నవరత్నాలు కాదు.. నకిలీ రాళ్లు

ఎన్నికల ముందు జగన్ గొప్పగా ప్రచారం చేసుకున్న నవరత్నాలు వాస్తవానికి నకిలీ రాళ్లన్న విమర్శలు సాక్షాత్తూ లబ్ధిదారుల నుంచే వినవస్తున్నాయి. నవరత్నాల హామీలు గుప్పించిన జగన్ తీరా అధికారం లోకి వచ్చికా వాటిలో ఒక్కో దానిలోనూ కోత పెడుతూ, లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ మోసం చేస్తున్నా రన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కోవలోకే ఇప్పుడు అమ్మ ఒడి పథకం కూడా చేరింది. ఈ పథకంతో లబ్ధిదారులకు ఉపయోగం లేకుండా చేసే కుట్ర జగన్ రెడ్డి సర్కార్ చేస్తోంది. మొన్నటికి మొన్నామధ్య పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో అమ్మఒడి కింద తల్లుల ఖాతాల్లో వేయాల్సిన 15 వేల నుంచి ఒక వేయి రూపాయలకు కోత వేసింది. ఇప్పుడు తాజాగా మరో ఎత్తుగడతో మరో వెయ్యి రూపాయలను అమ్మవడి నుంచి కోత పెట్టేందుకు స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన పేరుతో మరో సాకు చెబుతోంది.

కుటుంబంలో స్కూలు వెళ్లే చిన్నారులున్న ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో ఏటా 15 వేల రూపాయలు వేస్తానని అప్పట్లో వైఎస్ జగన్ గొప్పగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఆ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందంటూ ఝలక్ ఇచ్చింది. రెండో సంవత్సరం వచ్చేసరికి స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో పథకం నుంచి వెయ్యి రూపాయలు లాగేసుకుంది.

ఇప్పుడు మరో వెయ్యికి ఎసరు పెట్టి, 13 వేలే వేస్తామని చెప్పడంతో లబ్ధిదారుల్లో నిరాశ నెలకొంది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడం అంటే ఇదే అని వారు అసంతృప్తికి గురవుతున్నారు. వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమ్మ ఒడి పథకం అమలు చేయాల్సి ఉంది. అయినా.. మధ్యలోనే తూట్లు పొడవడం ఏంటనే ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి.