కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీ కీలక తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కీలక తీర్పు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టరాదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ఇప్పుడు ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్జీటీ అభిప్రాయపడింది.

 

ఈ మేరకు ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది. 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణాలు, జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావసం అంశాలను కూడా అధ్యయనం చేయాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత ఆరు నెలల్లో కమిటీ అధ్యయనం పూర్తి చేయాలని ఎన్జీటీ స్పష్టంచేసింది. 

 

ప్రాజెక్టు విస్తరణపై సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని తేల్చి చెప్పింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్‌లో చెప్పినట్లు డీపీఆర్‌ లు సమర్పించి, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లొచ్చని సూచించింది.