జగన్ తిరుమల పర్యటనపై జనసేనాని ఎమన్నారంటే..?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. డిక్లరేషన్ అంశం ఉద్రిక్తతలకు కారణమౌతోంది. గతంలో ముఖ్యమంత్రిగా జగన్ తిరుమల దేవుడిని సందర్శించుకున్న ఏ సందర్భంలోనూ డిక్లరేషన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే.  శుక్రవారం (సెప్టెంబర్ 27)సాయంత్రానికి జగన్ తిరుపతి చేరుకుని అక్కడ నుంచి తిరుమల చేరుకుంటారు. రాత్రి తిరుమలలో బస చేస్తారు. శనివారం ఉదయం (సెప్టెంబర్ 28) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

అయితే హిందూ సమాజం జగన్ తిరుమల పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తిరుమల దేవుడిని అన్యమతస్థులు దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దేవుడిని దర్శించుకుంటానని జగన్ ప్రకటించాలనీ, లేకుండా ఆయన పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ, హిందూ సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. జగన్ అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వస్తే అడ్డంగా పడుకుని ఆయనను కదలనివ్వబోమని హెచ్చరించాయి. 

 జగన్ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల వేంకటే శ్వరస్వామిని దర్శించుకోవడానికి అంగీకరించేది లేదని అల్టిమేటమ్ ఇచ్చారు. మొత్తంగా జగన్ తిరుమల పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసు అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ శ్రేణులకు కీలక సూచన చేశారు. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఎటువంటి ఆందోళనలకు దిగవద్దని పిలుపు నిచ్చారు.  అన్య మత స్థుడైన జగన్ ను డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వడం, ఇవ్వక పోవడం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  అందుకే జగన్ మతం, ఆయన పర్యటన లక్ష్యంగా ఎటువంటి ఆందోళనలూ చేయవద్దని పవన్ కల్యాణ్ అన్నారు. దీంతో జగన్ పర్యటన సందర్భంగా ఎటువంటి ఆందోళణల్లోనూ పాలుపంచుకోకూడదని జనసేన శ్రేణులు నిర్ణయించుకున్నాయి.   

ఇలా ఉండగా జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమౌతున్నాయి. అయితే  జగన్ పర్యటనను  అలిపిరి వద్దే అడ్డుకుంటామంటూ బీజేపీ, హిందు సంఘాల హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు భద్రతా పరంగా పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలులో ఉంటుందని ప్రకటించారు. మొత్తానికి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం బయ టపడిన నేపథ్యంలో జగన్ నష్ట నివారణ చర్యలలో భాగంగా తిరుమల పర్యటన పెట్టుకున్నారు. అయితే దొంగే.. దొంగ దొంగ  అని అరిచిన చందంగా జగన్ తీరు ఉందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. తిరుమల ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వినియోగం, కల్తీ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో దోషులెవరన్నది బయటపడతారు. ఈ లోగా ఈ అంశంపై తిరుమల పర్యటనకు జగన్ రెడీ అవ్వడం ఉద్రిక్తతలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.