అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయింది: రేవంత్ రెడ్డి 

సినీ హీరో అల్లు అర్జున్ వల్లే సంధ్య థియేటర్ ఘటనలో  తల్లి రేవతి చనిపోయిందని, కొడుకు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు రావొద్దని పోలీసులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. థియేటర్ కు ఎంట్రీ, ఎగ్జిట్ దారి ఒకటే ఉండటంతో తొక్కిసలా జరిగి రేవతి చనిపోయిందన్నారు. కొడుకు ను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రిలో చేర్చితే అల్లు అర్జున్ మాత్రం సినిమా చూడటానికి  హాల్ లో కూర్చున్నాడని అన్నారు.   రేవతి చావు వార్తను ఎసిపి వెళ్లి అల్లు అర్జున్ కు తెలియజేసి  వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు  డిసిపి అల్లు అర్జున్ కు  అరెస్ట్ చేస్తామని చెబితే కూడా ఓపెన్ టాప్ జీప్ లో అల్లు అర్జున్ వెళ్లిపోయాడని రేవంత్ మండి పడ్డారు. హీరో  కన్ను పోయిందా? కాలు పోయిందా? సినీ ప్రముఖులు వెళ్లి ఎందుకు పరామర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. 
Publish Date: Dec 21, 2024 2:57PM

ఆరు గజాల నిండుదనం.. భరతజాతి నిండు గౌరవం.. ! ప్రపంచ చీర దినోత్సవం 2024..

   ‘చీరలోని గొప్పతనం తెలుసుకో, చీర కట్టి ఆడతనం పెంచుకో’ అంటూ పాటలు రాసి మరీ నేటి తరానికి చీర గొప్పతనం గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో కానీ, అందరూ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనలో ప్రతీ ఒక్కరం అమ్మ చీర కొంగు నీడలో పెరిగినవాళ్ళమే అన్న విషయం గుర్తొస్తుంది. అమ్మ చీర కొంగు చెమట పడితే మొహం తుడిచేది, ఎండకో వానకో గొడుగయ్యేది. ఇంకా చెప్పాలంటే  సగటు భారతీయ కుటుంబంలో ప్రతీ శిశువు చీరతో కట్టిన ఉయ్యాలలోనే జోలపాటలు వింటూ పడుకుంది. మరి భారతీయ సమాజంలో, సంస్కృతిలో లోతుగా ఇమిడిపోయిన చీర గురించి  చెప్పుకోవాల్సింది ఏముంది అనిపిస్తుందేమో..  అయితే పెద్దలు చెప్పింది పిల్లలు పాటించటం వల్లనే  ఒక తరం నుంచి ఇంకో  తరానికి ఆచారాలు, విలువలు కొనసాగుతాయి.  అలాగే  మన సంస్కృతిలో భాగమై ఉన్న చీర గొప్పతనాన్ని తెలియజేస్తూ,  వెస్టర్న్ కల్చర్ వైపు ఆసక్తి చూపుతున్న నేటి తరం ఆలోచనా విధానం మార్చాలని, తర్వాత వచ్చే   తరాలు చీరని  మర్చిపోకుండా చేయాలనే ప్రయత్నమే  ప్రపంచ చీర దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వాటిలో చీర కూడా ఒకటి.  ప్రతీ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన  వరల్డ్ శారీ డే జరుపుకుంటారు.   చీర ఎప్పటినుంచి ఉంది.. చీర చరిత్ర గురించి చూస్తే దీని ఆనవాళ్ళు ఒకానొకప్పుడు మన భారతదేశంలోనే గొప్ప నాగరికతగా చెప్పబడిన సింధు నాగరికత(2800-1800బి‌సి‌) కాలంలో దొరికాయి. అప్పుడిది మామూలు పొడవైన వస్త్రంలా ఉండేది. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఇది ఒక ఆర్ట్ ఫార్మ్ గా మారుతూ వచ్చింది.. చీరలు  నేసే నేతన్నలకి, చీరల్లో ఉండే  ప్రత్యేక కళకీ  గౌరవం తెలపడానికిగానూ  2020, డిసెంబర్21వ తేదీన  ప్రపంచ చీర దినోత్సవం జరుపుకోవడం మొదలపెట్టారు.  