జమిలీ బిల్లుకు డుమ్మా కొట్టిన బిజెపి ఎంపీలకు షోకాజ్ నోటీసులు 

లోకసభలో ఎన్డిఏ ప్రవేశ పెట్టిన జమిలీ బిల్లుకు బిజెపికి చెందిన ఎంపీలు డుమ్మా కొట్టారు. ఇంత కీలకమైన బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో అధికారపార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు గైర్హాజర్ కావడం  చర్చనీయాంశమైంది. కేంద్రమంత్రులైన గడ్కరీ, గిరిరాజ్, జ్యోతిరాదిత్య, సిపి పాటిల్ తదితరులు డుమ్మా కొట్టారు. విప్ జారీ చేసినప్పటికీ బిజెపి ఎంపీలు, ఐదుగురు కేంద్రమంత్రులు డుమ్మా కొట్టడం పట్ల బిజెపి అధిష్టానం సీరియస్ గా ఉంది. ,  ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లోకసభలో బిజెపికి మెజార్టీ లేనప్పటికీ బిజెపి ఈ బిల్లును ప్రవేశ పెట్టింది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దత్తు పలికింది. కానీ బిజెపి ఎంపీలు 20 మంది డుమ్మా కొట్టడం పట్ల అధిష్టానం సీరియస్ అయ్యింది. వారికి షోకాజ్ నోటీసులు పంపింది.  కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ రాం మేఘవాల్ ఈ బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టారు.   
Publish Date: Dec 18, 2024 11:38AM

మైనారిటీల హక్కుల దినోత్సవం 2024…వెనుకబడిన ప్రజలకు అపురూప వరం మైనారిటీ హక్కులు..!

