ఏపీకి ఫెంగల్ ముప్పు లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఫెంగల్ తుపాను ముప్పు లేదని వాతావరణ శాఖ పేర్కొంది. భయపడినట్లుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారలేదనీ, ఇది క్రమంగా బలహీనపడుతూ శుక్రవారం (నవంబర్ 29) సాయంత్రానికి వాయుగండంగా మారి శనివారం (నవంబర్ 30) ఉదయానికి రారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

అయితే తుపాను ముప్పు తప్పినా దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  అయితే ఫెంగల్ ప్రభావం తమిళనాడుపై అధికంగా ఉంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.   చెన్నైలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుత్తురై, తిరువారూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కడలూరు, నాగపట్నం తీరం అల్లకల్లోలంగా మారింది. పుదుచ్చేరి, కారైకాల్, కడలూరులో విద్యా సంస్థలకు నేడూ రేపూ సెలవు ప్రకటించారు.