ఇక ఇప్పుడు హరీష్ రావు వంతు!

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసల ప్రవాహం ఆగడం లేదు. వలసల నిరోధం విషయంలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులెత్తేసి సైలెంట్ అయిపోయారు. జరిగేది జరుగుతుంది. చూస్తూ ఉండటమే బెటర్ అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉంది. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైతే  వలసల నిరోధానికి చేసిన ప్రయత్నమేదీ కనిపించదు. ఆయనను కలిసేందుకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  

ఎమ్మెల్యేల వలసలతో పార్టీ క్యాడర్ లో విశ్వాసం సన్నగిల్లడమే కాదు, తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేలే కాదు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా బీఆర్ఎస్ కు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలైతే నీవు నేర్పిన విద్యయే అంటూ బీఆర్ఎస్ అధినేతను ఎద్దేవా చేస్తున్నారు. మేం విలీనం చేసుకున్నా, ఎమ్మెల్యేలను చేర్చుకోలేదంటూ కొత్త లాజిక్ చెప్పి కేటీఆర్ నవ్వుల పాలయ్యారు. దీంతో ఎమ్మెల్యేలతో పాటు తామూ కారు దిగేయడమే మంచిదన్న ఉద్దేశంలో క్యాడర్ ఉంది. 

గతంలో  బీఆర్ఎస్ కష్టపడి అతి ప్రయత్నం మీద ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించింది. అందుకు భిన్నంగా ఇప్పుడు  బీఆర్ఎస్ నేతలు ఎవరి ప్రమేయం లేకుండా కాంగ్రెస్ గూటికి స్వచ్ఛందంగా చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విపక్షం అయిన రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి  వలసలు మొదలవ్వడం, పార్టీ నాయకత్వంపై విశ్వాసలేమిని సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి  అధికారం ఉన్న పార్టీలో ఉంటేనే రాజకీయ మనుగడ అన్న అభిప్రాయం   తెలంగాణ రాజకీయాలలో ఏర్పడటానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరించిన తీరే కారణం. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను బెదరించో, బుజ్జగించో కారెక్కించుకున్నారు. అలా ఎక్కిన వారికి పార్టీలో మొదటి నుంచీ ఉన్నవారి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే తాము కారెక్కడానికి కారణం నగరంలో ఉన్న తమ ఆస్తుల రక్షణ కోసమేనని మీడియా ముందే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలను ఖాళీ చేయడానికి ఏ స్థాయిలో ప్రయత్నాలు చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఒత్తిడులు, ప్రయత్నాలూ అవసరం లేకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా కాంగ్రెస్ చేయి అందుకోవడానికి క్యూకడుతున్నారు. 

కేసీఆర్, కేటీఆర్ లు చేతులెత్తేయడంతో ఇప్పుడు వలసల నిరోధం, క్యాడర్ లో ధైర్యం నింపడం కోసం మాజీ మంత్రి, బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు నడుంబిగించారు. ఆయన ఎమ్మెల్యేల వలసల నిరోధం కంటే.. క్యాడర్ లో ధైర్యం నింపి, పార్టీ పటిష్టంగా ఉందన్న భరోసా ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పోయేది పొల్లు పట్టించుకోవద్దు, త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి.. అప్పుడు విజయం మనదే అంటూ క్యాడర్ కు చెబుతున్నారు. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి అని హరీష్ రావు క్యాడర్ ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఉప ఎన్నికలు ఎందకు రాలేదో హరీష్ చెప్పగలరా అని పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో తుది నిర్ణయం స్పీకర్ దే. శాసన వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు లేవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసల జోరు చూస్తుంటే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోగానే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం ఖాయంగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో  హరీష్ రావు మాటలు క్యాడర్ లో భరోసా నింపగలవా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు