కొవిడ్ బాధితులకు వైద్య సేవలు.. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆపన్న హస్తం..

కొవిడ్ మూడోవేవ్ లో భారీ సంఖ్యలో ప్రజలు కరోనా భారిన పడుతున్నారు. ఈ సమయంలో కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తన సేవల్ని మరింత విస్తృతం చేసింది. జూమ్ యాప్ ద్వారా వీడియో లింక్ లు షేర్ చేసి వేల మంది కోవిడ్ బాధితులకు టెలిమెడిసిన్ సాయం అందిస్తోంది. అవసరమైన వారికి ట్రస్ట్ ప్రతినిధుల ద్వారా మందులు వారి ఇంటికే పంపిస్తోంది. 12 మంది దేశ విదేశీ వైద్యులతో ఏర్పాటు చేసిన వైద్య బృందాలు వారం రోజులుగా రోజుకు నాలుగైదు గంటల పాటు వీడియో కాల్ ద్వారా వందల మందిని ట్రీట్ చేస్తున్నారు. బాధితులకు సేవలు అందించే కార్యక్రమాన్ని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

జూమ్ మీటింగ్ లింక్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్టు వేలాది మంది బాధితులు చెప్పిన సమస్యలపై డాక్టర్లు చర్చించి, వారికి తగిన సూచనలు చేస్తున్నారు. వైద్య బృందంలో అమెరికా నుంచి నలుగురు వైద్యులు ఉండగా మిగిలిన 8 మంది ఏపీ నుంచి రోగులకు వైద్య సాయం అందిస్తున్నారు.  కోవిడ్ గత రెండు వేవ్ ల్లో ఆక్సిజన్ అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసిన ట్రస్ట్ యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయంగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు  రాష్ట్రాల్లోఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. కుప్పంలో ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది కోవిడ్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సుమారు 1 కోటి 75 లక్షల విలువైన మందులు, ఆహారం, వైద్య పరికరాలను ఎన్టీఆర్ ట్రస్టు అందించింది.

ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తోంది. ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రోజువారీ ట్రస్ట్ సేవలను సీఈఓ రాజేంద్ర కుమార్ తో కలిసి పర్యవేక్షిస్తూ అందరినీ సమన్వయ పరుస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవలు గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆపద సమయంలో ట్రస్ట్ సేవల్లో భాగస్వాములైన అందరికీ నారా భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.