  ప్రపంచంలో ప్రతీ దేశంలోనూ వేర్వేరు జాతులవారు, వేర్వేరు భాషలవారు,  వేర్వేరు మతపరమైన విశ్వాసాలు కలిగినవారు ఉంటారు. ఇందులో కొన్ని వర్గాల వారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా ఉంటారు.  కొన్ని వర్గాలవారి సంఖ్య  తక్కువ లేదా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారిని మైనారిటీలగా గుర్తిస్తారు. ఇక భారతదేశం గురించి మాట్లాడుకుంటే, మన దేశంలో ఉన్నంత  భిన్నత్వం ఏ దేశంలోనూ  ఉండదు. అయినా సరే భిన్నత్వంలో ఏకత్వానికి మంచి ఉదాహరణగా ఇప్పటికీ నిలుస్తుంది. దీనికి కారణం మన భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ  సమాన హక్కులను అందించడమే కాకుండా భాష, జాతి, సాంస్కృతిక, మతపరమైన మైనారిటీల  హక్కులను రక్షించడానికి పలు చర్యలను అమలు చేసింది. మైనారిటీల హక్కులు, భద్రత, అభివృద్ధి గురించి అవగాహన కల్పించడం,  మైనారిటీల సమస్యలను గుర్తించి, వారి రక్షణ కోసం చర్యలు తీసుకోవటానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మైనారిటీ హక్కుల దినోత్సవం  ఎప్పుడు మొదలైంది.. మొదటి మైనారిటీ హక్కుల దినోత్సవం 2013లో ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన  మైనారిటీల హక్కుల ప్రకటనపై  సంతకం చేసిన తరువాత మనదేశం ఈ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం 1992లో స్థాపించిన ‘జాతీయ మైనారిటీ కమిషన్ (NCM)’, ఈ  మైనారిటీల హక్కులని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. 2024 థీమ్... ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన థీమ్‌ను ఎంపిక చేస్తారు.  2024 సంవత్సరానికి “వైవిధ్యాన్ని ప్రోత్సహించటం, హక్కులను కాపాడటం” అనే థీమ్ ప్రకటించారు.  మన దేశంలో మత, భాష, సాంస్కృతిక, సామాజిక పరంగా ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి  మైనారిటీల హక్కులను కాపాడాల్సిన  అవసరాన్ని ఈ  థీమ్ తెలియజేస్తుంది. మైనారిటీ హక్కుల దినోత్సవం  ఎందుకు అవసరం.. మైనారిటీలకు సమాన హక్కులు, సామాజిక న్యాయం అందించడంతో పాటు వారి అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.  రాజ్యాంగపరంగా, చట్టపరంగా మైనారిటీలకి ఉన్న  హక్కుల గురించి అవగాహన కల్పిస్తుంది. సామాజిక, ఆర్థిక, విద్యా లోటుపాట్లను తొలగించటానికి కృషి చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 క్రింద మైనారిటీలకు హక్కులు కల్పిస్తుంది. ప్రభుత్వాలు, ఎన్జీవోలు, ప్రజలు అందరూ కలిసి మైనారిటీల సంక్షేమం కోసం  పనిచేయాలని పిలుపునిస్తుంది. భారతదేశంలో ఎవరు మైనారిటీలు? భారతదేశంలో మైనారిటీలను మతం, భాష, సంస్కృతిపై ఆధారపడి నిర్వచిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ ప్రకారం, 6 మత సమూహాలు అధికారికంగా మైనారిటీగా గుర్తించబడ్డాయి. మొదట ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు(జొరాష్ట్రియన్లు) మైనారిటీలుగా గుర్తించబడ్డారు. ఆ తర్వాత 2014లో జైనులను కూడా మైనారిటీలో భాగం చేశారు.  2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలోని మైనారిటీల్లో మొదటి స్థానంలో ముస్లింలు, చివరి స్థానంలో పార్శీలు ఉన్నారు. కేవలం మతం ఆధారంగానే కాకుండా  భాష, జాతి ఆధారంగా  కూడా మైనారిటీ వర్గాలు భారతదేశంలో ఉన్నాయి. మైనారిటీలందరికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30..  సాంస్కృతిక, విద్యా హక్కులను రక్షిస్తాయి. నేషనల్  మైనారిటీ కమిషన్ పాత్ర.... జాతీయ మైనారిటీ కమిషన్ 1992లో స్థాపించబడింది. ఇది మైనారిటీల హక్కులను రక్షించి, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుంది. మైనారిటీల రాజ్యాంగ హక్కుల అమలును పర్యవేక్షించటం, హక్కులకి భంగం కలిగినప్పుడు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడం, మైనారిటీల అభివృద్ధికి పాలసీలను సిఫార్సు చేయటం,  వారి  ఆర్థిక, సామాజిక పురోగతిని సమీక్షించటం ఈ కమిషన్ ముఖ్య విధులుగా ఉన్నాయి. మైనారిటీల హక్కులని కాపాడటానికి,  చాలా రాష్ట్రాల్లో కూడా  స్టేట్ మైనారిటీ కమీషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి కూడా మన రాజ్యాంగానికి అనుగుణంగానే  మైనారిటీల హక్కుల్ని కాపాడి, వారి అభివృద్ధికి కృషి చేస్తాయి.  మైనారిటీ హక్కుల దినోత్సవం ద్వారా ప్రభుత్వం, సమాజం, ప్రజలు  కలిసికట్టుగా మన దేశంలో సమానత్వం, న్యాయం కోసం పని చేయాలి. మన దేశ అభివృద్ధిలో మైనారిటీల పాత్రని కూడా గుర్తించాలి. సమాజంలో ఏ ఒక్కరూ వివక్షకి గురి కావటమో లేక హక్కులకి, అభివృద్ధికి దూరం కాబడటమో అనేది  వారితోపాటూ ఆ సమాజానికే మంచిది కాదు.  కాబట్టి  మైనారిటీల హక్కులను పరిరక్షించే సమాజాన్ని నిర్మించేందుకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి, ఆ దిశగా పని చేయాలి. ఇలా ఉన్నప్పుడు  మన భారతదేశం ఎప్పటికీ భిన్నత్వంలో ఏకత్వానికి  ఉత్తమ ఉదాహరణగా నిలిచిపోతుంది.                                          *రూపశ్రీ.  
Publish Date: Dec 18, 2024 10:07AM

ఎవరైనా మిమ్మల్ని పదే పదే అవమానిస్తే ఇలా చేయండి.. అవతలి వారు నోరు మూసుకుంటారు..!

