డ్రోన్ కెమెరాలు పని చేయకుండా జామర్లు!

తిరుమల   ఆలయ భద్రత విషయంలో తిరమల తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయం చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధి డ్రోన్ కెమేరాల నిషేధ ప్రాంతంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఆ ఆరు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమేరాలు పని చేయకుండా జామర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.  ఇప్పటికే తరచూ శ్రీవారి ఆలయ గోపురం పై భాగం నుండి విమానాలు హెలికాప్టర్లు అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.  ఆగమ శాస్త్ర విరుద్ధమనే కాకుండా,  భద్రతా కారణాల దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల పై భాగంలో విమానాలు సంచరించకుండా  చర్యలు తీసుకోవాలని టిటిడి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.‌ అయితే అదేమీ ఫలించలేదు. అంతే కాదు.. అలా విమానాల రాకపోకలను నియంత్రించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పేసింది.  తిరుమల తిరుపది వేవస్థానం చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దిశగా మరో ప్రయత్నం చేశారు.   తిరుమలలో భద్రత దృష్ట్యా శ్రీవారి ఆయల పైభాగంలో  విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణించకుండా దారి మళ్ళించాలని కోరుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి స్వయంగా లేఖ రాశారు.  ఈ లేఖపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.  త్వరలో దీనిపై సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక కేంద్రం నుంచి ఆ నిర్ణయం వచ్చేలోగా ఆలయ భద్రత దృష్ట్యా నిరంతర నిఘా ఉంచాలని బీఆర్నాయుడు టిటిడి విజిలెన్స్ వర్గాలను ఆదేశించారు. అంతే కాకుండా  ఆలయం చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధిని డ్రోన్ నిషేధిత ప్రాంతంగా ప్రకటించి, ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు పనిచేయకుండా  యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందు కోసం  డ్రోన్ కెమేరాలు పని చేయకుండా జామర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  యాంటీ డ్రోన్ వ్యవస్థ  ఏర్పాటుకు  సాంకేతిక సంస్థలతో సంప్రదింపులు జరిపారు.    త్వరలో జరగనున్న టీటీడీ పాలకమండలిలో ఈ అంశంపై చర్చలు జరిపి యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
డ్రోన్ కెమెరాలు పని చేయకుండా జామర్లు! Publish Date: Mar 8, 2025 9:01AM

కాంగ్రెస్ కోరి తెచ్చుకున్న ఓటమి!