స్థానికంగా మొదలై త్వరలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఉద్యోమమే స్పూర్తి.. సోషల్ యాక్టివిస్టులైన శ్రీమతి సింధూర కవిటి, శ్రీ నిస్టులా హెబ్బార్..  ఈ ఉద్యమానికి నాంది పలికారు. అయితే ఈ ఉత్సవానికి తొలి అడుగు మాత్రం 2009లో పడింది. చీరల వారసత్వాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో సోషల్ యాక్టివిస్ట్  శ్రీమతి నళిని శేఖర్  దీన్ని ప్రారంభించారు.   శారీ డేని ఎందుకు జరుపుకోవాలి.. భారతీయుల మూలాలను గుర్తు చేస్తూ మన వారసత్వాన్ని గుర్తుచేసుకోవడం ఈ రోజు ఉద్దేశ్యం. చీర కేవలం ఏదో  ఒంటికి చుట్టుకునే వస్త్రం మాత్రమే కాదు, తరాలుగా అందించబడుతున్న భారతీయ వారసత్వమని ప్రపంచానికి చాటి చెప్పడమే శారీ డే లో ఉన్న గొప్పతనం.  చీరలు తయారు చేసే కళను కాపాడి, చేతి వృత్తుల పరిశ్రమని ప్రోత్సహించడమనే మరక ఉద్దేశ్యం కూడా ఇందులో ఉంది. చీరలు వివిధ డిజైన్లలో అభివృద్ది చెంది, స్త్రీల వ్యక్తిత్వాన్ని, అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టట్టంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ సాంస్కృతిక సంపదను   ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో అనుసంధానం చేయటం ద్వారా  మన సంస్కృతిలోని గొప్పతనాన్ని తెలియచేస్తుంది. చీరలో వైవిధ్యం.. ఫ్యాషన్ పరిశ్రమపై చూపిస్తున్న ప్రభావం.. భారతదేశంలోని ప్రతి ప్రాంతం దాని ప్రత్యేక శైలిని చీర ద్వారా పరిచయం చేస్తుంది. ఉత్తర ప్రదేశ్  విలాసవంతమైన బనారసీ పట్టు చీర నుండి తమిళనాడులో చేతితో నేసిన కాంచీపురం చీర వరకు. రాజస్థాన్  రంగురంగుల బంధనీ చీర నుంచి తూర్పు భారతంలోని జామ్‌దాని, ఖాదీ చీరల వరకూ ఎంతో వైవిధ్యం కలిగి ఉన్నాయి. చీర కట్టే స్టైల్లో కూడా  ప్రతీ ప్రాంతానికి తమదైన ప్రత్యేకత ఉంది.  మహారాష్ట్రలో నౌవారి స్టైల్, గుజరాత్‌లో ముందుకు పల్లు కట్టడం, బెంగాల్ చీర కట్టు... ఇలా  చాలా వైవిధ్యం ఉంది. చరిత్రలో రాణి లక్ష్మీ బాయి లాంటి వీరనారిలు, ఇందిరా  గాంధీ వంటి మహిళలు చీరలను విభిన్న శైలుల్లో ధరించారు. సాంప్రదాయ దుస్తులు కూడా శక్తికి చిహ్నంగా నిలవగలవని నిరూపించారు.   చీర ఇప్పుడు తన సాంప్రదాయ హద్దులని దాటి అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రముఖ డిజైనర్లు సబ్యసాచీ, మనీష్ మల్హోత్రా, గౌరవ్ గుప్తా వంటి మోడర్న్ డిజైనర్స్ కూడా  చీరను డిఫరెంట్ స్టైల్సులో డిజైన్ చేసి ఔరా అనిపిస్తున్నారు.   చీర ఆరు నుండి తొమ్మిది గజాల అన్‌స్టిచ్డ్ వస్త్రం కాదని, భారతదేశ  కళా నైపుణ్యం,  సంప్రదాయానికి ప్రత్యక్ష సాక్ష్యం అని గుర్తించాలి.  ఆడపిల్ల ఇంటికి వస్తే చీర పెట్టి, వారి సౌభాగ్యం కలకాలం నిలబడాలని కోరుకునే మన భారతీయ సంప్రదాయం అంతరించిపోకుండా ఉండాలన్నా, మన భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచ దేశాలకి గుర్తు చేయాలనుకున్నా, ముందు మనం మన మూలాలనుంచి  దూరం అవ్వకుండా ఉండాలి.  భారత సంప్రదాయాన్ని,  చీర వైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ వరల్డ్ శారీ డే ను జపురుకోవాలి.                                        *రూపశ్రీ.
