ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

నందమూరి బాలకృష్ణ  తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నటరత్న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఏడాది పాటు జరగనున్నాయి.

‘శక పురుషుని శత జయంతి ఉత్సవాలు’ పేరిట ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తనయుడు, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగు జాతికి లేఖ రాశారు. ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరులో మే 28 న వేడుకలను బాలకృష్ణ ప్రారంభిస్తారు. వచ్చే ఏడాది అంటే 2023 మే 28 వరకు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు.  

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నందమూరి కుటుంబం నుంచి నెలకు ఒకరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని బాలకృష్ణ వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వారానికి ఐదు సినిమాలు, రెండు సదస్సులు నిర్వహిస్తామన్నారు.

అలాగే నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాలు ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు. శక పురుషుని శత జయంతి ఉత్సవాలు తెనాలిలోని పెమ్మసాని థియేటర్ లో ప్రారంభం అవుతాయని నందమూరి బాలకృష్ణ తెలిపారు.