జో జీతేగా ఓయీ సిఖందర్.. గెలిచినవాడే రాజు, ఏమి చేశారు, ఎలా గెలిచారు, అనేది తర్వాత చర్చ. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎనికల్లో బీజేపీ రెండు స్థానాలు గెలుచుకుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కమల దళం తమ ఖాతాలో కలుపుకుంది.మూడింట రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకోవడం సహజంగానే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.  ముఖ్యంగా, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కరీంనగర్ పట్టభద్రుల సీటును బీజేపీ కైవసం చేసుకోవడం, బీజేపీలో జోష్  పెంచింది. కాంగ్రెస్ ను కృంగదీసింది. మరోవంక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర రాజకీయ సమీకరణలలోమార్పు మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, బీజేపీ, బీజేపీ అనుకూల మీడియా మేథావులు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మార్పునకు సంకేతంగా భావిస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్  చీకటి ఒప్పందమే, తమ ఓటమికి కారణమని కాంగ్రెస్ నాయకులు.. సామాన్య ప్రజలపై ఓటమి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా ఇది పరవు నిలుపుకునే ప్రయత్నం. బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసే ప్రయత్నం.   మరోవంక, రాష్ట్ర బీజేపీ నాయకులు అయితే, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికి అందినట్లే సంబర పడి పోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదలు బీజేపీ రాష్ట్ర నాయకులు రాష్ట్రంలో నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ  పతనం ప్రారంభమైందని సంబర పడి పోతున్నారు.  అదే సమయంలో రహస్య పొత్తులు, లోపాయికారీ ఒప్పదాల పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బరిలో నిలవక పోవడం, బీఎస్పీ బరిలో నిలవడం కమల దళానికి ఉభయ తారకంగా కలిసొచ్చిన అంశాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలోనే  బీజేపీ, బీఆర్ఎస్  మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అలాగే  కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయ లోపం, అభ్యర్ధిని ప్రకటించడంలో జాప్యం, ఇలా కాంగ్రెస్ ఓటమికి చాలానే  కారణాలు ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  అదెలా ఉన్నా.. బీజేపీ అనుసరిస్తున్న నూతన ప్రచార వ్యూహం, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు నిబద్దతతో సాగించిన ప్రచారం కమల దళానికి కలిసొచ్చిందని  అంటున్నారు. అవును రాజకీయ అనుబంధ బాంధవ్యాలతో సంబంధం లేకుండా, రాజకీయ విశ్లేషకులు అందరూ ప్రశంస పుర్వకంగానో, ఆందోళన పూర్వకంగానో  కాషాయ   బీజేపీ క్యాడర్ కమిట్మెంట్ ను మెచ్చుకుంటున్నారు. చివరకు  పార్టీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే వామపక్ష మేథావులు సైతం  బీజేపే క్యాడర్  ఐడిలాజికల్  కమిట్మెంట్’తో పనిచేయడం వల్లనే బీజేపీ మూడింట రెండు సీట్లు గెల్చుకుందని అంగీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రణాళిక బద్ధంగా పార్టీ కార్యకర్తలు చేసిన ప్రచారం, బీజేపీ గెలుపునకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అంతే కాదు, కమిట్మెంట్ తో పనిచేసే క్యాడర్  బీజేపీ అసలు బలంగా విశ్లేషకులు గుర్తిస్తున్నారు.   