Publish Date: Dec 21, 2024 9:30AM

నకిలీ నెయ్యిని 2 నిమిషాల్లో గుర్తించే సూపర్ టిప్ ఇదీ..!

  నెయ్యి ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం.  ప్రతి రోజూ స్వచ్చమైన నెయ్యిని కనీసం ఒక స్పూన్ అయినా తీసుకుంటూ ఉంటే శరీరానికి చాలా మంచిదని చెబుతారు.  ముఖ్యంగా నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకం,  అజీర్ణం,  ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి.  గర్భంతో ఉన్నవారు నీటిలో కరివేపాకు వేసి బాగా మరిగించి ఆ నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలిపి తాగుతుంటారు. దీని వల్ల కడుపులో బిడ్డకు కూడా మంచిదని చెబుతారు. అయితే నెయ్యి స్వచ్చమైనది అయితేనే దాని వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.  కల్తీ నెయ్యి వాడితే మాత్రం దాని వల్ల కలిగే ప్రయోజనాలకంటే జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. తాజాగా కిలోల కొద్దీ నకిలీ నెయ్యి తయారుచేస్తున్న స్థావరం బయటపడటంతో నెయ్యి విషయంలో చాలా మంది కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో  కల్తీ నెయ్యని 2 నిమిషాలలో ఎలా గుర్తించవచ్చో ఆహార నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ కమీషన్ హర్యానాలోని జింద్ నగరంలో దాడి చేసి నకిలీ దేశీ నెయ్యిని తయారు చేస్తున్న ఫ్యాక్టరీని కనుగొంది. ఈ ఆపరేషన్‌లో 1925 కిలోల నకిలీ నెయ్యి, 1405 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నారు. గిడ్డంగిని ఢిల్లీ పోలీసులు సీల్ చేశారు. గోదాములో రంగులు, రసాయనాలు కూడా కనిపించాయని చెబుతున్నారు. సోడియం లారెత్ సల్ఫేట్ అనే రసాయనాన్ని జోడించి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారట. భారతదేశంలో చాలా చోట్ల నకిలీ నెయ్యి,  నూనె, పాలు మొదలైనవి తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు.   నెయ్యిని ఎలా కల్తీ చేస్తారు? నెయ్యి లో  కూరగాయల నూనె  కలుపుతారు. చౌకైన కూరగాయల నూనె లేదా కూరగాయల ఫ్యాట్ ను నిజమైన నెయ్యితో కలపడం ద్వారా దాని పరిమాణం పెరుగుతుంది. దీని వినియోగం వల్ల  కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  గుండె జబ్బులు,  ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి కల్తీ నెయ్యి  దీర్ఘకాలిక వినియోగం వల్ల ధమనులను అడ్డుకోవడానికి దారితీస్తుంది. స్టార్చ్.. నెయ్యి పరిమాణాన్ని పెంచడానికి పిండిని కలుపుతారు. ఇది కడుపు నొప్పి, అజీర్ణం,  గ్యాస్, బరువు పెరుగుట,  జీవక్రియ రుగ్మతలకు కారణమవుతుంది.   నకిలీ నెయ్యిలో ఉండే రసాయనాలు జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. నకిలీ నెయ్యిలో ట్రాన్స్ ఫ్యాట్,  హానికరమైన నూనెలు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.  అలాంటి నెయ్యి తీసుకోవడం వల్ల లివర్ ఫెయిల్యూర్  లేదా మూత్రపిండాల సమస్యలకు కారణమవుతుంది. నెయ్యి కల్తీని ఇలా గుర్తించవచ్చు.. ఒక టెస్ట్ ట్యూబ్‌లో ఒక మి.లీ కరిగించిన నెయ్యిని తీసుకోవాలి.  అందులో ఒక మిల్లీ.. Conc.HCLని జోడించండి ఆ తర్వాత అందులో అర చెంచా చక్కెర వేయాలి. రెండు నిమిషాలు బాగా షేక్ చేయాలి. నెయ్యిలో కల్తీ లేకపోతే దాని రంగు మారదు. నెయ్యి నకిలీ అయితే దాని రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారవచ్చు.                                               *రూపశ్రీ.                        
