జ‌గ‌న్ స‌ర్కారుకు షాక్‌.. అక్రమ మైనింగ్‌పై ఎంక్వైరీ...

గ‌ద్దెనెక్కిన‌ప్ప‌టి నుంచీ దోచుకోవ‌డ‌మే ప‌ని. ఇసుక నుంచి మ‌ద్యం వ‌ర‌కూ అన్నింటా దోపిడీనే. ప్ర‌కృతి వ‌న‌రుల‌పై ప‌గ బ‌ట్టిన‌ట్టు మ‌రీ కొల్ల‌గొడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇసుక త‌వ్వ‌కాల‌తో వైసీపీ నేత‌లు కాసులు దండుకుంటున్నారు. లేట‌రైట్‌, బాక్సైట్‌.. ఇలా ఏ ఒక్క ఖ‌నిజాన్ని వ‌ద‌ల‌కుండా త‌వ్వుకుంటున్నారు. అక్ర‌మ మైనింగ్‌పై ప్ర‌శ్నిస్తే దాడులు, కేసుల‌కు తెగ‌బ‌డుతున్నారు. కొండ‌ప‌ల్లిని కొల్ల‌గొడుతున్న తీరును వెలుగులోకి తీసుకొచ్చినందుకే మాజీ మంత్రి దేవినేని ఉమా మీద అంత దౌర్జన్యానికి దిగారు. కేవ‌లం కొండ‌ప‌ల్లి అనే కాదు.. విశాఖ మ‌న్యంలోనూ జోరుగా అక్ర‌మ మైనింగ్‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అదంతా వైసీపీ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కేవ‌లం విమ‌ర్శ‌లే కాదు.. కొండ్లు మ‌రీద‌య్య అనే అత‌ను ఏకంగా జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్‌లో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ఫ‌లితంగా.. విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్‌పై విచారణ కమిటీ ఏర్పాటవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 

విశాఖ మ‌న్యం మైనింగ్‌పై విచార‌ణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్‌ పేరుతో అక్రమాలు జరిగాయని ఎన్జీటీ నిర్ధరణకు వచ్చింది. వేల చెట్లు కూల్చి రోడ్డు వేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. అనుమతించిన పరిధి దాటి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్‌ చేశారని గుర్తించింది. అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని ఆదేశించింది. 

కమిటీలో కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర గనులశాఖ, పీసీబీ అధికారులు, విశాఖ కలెక్టర్‌ సభ్యులుగా ఉండనున్నారు. అక్రమ మైనింగ్‌ జరిగిన ప్రాంతంలో పర్యటించి మైనింగ్‌ అనుమతులు, పరిధి, రోడ్డు నిర్మాణం, అక్రమ మైనింగ్‌పై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. క‌మిటీ ఏర్పాటుతో వైసీపీ నాయ‌కుల్లో వ‌ణుకు మొద‌లైంది.  

వైసీపీ మైనింగ్ మాఫియా పునాదులు క‌దులుతున్నాయ‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అన్నారు. లేట‌రైట్ ముసుగులో బాక్సైట్ త‌వ్వుతున్న సీఎం జ‌గ‌న్ బంధువుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయ‌ని విమ‌ర్శించారు. 

గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన జగన్ రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గర్లో ఉంది. బాక్సైట్ కోసం తప్పులపై తప్పులు చేసిన జగన్ అండ్ కో తో పాటు మన్యంలో జరిగిన అక్రమ మైనింగ్ కి సహకరించిన అధికారులు కూడా ఈ సారి చిప్పకూడు తినడం ఖాయమ‌న్నారు నారా లోకేశ్.