తిరుపతి తొక్కిసలాట.. ఎస్పీ సుబ్యారాయుడిపై బదిలీ వేటు.. డిఎస్పీ, గోశాల డైరెక్టర్ సస్పెన్షన్

తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి చంద్రబాబు నలుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి ఎస్పీపై, జాయింట్ కమిషనర్ పై బదలీ వేటు వేశారు. ఇక డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలనును సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రకటించారు.  తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద బుధవారం (జనవరి 8) రాత్రి తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన సంఘటనకు కారణం డీఎస్పీ రమణకుమార్ నిర్లక్ష్యమే కారణమని అధికారులు ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత తిరుపతి వెళ్లి అధికారులతో సమీక్షించి, క్షతగాత్రులను పరామర్శించిన సందర్భంగా తొక్కిసలాటకు దారి తీసిన  పరిస్థితులపై వివరాలను తెలుసుకున్న చంద్రబాబు తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణబాబు, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. అలాగే తిరుపతి జాయింట్ కమిషనర్ గౌతమిపై కూడా బదలీ వేటు వేశారు.   
Publish Date: Jan 9, 2025 5:14PM

నార్సింగి లో రాష్ట్రకూటుల కాలపు నంది విగ్రహం

కాపాడుకోవాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి  హైదరాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ, ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్లక్ష్యంగా పడి ఉన్న రాష్ట్రకూటుల కాలపు నంది విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. నార్సింగి, నేక్ నాంపేట ప్రధాన రహదారిలో గల ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని శివాలయం వెనక గల ఎర్ర ఇసుక రాతిలో రెండు అడుగుల పొడవు, అడుగు మూడుఅంగుళాల ఎత్తు, 9 అంగుళాల మందంతో చెక్కిన ఈ నంది ఒంటిపై గంటల పట్టెడలు, గంగడోలు, మూపురం, ముఖ భాగం, శిల్ప శైలి 9వ శతాబ్ది నాటి రాష్ట్రకూటల రాజుల శిల్ప కళకు అద్దం పడుతోందని అన్నారు. శుక్రవారం ఆ విగ్రహాన్ని సందర్శించిన శివనాగిరెడ్డి, ముట్టె భాగంలో భిన్నమైన చారిత్రక ప్రాధాన్యత గల ఈ నంది శిల్పాన్ని ఆలయ ప్రాంగణంలోనే పీఠంపై నిలబెట్టి, భద్రపరచాలని ఆలయ అర్చకులు, ధర్మకర్తలకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Publish Date: Jan 9, 2025 3:21PM

గజగజలాడుతున్న ఉత్తర భారతం!

ఉత్తర భారతం చలికి గజగజలాడుతోంది. తీవ్రమైన చలిగాలులకు తోడు పొగమంచుతో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. దేశ రాజధాని నగరాన్ని మరో సారి కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా  పడపోయింది.   గురువారం హస్తినలో అత్యల్పంగా 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  ఇక  ఉత్తరాది రాష్ట్రాల లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది.  ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. లక్నోలో గురువారం (జనవరి 9) అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే  ప్రయాగ్‌రాజ్‌లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.   హర్యానా, అంబాలాలో ఈ నెల 14 వరకూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక జమ్మూ కాశ్మీర్ ను మంచు దుప్పటి కప్పేసిందా అన్నట్లుగా పరిస్థితి ఉంది. గురువారం (జనవరి (9) జమ్మూలో , 3.2, గుల్మార్గ్‌ లో 4.6, బనిహల్‌లో 4.8, కుప్వారాలో  3.6 డిగ్రీల  అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
Publish Date: Jan 9, 2025 2:43PM

సుప్రీంలో నటుడు మోహన్ బాబుకు భారీ ఊరట!

నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో తనను అరెస్ట్ చేయొద్దని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు  ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మోహన్‌బాబుపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని  ఆదేశించింది. దీంతో మోహన్ బాబుకు భారీ ఊరట లభించినట్లైంది. అయితే ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. తన వయస్సు   78 ఏళ్లనీ,  గుండె సంబంధిత సమస్యలతో బాధపడు తున్నాననీ, కనుక తనకు   బెయిల్ చేయాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.   ఈ పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం  తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ మోహన్ బాబుపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెడితే.. గత నెల 10 వ తేదీన మోహన్ బాబు ఓ విలేకరిపై దాడికి పాల్పడ్డారు. దీనిపై మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.   
Publish Date: Jan 9, 2025 2:25PM

కేటీఆర్ కు మరో షాక్ ... సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టులో  కెటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ రిజెక్ట్  చేసిన నేపథ్యంలో  ఆయన వేసిన స్పెషల్ లీవ్  పిటిషన్  సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కెటీఆర్ సుప్రీం గడపదొక్కే అవకాశాలున్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం కెవియట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో కె టీఆర్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మా వాదనలు కూడా వినండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కెవియట్ దాఖలు చేసింది. కెటీఆర్ పిటిషన్ ఇప్పటికిప్పుడు విచారణ చేయలేమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ నెల 15న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కెటీఆర్ కు అటు సుప్రీం కోర్టు ఇటు హైకోర్టులో ఎటువంటి ఇమ్యూనిటీ దొరకకపోవడంతో ఏ క్షణాన అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బిఆర్ఎస్ లీగల్ టీం అత్యవసరంగా సమావేశమైంది.  కెటీఆర్ అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడం గమనార్హం.
Publish Date: Jan 9, 2025 2:06PM