మరోవంక కాంగ్రెస్  పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేక పోవడంతో చే చేతులా గెలుపును చేజార్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి  కాంగ్రెస్  అభ్యర్ది నరేంద్ర రెడ్డి, ఆరు నెలల ముందు నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. కొత్త ఓటర్లను చాలా పెద్ద సంఖ్యలో చేర్పించారు.అలాగే  కాంగ్రెస్ టికెట్ ఆశించి చివరకు బీఎస్పీ అభ్యర్ధిగా బరిలో దిగిన ప్రసన్న హరికృష్ణ కూడా ముందు నుంచి క్షేత్ర స్థాయిలో పని చేశారు. అయితే చివరికి టికెట్  రాక పోవడంతో ఆయన బీఎస్పీ టికె పై పోటీకి దిగి, బీజేపీ అభ్యర్ధి గెలుపునకు పరోక్షంగా సహకరించారు. నిజానికి  కాంగ్రెస్ నాయకత్వం హరికృష్ణ,  నరేంద్ర రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చి ఒకరే బరిలో నిలిచేలా చేసుంటే, కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడకలా సాగేది. అందుకే  కాంగ్రెస్ ఓటమికి ఇంకా అనేక కారణాలు ఉన్నా, నాయకుల మధ్య సమన్వయ లేకపోవడం, క్యాడర్ లో ఉత్సాహం, కమిట్మెంట్ లేక పోవడం కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో  విషయమేంటంటే.. పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం గెలుపు పై  అంతగా దృష్టి పెట్టలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ  చివరకు, శుభం పలకరా .. పెద్దన్నా అంటే  కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి ఓడిపోయినా తమ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదన్న చక్కటి సందేశం  ఇచ్చివచ్చారు. పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  కూడా పార్టీ  ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేయడంలో శ్రద్ద చూపలేదు. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని  ఆ నాలుగు జిల్లాలో కేవలం నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ కార్యకర్తలను కలుపుకుని గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తే.. కాంగ్రెస్ పార్టీకి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా క్యాడర్ ను  సక్రమంగా ఉపయోగించుకోలేదని అంటున్నారు. నిజానికి  కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి కూడా ఇంచుమించుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పరోక్షంగానే అయినా  క్షేత్ర స్థాయిలో తాను ఒంటరి పోరాటం చేయవలసి వచ్చిందనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విధంగా చూసినప్పుడు  ఇదొక రకంగా కాంగ్రెస్ పార్టీ కోరి తెచ్చుకున్న ఓటమి .. బీజేపీ పోరాడి సాధించిన విజయం అంటున్నారు.
కాంగ్రెస్ కోరి తెచ్చుకున్న ఓటమి! Publish Date: Mar 8, 2025 8:37AM

పయ్యావులను వైసీపీ ఫేస్ చేయలేకపోతోందా?