Publish Date: Dec 21, 2024 9:30AM

కోపం చల్లారడానికి ఉత్తమమైన మార్గం.. రవిశంకర్ గురూజీ చెప్పిన ట్రిక్ ఇదిగో..!

తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.  కోపం  అనేది ప్రతి ఒక్కరిలో ఉండే సహజమైన గుణమే అయినా కొందరిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్నవారు చాలా విషయాలలో నష్టాలు ఎదురుచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటి వాళ్ల దగ్గర కోపం చూపించినా మహా అయితే మాట్లాడకుండా పోతారు. కొందరైతే చెడ్డవారనే ముద్ర వేస్తారు.. కానీ కుటుంబ సభ్యులు,  అన్నింటి కంటే ముఖ్యంగా జీవిత భాగస్వాములు కోపం వల్ల జీవితంలో కోలుకోలేని,  తిరిగి పూడ్చలేని నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుంది.  అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని అంటారు.  అయితే కోపాన్ని నియంత్రించుకోవాలి అని అనుకున్నంత సులువగా దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడమే పెద్ద సమస్య.  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు.. లైఫ్ కోచ్ అయిన రవిశంకర్ గురూజీ కోపాన్ని జయించడానికి, కోపంతో ఉన్న వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే విషయాలను స్పష్టంగా తెలిపారు. సైలెంట్ అయితే కోపం పెరుగుతుందా..? వివాహ బంధంలో సరైన భాగస్వామి దొరకకపోతే కోపం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు సైలెంట్ గా ఉండిపోతే అవతలి వారి కోపం కంట్రోల్ కాదు.. ఫలితంగా . కోపం పెరుగుతుంది. కోపం ఉన్నప్పుడు సైలెంట్ అయిపోయి సమయాన్ని వృథా చేయకూడదు. అవతలి ఏదైనా మాట్లాడుతుంటే సైలెంట్ గా అవాయిడ్ చేయకూడదు. ఇది చాలా తప్పు. కోపం ఇలా కంట్రోల్.. మీరు ఎంత చెప్పినా సరే.. ఎదుటి వ్యక్తి కోపం తగ్గకపోతే దీనికోసం చేయవలసిన పని కోపంగా ఉన్న వ్యక్తికి అర్థం అయ్యేలా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉండే వ్యక్తిని సంప్రదించడం.మూడవ వ్యక్తి సహాయంతో కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే రిలేషన్షిప్ సక్రమంగా సాగకపోతే  కోపగించుకునే అవకాశం ఉంది.  కానీ అర్థమయ్యేలా ఎవరో ఒకరు వివరిస్తే అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మూడో వ్యక్తి ప్రమేయం మంచిదేనా? సాధారణంగా భార్యాభర్తలు కానీ.. కుటుంబ సభ్యులు కానీ వారి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు మూడవ  మనిషి ప్రమేయం ఉంటే ఇష్టపడరు. కానీ భాగస్వామి కానీ, కుటుంబంలో వ్యక్తి కానీ ఏదైనా చెప్పాలని చూసినప్పుడు అవతలి వ్యక్తి వినకుంటే.. మీరు చెప్పేది మంచి విషయమే అయినా అప్పటికే మీ మీద ఉన్న కోపం వల్ల  మీరు చెప్పే మంచి కూడా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే అలాంటి సందర్బంలో మూడవ వ్యకి సహాయం తీసుకోవడమే మంచిదట. అయితే భార్యాభర్తలు ఎప్పుడూ ఇలా మూడవ వ్యక్తి ద్వారా సంప్రదింపులు జరుపుకోకూడదు. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా ఇద్దరూ కలసి ఓపెన్ గా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడమే మంచిది. ఇది కూడా ట్రై చేయవచ్చు.. ఎవరైనా చాలా కోపంగా ఉంటే వారు నిశ్శబ్దంగా ఉంటే..  వారిని గౌరవించి మీరు కూడా  నిశ్శబ్దంగా ఉండాలి. అలా ప్రశాంతంగా ఉంటే కోపంగా ఉన్న వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికి సమయం లభిస్తుంది.   