  సరదా.. చాలా సహజంగా అనిపించే విషయం. చాలామంది సాధారణంగా మాట్లాడే సమయంలో సరదా పేరుతో కొన్ని జోక్స్ వేయడం లేదా కొన్ని మాటలు అనడం చేస్తుంటారు. ఆ సందర్భానికి అది పెద్దగా తప్పని అనిపించకపోయినా మరుసటి రోజు లేదా కొన్ని రోజుల తరువాత ఆలోచిస్తే అది చాలా అవమానంగా అనిపించవచ్చు. ముఖ్యంగా సరదా పేరుతో అనే కొన్ని మాటలు ఒకసారి అయితే సరదాగానే ఉంటుంది. కానీ పదే పదే ఆ మాటను అనడం లేదా పదే పదే అదే విధంగా ప్రవర్తించడం చేస్తుంటే అది అవమానించడం అవుతుంది.  ఇలా సరదా మాటున జరిగే అవమానాన్ని చాలామంది పంటి బిగువున భరిస్తుంటారు.  కొందరు అదే పనిగా సరదా అనే ఒక తెరను అడ్డు పెట్టుకుని మరీ మనుషుల్ని నొప్పిస్తుంటారు. ఈ పరిస్థితిని అధిగమించాలన్నా.. సరదా పేరుతో మిమ్మల్ని ఇతరులు పదే పదే అవమానించకూడదు అన్నా కింద చెప్పుకునే విధంగా మీ ప్రవర్తనను మార్చుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని వెక్కిరిస్తుంటే లేదా ఏదైనా వ్యక్తిగత వ్యాఖ్య చేస్తే, మీరు ఆ స్థలంలో ప్రశాంతంగా ఉండాలి . వెంటనే రియాక్ట్ కాకుండా ఉండాలి. ఎదుటి వ్యక్తి  ఏమి చెబుతున్నాడో,  ఎందుకు చెబుతున్నాడో  పూర్తిగా అర్థం చేసుకోవాలి. సరైన సమయం వచ్చినప్పుడు, ఆ ప్రశ్నకు మర్యాదగా, ముక్కుసూటిగా  సమాధానం ఇవ్వాలి. తాము అనే మాటలకు సమాధానం వస్తుంటే ఇంకోసారి అలా అనే సాహసం చెయ్యరు చాలావరకు.  కాబట్టి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు సున్నితంగానే చెప్పు దెబ్బ కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి. చాలా సార్లు ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు,  మిమ్మల్ని దూషించినప్పుడు. ఎవరైనా మిమ్మల్ని ఇతరుల ముందు అవమానించిన ప్రతిసారీ  రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. సమాధానం ఇవ్వడం కరెక్ట్ అనుకుంటారు కానీ.. ఎదుటి వారు అన్న మాటలకు అప్పటికే మనసులో కోపం పుట్టి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది వక్తి  మానసిక స్థితిని కూడా పాడు చేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు తర్కం,   ఆలోచనాత్మకత మరచిపోతుంటారు.  కాబట్టి వెంటనే రియాక్ట్ కాగండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే వెంటనే ఫీలైపోనక్కర్లేదు.  ఫీలవుతూ కోపంగా రియాక్ట్ అవ్వడం కంటే  నవ్వుతూనే చురకలు అంటించడం మంచిది. ఇలా చేస్తే ఇంకోసారి మీ జోలికి రాకుండా ఉంటారు.. ఇతరులు ఎలాగైతే సరదా పేరుతో మిమ్మల్ని  అంటున్నారో మీరు అదే సరదా మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ సరదాకు కాస్త చిరునవ్వు కూడా జోడించాలి. ఎవరైనా మిమ్మల్ని అవమానించడానికి ట్రై చేస్తున్నా,  పదే పదే అవే సంఘటనలు ఎదురవుతున్నా  ముందుగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఇతరులు అన్న విషయాన్ని చెడ్డ పదజలాంతో కాకుండా మర్యాదపూర్వకంగా ఉండే మాటలతోనే గట్టి సమాధానం చెప్పాలి. ఇలాచేస్తే మీరు చెప్పేది తప్పని ఎవరూ అనరు.  మర్యాదగానే మాట్లాడారనే మార్క్ మీకు ఉంటుంది.  మిమ్మల్ని అవమానించిన వారికి సమాధానం చెప్పామనే తృప్తి మీకూ ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానించినా, అర్థం చేసుకోకున్నా అది మీ తప్పు కాదు, ఎదుటివారి తప్పు. ఎవరో ఏదో అనగానే మీరు తప్పేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు.  మనం ముందుకు సాగుతూనే ఉండాలి. ప్రపంచంలోని ఎంకరేజ్ చేసేవారికంటే.. ఎగతాళి చేసి వెనక్కు లాగడానికి ట్రై చేసే వారే ఎక్కువ మంది ఉంటారని, మనుషుల్ని బాధపెట్టడానికే ముందుకు వస్తారని గుర్తుంచుకోవాలి. అలాంటివారి మాటలను వదిలిపెట్టి  ముందుకు వెళ్లడమే అందరూ చేయాల్సిన పని.                                             *రూపశ్రీ.
Publish Date: Dec 18, 2024 9:30AM

ఆహారమే కాదు.. ఎసిడిటీకి ఇవి కూడా కారణాలేనట..!