అసెంబ్లీలో డ్రాపౌట్.. మండలిలో వాకౌట్.. వైసీపీపై పయ్యావుల సెటైర్లు ఆర్థిక మంత్రి పయ్యావులను  వైసీపీ ఫేస్ చేయలేకపోతోందా? పయ్యావుల ప్రశ్నలకు.. పయ్యావుల విమర్శలకు మండలిలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సభ్యులు దీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారా? పయ్యావుల సమాధానం ఇస్తున్న సమయంలో సభలో ఉండొద్దని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారా? జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసన మండలిలో పయ్యావుల రిప్లై ఇవ్వడం మొదలుపెట్టగానే.. మాజీ మంత్రి బొత్స నేతృత్వంలో సభ నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పయ్యవులను వైసీపీ ఫేస్ చేయలేకపోతోందనేదే  ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిదే అంశం మీద అసెంబ్లీ  లాబీల్లో చర్చ నడుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలోనూ.. బడ్జెట్టుపై సమాధానం ఇచ్చే ప్రసంగాల్లోనూ గత పాలకులను తూర్పారబట్టారు. సంచలన కామెంట్లే చేశారు. సమాజానికి వైసీపీ హనికరం అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలన్నారు. ఇప్పటి వరకు వీటికి ప్రతిపక్షం నుంచి కౌంటరే లేకుండా పోయింది. తమ ప్రత్యర్థి తెలుగుదేశం కానీ.. ప్రభుత్వంలో ఎవరైనా మంత్రులు కానీ తమ మీద.. తమ పార్టీ మీద కామెంట్లు చేస్తే సహించే వారు కారు వైసీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా.. ఓటమి తర్వాత కూడా తెలుగుదేశం  వైపు నుంచి వస్తోన్న కామెంట్లకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. కానీ పయ్యావుల చేసిన విమర్శలు, వ్యాఖ్యలకు మాత్రం ఇప్పటికీ వైసీపీ నుంచి సౌండ్ లేదు.   ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మంత్రి పయ్యావులకు గట్టిగా రిప్లై ఇస్తారని అంతా భావించారు.  కానీ జగన్ ఆ ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత తెలిసిన విషయమేమిటంటే.. పయ్యావుల కేశవ్ సభలో చేసిన కామెంట్ల గురించి ఎవ్వరూ ప్రస్తావించ వద్దని.. తనను ఆ ప్రశ్నలు వేయకుండా మీడియా ప్రతినిధులకూ సూచించాలని జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మీడియా విభాగం వారికి ఆదేశాలు జారీ చేశారట. దీంతో ఆ పార్టీ మీడియా విభాగం రిక్వెస్ట్ మేరకు మీడియా ప్రతినిధులు కూడా పయ్యావుల ప్రశ్నలను జగన్ మోహన్ రెడ్డి వద్ద ప్రెస్ మీట్లో ప్రస్తావించ లేదట. ఈ చర్చ రెండు రోజుల నుంచీ జరుగుతూనే ఉంది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందోననేది క్లారిటీ రాలేదు. కానీ ఇవాళ శాసన మండలిలో జరిగిన పరిణామంతో ఈ విషయంపై  క్లారిటీ వచ్చేసిందనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరుగుతోంది. శాసన మండలిలో ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల బడ్జెట్ పై జరిగిన చర్చకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే పయ్యావులప్రసంగం ఆరంభించడానికి  కొద్దిసేపటి ముందే సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు.  ఇప్పటి వరకు అన్ని అంశాల మీద చర్చలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్సీలు.. సరిగ్గా మంత్రి పయ్యావుల బడ్జెట్ పై చర్చకు సమాధానం ఇస్తుంటే వాకౌట్ చేసి ఎందుకు వెళ్లిపోయారోననే చర్చ జరిగింది. తీరా తెలిసిన విషయమేమిటంటే.. పయ్యావుల సమాధానం ఇచ్చే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎవ్వరూ సభలో ఉండకూడదని తాడేపల్లి ప్యాలెస్ నుంచి   జగన్ మోహన్ రెడ్డి ముందుగానే ఆదేశాలు జారీ చేశారట. పయ్యావుల సమాధానం ఇస్తున్న సమయంలో సభలో ఉంటే.. పయ్యావులకు దీటుగా బదిలివ్వలేక   ఇబ్బందులు పడాల్సి వస్తుందనే భావనతో సభ నుంచి జంప్ అవ్వాల్సిందిగా జగన్ మోహన్ రెడ్డి సూచించారని ఆ పార్టీ ఎమ్మెల్సీలే గుసగుసలాడుకుంటున్నారని అశెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. మొత్తానికి సభ్యుల్లేని అసెంబ్లీలో తాను చెప్పాల్సింది చెప్పేశాను.. కనీసం మండలిలోనైనా ప్రతిపక్ష సభ్యులు ఉంటారు కాబట్టి.. వారేమైనా సలహాలో.. సూచనలో చేస్తే.. వాటిని విందామని అనుకుంటే.. శాసన మండలిలో కూడా తనకు ఆ అవకాశం లేకుండా చేశారని మంత్రి పయ్యావుల శాసన మండలి సభ్యులతో అన్నారు. అసెంబ్లీలో డ్రాప్ అవుట్.. కౌన్సిల్లో వాకౌట్ అన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోందంటూ మంత్రి పయ్యావుల చురకలూ అంటింటారు.
పయ్యావులను వైసీపీ ఫేస్ చేయలేకపోతోందా? Publish Date: Mar 7, 2025 3:54PM

