస్వస్థత కు గురి కావటంతో వారి ని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక ఇటువంటి అనేక ఘటనలు వర్షాకాలంలో ప్రధానంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పానీపూరీ తయారీలో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్లనే పానీ పూరి తిన్నవారు డయేరియా బారిన పడినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడిన వందమందికి వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. వారికి ప్రాణాపాయం లేకుండా చికిత్స చేస్తున్నారు. అందుకే వర్షాకా లం బయట పానీపూరీలు తినడం మంచిది కాదని సూచిస్తున్నారు.  సో, పిల్ల‌లూ, పెద్ద‌లూ పానీపూరీ జోలికి వెళ్ల‌వ‌ద్దు.