అతను తనంతట తానుగా కోపం తగ్గిపోయి నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కోపంగా ఉన్న సమయంలో  ఎటువంటి తప్పు అడుగు వేయకుండా జాగ్రత్త పడాలి.  ఇకపోతే.. ప్రతి విషయంలోనూ కోపం తెచ్చుకోవడం బంధాలకు..  ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందువల్ల గొడవలు జరిగినప్పుడు.. కోపంగా ఉన్నప్పుడు  ప్రశాంతంగా ఉండటం,  ఎదుటివారి కోపాన్ని తగ్గించడానికి ట్రై చేయడం మంచిది.                                              *రూపశ్రీ.  
Publish Date: Dec 21, 2024 9:30AM

అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు.. బీజేపీ సెల్ఫ్ గోల్?

భారత పార్లమెంట్ లో హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపాయి.   దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ ను అవమానించేందుకు బీజేపీ సాహసించడమంటే..  భవిష్యత్ లో భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు రెడీ అయిపోయిందనడానికి సంకేతమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ వాదులంతా బిజెపి ఆలోచనలు, విధానాలను తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్ర పక్ష పార్టీలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.   ఎన్డీఏ కూటమి ఉన్న రాష్ట్రాల్లో అంబేద్కర్ ను ఆరాధించే వారు జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి పూలమాలలు వేయడంతో పాటు అంబేద్కర్ కు జేజేలు పలుకుతూ బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరఃసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో జమిలి ఎన్నికల  బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎన్డీఏ ప్రభుత్వం వేసింది. ఈ అంశంపై చర్చ జరిగే సమయంలో హోం మంత్రి అమిత్ షా నోరు పారేసుకున్నారు. అంబేద్కర్... అంబేద్కర్... అంబేద్కర్... అని ఇన్నిసార్లు ఆ పేరు జపించే బదులు... అన్ని సార్లు దేవుడి పేరు జపిస్తే ఏడు జన్మలకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. దీంతో పార్లమెంట్ లో మాటల మంటలు రేగాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా  ఉన్న కాంగ్రెస్ కు, ఇండియా కూటమి పార్టీలకూ అమిత్ షా తన వ్యాఖ్యల ద్వారా మంచి ఆయుధాన్ని అందించారు. దేవుడి పేరు చెప్పి అంబేద్కర్ ను అవమానించారంటూ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో గళమెత్తారు.  దీంతో సహనం కోల్పోయిన బిజెపి నేతలు ఒకరి తరువాత ఒకరు విరుచుకు పడ్డారు. ఒకసారి అంబేద్కర్ ను అవమానించిన తరువాత దానిని సరిదిద్దుకునే విధంగా అమిత్ షా ప్రసంగించినా ఫలితం లేకపోయింది. అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తూ ఒకటికి మూడు సార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. అయినా మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు కూడా ఆందోళనలు వెళ్లాయి. బిజెపి తనను తాను సమర్థించుకునేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఇండియా కూటమి ఎంపీలను పార్లమెంట్ లోకి రాకుండా అడ్డుకోవడం సంచలనం సృష్టించింది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల ధాటికి బిజెపి కూటమి తట్టుకోలేక పోతోందనడానికి దీనిని ఉదాహరణగా చెప్పవచ్చు.   