  ఎసిడిటీ అనేది చాలా సాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరూ   ఎప్పుడో ఒకప్పుడు ఎసిడిటీ సమస్యను అనుభవించి ఉంటారు. కొన్ని కారణాల వల్ల కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. అసిడిటీ కారణంగా అజీర్ణం, జీర్ణ సమస్యలు, గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఎసిడిటీని ప్రధానంగా ఈటింగ్ డిజార్డర్స్ వల్ల వచ్చే సమస్యగా పరిగణిస్తారు. అయితే దీనికి  ఇతర  కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల వచ్చే సమస్య ఎసిడిటీ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం వల్ల ఎసిడిటీ సమస్య ఏర్పడినప్పుడు యాసిడ్ ఆహార నాళంలోకి  తిరిగి వస్తుంది.  దీని కారణంగా ఛాతీ దిగువ భాగంలో నొప్పి లేదా మంట వస్తాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారికైనా ఎసిడిటీ రావచ్చు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎసిడిటీకి ప్రధాన కారణమని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కాకుండా, ఎసిడిటీని కలిగించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎసిడిటీ రావడానికి ఆహారం మాత్రమే కాకుండా వేరే ఇతర కారణాలు ఏమున్నాయి?  కడుపులో ఉండే యాసిడ్ (గ్యాస్ట్రిక్ జ్యూస్) అధిక మొత్తంలో ఉత్పత్తి కావడం వల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది. ఈ కడుపు ఆమ్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అయితే యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం లేదా కడుపు గోడలలో విచ్చలవిడిగా  వ్యాపించడం జరిగినప్పుడు అది కడుపులో మంట, నొప్పి,  ఇతర సమస్యలకు దారితీస్తుంది. అసిడిటీ లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి.  ఇవి కూడా  తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాల  వరకు ఉంటాయి. తిన్న వెంటనే లేదా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కడుపు మండే అనుభూతి కలిగి ఉంటుంది. త్రేనుపులు బాగా వస్తాయి ముఖ్యంగా పుల్లని త్రేనుపులు ఎక్కువ ఉంటాయి. తరచుగా నోటిలో పుల్లని రుచి ఉంటుంది. కడుపులో భారం, నొప్పి,  కడుపు ఉబ్బరం వంటి  సమస్యలు ఎప్పుడూ అనిపిస్తుంటాయి. గొంతులోకి యాసిడ్ చేరడం వల్ల మంట,  పొడి దగ్గు. వికారం,  వాంతులు లేదా తరచుగా రెగ్యురిటేషన్ ఆహారమే కారణమా? ఆహార సంబంధిత అలవాట్లు చాలా ముఖ్యమైనవి. మితిమీరిన కారంగా,  వేయించిన ఆహారాన్ని తినడం, టీ, కాఫీ లేదా కార్బోనేటేడ్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం ఎసిడిటీకి ప్రధాన కారణాలు. తిన్న వెంటనే పడుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా ఎక్కువ సేపు ఆకలితో ఉండడం, ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఎసిడిటీ రావచ్చు. ఇవి కూడా  కారణాలే.. తినే అలవాట్లతో  పాటు అనేక జీవనశైలి సంబంధిత కారణాల వల్ల కూడా  ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం,  మద్యం సేవించే వ్యక్తులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  ఇది కాకుండా అధిక ఒత్తిడి,  ఆందోళనలో ఉన్నా.. తగినంత నిద్ర లేకున్నా..  లేదా ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ,  ఉన్నా ఎసిడిటీకి గురవుతారు.                                           *రూపశ్రీ.  
Publish Date: Dec 18, 2024 9:30AM

కడప కోట బద్దలు.. వైసీపీ క్యాడర్ కకావికలు!?