360 డిగ్రీస్ లో రాటుతేలుతున్న లోకేష్!

మంత్రి నారా లోకేష్. అన్ని రకాలుగా రాటుతేలుతున్నట్టే కన్పిస్తోంది. నెమ్మదిగా విషయాలను అవగాహన చేసుకోవడంతోపాటు.. సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. రాజకీయంగా దూరదృష్టితో ఆలోచిస్తున్నట్టే కన్పిస్తోంది. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా వ్యవహరించిన లోకేషుకు.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి లోకేషుకు చాలా వ్యత్యాసం, పరిణితి కన్పించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక లోకేషులో అంతకు మించిన పరిణితి కన్పిస్తోంది. పార్టీ కార్యకర్తలతో వ్యవహరించే తీరు.. అసెంబ్లీలో ప్రతిపక్షంతో వ్యవహరిస్తోన్న తీరు.. లీడర్లను కంట్రోల్లో పెడుతున్న తీరుతో పాటు.. మిత్రపక్షాలతో ఎలా మెలగాలి అనే అంశం మీద కూడా లోకేష్ చాలా మెచ్యూర్డుగా ఆలోచన చేస్తున్నారు. వివిధ వేదికల మీద.. వివిధ సందర్భాల్లో నారా లోకేష్ వ్యవహరించిన తీరే.. ఆయనలో వచ్చిన పరిణితిని కనబడేలా చేస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను విశ్లేషిస్తే.. లోకేష్ పరిణితి ఏ స్థాయిలో సాధించాడో అర్థమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తర్వాత టీడీపీ కార్యాలయంలో ప్రజా విజయం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన అభ్యర్థి ఆలపాటి రాజా ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు లేచి నినాదాలు చేస్తున్నారు. దీంతో రాజా సీరియస్ అయ్యారు. కూర్చొ అంటూ సదురు కార్యకర్తను కొంచెం దురుసుగానే మాట్లాడారు. దీంతో సభకు హాజరైన వారికి కానీ.. టీవీల్లో చూస్తున్న వారికి కానీ కొంచెం తేడాగా అనిపించేలా ఉంది. గెలిచిన తర్వాత ఆలపాటి రాజాలో అహంకారం కన్పిస్తోందనే తీరులో ఆలపాటి రాజా హవాభావాలు ఉన్నాయి. దీన్ని వేదిక మీదే కూర్చొన్న లోకేష్ పసిగట్టారు. వెంటనే ఆయన తన సీట్లో నుంచి లేచి రాజా దగ్గరకు వచ్చారు.. కూర్చొమంటే కూర్చుంటామా..? తగ్గేదేలే.. అంటూ వాతావరణాన్ని చల్లబర్చారు.. అంతే కాకుండా.. హెడ్మాస్టరులా చెబితే వింటామా..? అంటూ నవ్వుతూనే ఆలపాటి రాజాకూ చురక వేశారు. ఇక సభలో శాసన మండలిలో ప్రతిపక్షం మీద చాలా ఎగ్రెసివ్ గా వెళ్తున్నారు. ప్రతిపక్ష వైసీపీని సభలో ఇరుకున పెట్టేలా వ్యూహాలు రచించడమే కాకుండా.. తన తోటి సభ్యులకు స్పూర్తినిచ్చేలా వ్యవహరిస్తున్నారు. బొత్స లాంటి సీనియర్ పొలిటిషీయన్ను వివిధ సందర్భాల్లో కార్నర్ చేస్తున్నారు లోకేష్. అలాగే తన వాళ్ల బాగోగులను చూసుకుంటున్నారు. నిమ్మల రామానాయుడు అనారోగ్యంతోనే సభకు వచ్చేశారు. సభకు రావద్దు.. వెళ్లి రెస్ట్ తీసుకోండంటూ.. లాబీల్లో మంత్రి నిమ్మలకు సూచించడమే కాకుండా.. సభలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి.. మంత్రి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. మంత్రి నిమ్మల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారో చూడండనే విషయాన్ని ఇతర మంత్రులకు.. సభ్యులకు అర్థమయ్యేలా చేశారు లోకేష్. ఓ మంత్రి ఆరోగ్యం గురించి ఈ తరహాలో సభలో ప్రస్తావన రావడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి అనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరుగుతోంది. ఇంతే కాదు.. మిత్రపక్షాలతో వ్యవహరించాల్సిన తీరు విషయంలో లోకేష్ విపరీతమైన మెచ్యూర్డ్ ప్రదర్శిస్తున్నారు. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేస్తే.. జనసేన నేతలకంటే ముందుగా స్పందించి.. కౌంటర్ ఇచ్చింది లోకేషే. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఏమైనా అంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరిక కూడా చేశారు పవన్. చంద్రబాబుకు.. పవనుకు ఎలాంటి గ్యాప్ లేదు.. కానీ పవనుకు, లోకేషుకు మధ్య గ్యాప్ వస్తుందేమోననే చర్చ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. అలాంటి అనుమానాలు అవసరం లేదనే రీతిలో పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే.. అందరికంటే ముందుగా లోకేష్ స్పందించిన తీరు కూటమి వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా వివిధ సందర్భాల్లో మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు చూస్తూ.. చాలా తక్కువ సమయంలో తండ్రికి తగ్గ తనయుడు అనే పేరును లోకేష్ తెచ్చుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
360 డిగ్రీస్ లో రాటుతేలుతున్న లోకేష్! Publish Date: Mar 7, 2025 3:38PM

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగబాబు నామినేషన్

ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు శుక్రవారం (మార్చి 28) నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిణి వనితా రాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో జనసేన  సీనియర్ నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ , ఆ పార్టీ  ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్వయంగా ఈ బాధ్యతను తీసుకొన్నారు.   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌లకు మార్చి 10 చివరి గడువు.   మార్చి 11న ఉదయం 11 గంటలకు నామినేషన్‌ల పరిశీలన, మార్చి 13న మధ్యాహ్నం 3 గంటల్లోపు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.     
ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగబాబు నామినేషన్ Publish Date: Mar 7, 2025 3:23PM