అంతెందుకు అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించడానికి స్వయంగా ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగాల్సి వచ్చిందంటేనే.. ఆ వ్యాఖ్యలు బీజేపీకి ఎంత నష్టం చేకూర్చాయో అవగతమౌతోంది. రాజకీయ పరిశీలకులు అమిత్ షా వ్యాఖ్యలను బీజేపీ సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు.   గౌతమ్ అదాని వ్యాపార లావాదేవీలలో లంచాలు ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకున్నారని అమరికా దర్యాప్తు సంస్థ తేలుస్తూ అక్కడి కోర్టుకు వివరాలు అందించడంతో అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందని, వెంటనే అదానీపై చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని పట్టుబట్టింది. ఒకవైపు అదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తుండగా దాని నుంచి డైవర్ట్ చేయడానికే అమిత్ షా అంబేద్కర్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అమిత్ షా వ్యాఖ్యల కారణంగా బీజేపీ ప్రతిష్ఠ గతంలో ఎన్నడూ లేని స్థాయికి మసకబారింది. అదానీ ముడుపుల వ్యవహారాన్ని మించి అమిత్ షా వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని చేకూర్చాయి.  భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ చేస్తోంది.   ఈ నేపథ్యంలో పార్లమెంట్ బయట నుంచి ఎంపీలు పార్లమెంట్ లోపలికి వచ్చే ద్వారం వద్ద మెట్లపై బిజెపి, దాని మిత్ర పక్ష ఎంపీలు కూర్చొని కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని బిజెపి కూటమి   నిరసనకు దిగింది. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాల సభ్యులను సభలోకి వెళ్లనీయకుండా బీజేపీ ఎంపీలు అడ్డుపడటంతో నాలుగు రోజుల కిందట జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఓ బీజేపీ ఎంపీ గాయపడ్డారు.   దీంతో గొడవ ముదిరి పాకాన పడింది. తనను కూడా నెట్టి కింద పడేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే తన బాధను వ్యక్తం చేశారు. ఇరు వర్గాల ఎంపీలు పార్లమెంట్ స్ట్రీట్ లోని పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ ఖడ్ లకు కూడా  ఫిర్యాదులు చేశారు.  ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ డిఫెన్స్ లో పడిందనడంలో సందేహం లేదని పరిశీలకులు చెబుతున్నారు. పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానిస్తూ అమిత్ షా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో బీజేపీలో కంగారు మొదలైందనీ, అందుకు తార్కానమే.. రాహుల్ గాంధీ తో పాటు ఇండియా కూటమి ఎంపీలను లోపలికి పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమని అంటున్నారు. ఖర్గే, రాహుల్ కాంబినేషన్ బాగా కుదరటంతో బిజెపి కూటమిని పార్లమెంట్ లో ఇండియా కూటమి గుక్కతిప్పుకోకుండా చేస్తోంది. అంబేద్కర్ ను అవమానించడమంటే కోన్ని కోట్ల మంది బలహీన వర్గాల వారిని అవమానించడమేననీ, రాజ్యాంగాన్ని అవమానించడమేనన్న భావన ప్రజల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ఇది కచ్చితంగా బీజేపీకి ముందున్నది గడ్డుకాలమేనని చెప్పడానికి ఆస్కారమిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ గండం నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో చూడాల్సిందేనంటున్నారు. 
Publish Date: Dec 21, 2024 9:19AM