ఒలంపిక్ మెడ‌లిస్ట్ మీరాబాయి ఫ‌స్ట్ రియాక్ష‌న్‌.. థాంక్యూ ఇండియా...

ఒలంపిక్స్‌లో వెండి ప‌త‌కం సాధించినందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు వెయిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చాను. ఐదేళ్లుగా దీనిని కలగంటున్నాన‌ని.. స్వర్ణం కోసమే ప్రయత్నించాన‌ని.. రజతమూ గొప్ప ఘనతేన‌న్నారు. దేశం తరఫున ఈ ఒలింపిక్స్‌లో తొలి పతకం గెలిచినందుకు ఆనందంగా ఉంది. నేను మణిపుర్‌కు మాత్రమే కాదు.. ఈ దేశం మొత్తానికీ చెందుతానంటూ సందేశ‌మిచ్చారు మీరాబాయి చాను. 

‘నా కోచ్‌ విజయ్‌ శర్మ, సహాయ బృందానికి, వారి నిరంతర సహాయ సహకారాలకు కృతజ్ఞతలు. నాకు శిక్షణనివ్వడమే కాకుండా ప్రతిక్షణం నాలో ప్రేరణ నింపారు. అలాగే నా కుటుంబం, ప్రత్యేకంగా మా అమ్మకు ధన్యవాదాలు. ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. నన్ను నమ్మింది. ప్రభుత్వం, కేంద్ర క్రీడాశాఖ, సాయ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య, ఐఓఏ, ఇండియన్‌ రైల్వేస్‌, స్పాన్సర్లు సహా అందరికీ కృతజ్ఞతలు’ అని మీరాబాయి అన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను 49కిలోల విభాగంలో రజత పతకం గెలిచింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్‌తో పతకం గెలిచిన రెండో వెయిట్‌ లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది మీరాబాయి. 

టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి భారత్‌కు శుభారంభం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్‌మీడియాలో అభినంద‌న‌లు తెలిపారు.