ఏపీలో నైట్ కర్ఫ్యూ.. రూల్స్ ఇవే...

కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలులోకి తెచ్చింది. రాత్రి 11నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి నెలాఖరు వరకూ రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొంది. అయితే.. అత్యవసర సర్వీసులు, అంతర్రాష్ట్ర సరుకు రవాణాకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది.

పెళ్లిళ్లు, మతపరమైన, సామాజిక కార్యక్రమాలను బహిరంగంగా నిర్వహించాలనుకుంటే 200 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అలాగే.. ఏదైనా హాలు లోపల కార్యక్రమం నిర్వహిస్తే 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఏపీ సర్కార్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక సినిమా థియేటర్లలో సీటుకు సీటుకు మధ్య ఖాళీ వదిలిపెట్టాలనే నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందే అని పేర్కొంది. ప్రజా రవాణా విషయానికి వస్తే.. ప్రయాణికులు, సిబ్బంది ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించి ఉండాల్సిందే.. లేదంటే అనుమతి నిరాకరించాలని ఆదేశించింది. ఎవరైనా వినియోగదారుడు మాస్క్ లేకుండా దుకాణాల్లోకి వచ్చేందుకు అనుమతిస్తే షాపు నిర్వాహకులు గరిష్టంగా 25 వేల రూపాయలు జరిమానా చెల్లించాలని హెచ్చరించింది.

ప్రార్ధనా మందిరాల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని, మాస్క్ ధరించని వారికి 100 రూపాయలు జరిమానా విధిస్తామని ఏపీ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేసింది. అయితే, ఇంతలా కఠిన ఆంక్షలు తీసుకుంటున్నారంటే కరోనా ప్రమాదం భారీగా ఉన్నట్టేగా. మరి, అలా అయితే స్కూల్స్ కు ఎందుకు సెలవులు ప్రకటించడం లేదు ఈ జగన్ ప్రభుత్వం అని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 

Related Segment News