42 ఏళ్ల కిందట ఇదే రోజు.. సీఎంగా ఎన్టీఆర్ తొలి సారి ప్రమాణ స్వీకారం

సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. ఆ పేరు తలుచుకోగానే  ఎవరికైనా చటుక్కున గుర్తుకు వచ్చేది ఆయన జగదేక సుందర రూపం. ఆయన ఒక నవ నవోన్మేష చైతన్య స్వరూపం . ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ  రంగంలోనూ అనితరసాధ్యమైన కీర్తి బావుటాను ఎగరేసిన ప్రతిభామూర్తి ఎన్టీఆర్.  వెండితెరపై   అగ్రగామిగా నిలిచిన ఆయన రాజకీయాలలో కూడా తనకు తానే సాటి అని రుజువు చేసుకున్నారు.  నాయకుడిగా, మహానాయకుడిగా, ముఖ్యమంత్రిగా,  ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజా జీవితం సాగింది. పేదవాడి అన్నం గిన్నెగా, ఆడబడుచుల అన్నగా ఆయన ప్రజలలో మమేకమయ్యారు. అసలు అయన రాజకీయ ప్రవేశమే ఒక ప్రభంజనం. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయన సొంతం. అప్పటి వరకూ రాష్ట్రంలో ఓటమి అనేదే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, తిరుగులేని ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. సరిగ్గా 42 ఏళ్ల కిందట (1983 జనవరి 9) ఇదే రోజున ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  1983 జనవరి 9 తెలుగు కీర్తిపతాక ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడిన రోజు.  రాజకీయం జనం చెంతకు చేరిన రోజు.   తెలుగువాడి  తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు. తెలుగు నేల పులకించిన రోజు. 35 ఏళ్ల అప్రతిహాత కాంగ్రెస్  అధికార పెత్తనానికి, తెలుగువారిని చిన్న చూపు చూసిన కాంగ్రస్ పాలనకు చరమగీతం పాడిన రోజు. ఔను సరిగ్గా 41 ఏళ్ల కిందట నందమూరి తారకరామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలి సారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు.   పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్టీఆర్ అచ్చమైన ప్రజల మనిషి. అందుకే ఆయన రాజభవన్ ఇరుకు గోడల మధ్య కాకుండా, ప్రజా సమక్షంలో  లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రజల సమక్షంలో బహిరంగ మైదానంలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం అదే ప్రథమం. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు.  హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొంది. అప్పటి గవర్నర్   కె.సి. అబ్రహం   ఏపీలో తొలి కాంగ్రెసేతర  ముఖ్యమంత్రి గా రామారావు  చేత  స్వీకార ప్రమాణ స్వీకారం చేయించారు. అచ్చ తెలుగులో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం చారిత్రాత్మకం.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ ప్రజల కోసమే పని చేస్తానని చాటారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తానని చెప్పారు. ప్రజాసేవే తన అభిమతమని చాటారు.  అన్నట్లుగానే అవిశ్రాంతంగా  ప్రజాసంక్షేమం కోసమే పాటుపడ్డారు. అప్పటి దాకా అధికారమంటే  విలాసం, పెత్తనం అని భావించిన నేతలకు అధికారం అంటే బాధ్యత అని తెలిసొచ్చేలా చేశారు.  తనను సినీరంగంలో మకుటం లేని మహారాజుగా నిలబెట్టిన క్రమశిక్షణ,క్రమవర్తన,సమయపాలనలను ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోనూ కొనసాగించారు.  నిరాడంబరతకు ఆయన నిలువెత్తు రూపు. ముఖ్యమంత్రిగా అత్యంత విలాసవంతమైన భవనంలోకి మారే అవకాశం ఉన్నా, అందుకు ఆయన అంగీకరించలేదు. ఆబిడ్స్ లోని తన నివాసంలోనే ఉన్నారు. సీఎంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు.  ఖరీదైన కార్ల జోలికి పోలేదు. అంబాసిడర్ కారునే ఆయన సీఎంగా ఉన్న సమయంలోనూ వినియోగించారు. ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నో సౌకర్యాలను ఆయన తృణప్రాయంగా వద్దనేశారు.  అయితే ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎన్నో కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. కిలో రెండు రూపాయలకే బియ్యం ఆయన ప్రారంభించిన పథకమే. ఇప్పుడు అదే పథకం దేశం మొత్తం ఆచరణలోకి వచ్చింది. బడుగుబలహీన వర్గాలకు పాలనలో, అధకారంలో భాగస్వామ్యం కల్పించిన ఎన్టీఆర్ వల్లే సామాన్యులలో సైతం రాజకీయ చైతన్యం వచ్చింది. ప్రశ్నించే ధైర్యం ఇచ్చింది.  చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల సంక్షేమం,  మహిళల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్  అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి పేదల పాలిట పెన్నిధి అయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు. అందుకే ఎన్టీఆర్ తెలగు కీర్తి, తెలుగుఠీవి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా ఎప్పటికీ జనం గుండెల్లో కొలువై ఉంటారు. 
Publish Date: Jan 9, 2025 12:53PM