కడపలో వైసీపీ ఉనికి మాయం అయిపోతోందా? ఆ పార్టీకి నేతలేలేకుండా పోతున్నారా? కడప జిల్లాలో తొలి నుంచీ ఉన్న వైఎస్ కుటుంబం పట్టు సడలుతోందా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఎవరైనా ఔననే సమాధానం ఇస్తారు. జగన్ వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచీ కడపలో ఆ పార్టీదే హవా. అంతకు ముందు అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం కడప జిల్లా ఆయన గుప్పిట్లో ఉండేది. అందుకే కడప జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. అయితే వైఎస్ మరణం తరువాత జిల్లా మొత్తం జగన్ వెంట నిలిచింది. అయితే 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయంతో అంత వరకూ జగన్ కు పెట్టని కోటగా నిలిచిన కడపలో ఆయన పలుకుబడి మసకబారింది. ఎన్నికలలో ఆ పార్టీ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ కేవలం మూడంటే మూడు స్థానాలలో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. కడప పార్లమెంటు స్థానంలో వైసీపీ అభ్యర్థి, జగన్ పదే పదే చెబుతూ వస్తున్న చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి విజయం కూడా ఆ నియోజకవర్గం నుంచి షర్మిల రంగంలో నిలవడం వల్లనే సాధ్యమైందని పరిశీలకులు ఫలితాలు వచ్చిన అనంతరం విశ్లేషించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోవడమే అవినాష్ రెడ్డి విజయానికి దోహదం చేసిందనడంలో సందేహం లేదు. ఇక పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ రెడ్డి విజయం సాధించినా మెజారిటీ అనూహ్యంగా తగ్గింది. అన్నిటికీ మించి కడప జిల్లా నుంచి వైసీపీ గెలిచిన మూడు స్థానాలలో ఒకటి జగన్ పోటీ చేసిన పులివెందుల కాగా, మరోటి కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా   బిజెపి పోటీ చేసిన స్థానంలో అభ్యర్థి బలహీనుడు కావడం వల్ల వచ్చింది.  సరే ఆ ముచ్చట పక్కన పెడితే  ఇటీవల పులివెందులలో జరిగిన నీటి సంఘాల ఎన్నికలలో తెలుగుదేశం  క్లీన్ స్వీప్ చేసింది.  దివంగత వైయస్ఆర్ స్వస్థలమైన బలపనూరులో కూడాతెలుగుదేశం తిరుగులేని విజయం సాధించింది. ఇక కడప కార్పొరేషన్ సైతం వైసీపీ చేజారడం ఖాయమైపోయింది. వైసీపీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరారు.  అసలు కడప జిల్లాలో వైసీపీని ముందుండి నడిపించేందుకు నాయకుడే లేని పరిస్థితి ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గతంలో అంటే వైఎస్ వివేకానందరెడ్డి బతికి ఉన్న కాలంలో ఆయనే అన్నీ చూసుకునే వారు.  అయితే ఆయనను పక్కన పెట్టి జగన్ అవినాష్ రెడ్డిని ప్రోత్సహించారు. సరే 2019 ఎన్నికల ముందు  వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక ఉన్నది అవినాష్ రెడ్డే అన్నఆరోపణలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిలుపై ఉన్నారు.  అది పక్కన పెడితే  గత ఐదు సంవత్సరాలలో, అవినాష్ రెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఐదేళ్లూ  వైసీపీ అధికారంలో ఉండటం వల్ల పార్టీ కోట బీటలు వారుతున్న విషయాన్ని కప్పి పుచ్చి జిల్లాలో తనకు, పార్టీకి తిరుగులేదన్న బిల్డప్ ఇవ్వగలిగారు. అయితే ఎన్నికలలో పరాజయం తరువాత ఒక్కసారిగా అవినాష్ రెడ్డికి పార్టీని నడిపే సమర్థత ఇసుమంతైనా లేదన్న విషయం బహిర్గతమైంది.  ఇప్పుడు జిల్లాలో పార్టీ అటు లీడర్, ఇటు క్యాడర్ లేకుండా పోయింది. చివరాఖరుకు జగన్ కూడా పులివెందులలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  
Publish Date: Dec 18, 2024 7:54AM

ఏపీని వదలని వానలు

జనవరి నెల సమీపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వదలడం లేదు. బంగాళా ఖాతంలో ఏర్పడుతున్నవరు అప్పపీడనాలతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన అప్పపీడనం రానున్న రెండు రోజుల్లో మరింత బలపడనుంది. దీని ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలలో ఓ మోస్తరు నుంచి భీరా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.    ఈ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే  తిరుపతి, నెల్లూరులలోనూ, తూర్పుగోదావరి జిల్లాలలోనూ మంగళవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.   
Publish Date: Dec 18, 2024 7:29AM