Top Stories

ముగిసిన గ్రామ సభలు... రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు భారీ దరఖాస్తులు

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలు  నిన్నటితో ముగిసాయి. 16, 348 గ్రామసభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. శనివారం నుంచి లబ్దిదారుల ఇంటికి వెళ్లి రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేటీంలు ఇంటింటికి వెళ్లనున్నాయి. గతంలో ప్రజాపాలనలో లబ్ది చేకూరని వారికి గ్రామసభలో దరఖాస్తులు చేసుకున్నారు. లబ్దిదారులకు అర్హత ఉందా లేదా అనేది ఈ రీ సర్వేలో చేయనున్నారు  ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన గ్రామసభల్లో పలువురు రాష్ట్రమంత్రులు , ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు  సంబంధించి  ప్రజలు దరఖాస్తులు అందజేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్దిదారులను కన్ఫర్మ్ చేయడానికి గ్రామసభలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు ఈ వేడుక జరిగింది. అన్నీ చోట్ల భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే లబ్దిదారుల ఎంపిక కాకపోవడం ప్రతికూలాశం. అనర్హులకు అవకాశాలు రావడంపై ప్రజల నుంచి  పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది.   రేషన్ కార్డుల లబ్దిదారుల జాబితాలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేరు ఉండటం స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం,  పచ్చల నడికుడి గ్రామ సభలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.  జాబితా నుంచి నా పేరు తొలగించాలని స్వయంగా అన్వేష్ రెడ్డి అధికారులను కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామకృష్ణాపురంలో అనర్హులుకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి. తుంగతుర్తిలో కూడా అనర్హులకు లబ్దిదారుల జాబితాలో చోటు లభించింది.  మెజారిటీ గ్రామసభలో  స్థానికుల నుంచి తీవ్ర వ్యతరేకత వచ్చింది.  ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది.  హన్మంకొండ జిల్లా కమలాపూర్ లో జరిగిన గ్రామసభలో హుజురాబాద్ ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఆరోపిస్తూ  ఆయన వాకౌట్ చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కోడి గుడ్లు, టమాటోలు, చెప్పులు విసిరారు.  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం లో ఆత్మీయ సభకు తమను సెలెక్ట్ చేయాలన్న డిమాండ్ స్థానిక కూలీల నుంచి వచ్చింది.  బోథ్ మండలం సోనాలి గ్రామ సభలో బిజెపి, కాంగ్రెస్ శ్రేణుల మధ్య చిన్నపాటియుద్దమే జరిగింది. రెబ్బన మండలంలో అనర్హులకు అవకాశం వచ్చిందని స్థానికులు ఉక్రోశం వెలిబుచ్చారు. రోడ్డుపై బైఠాయించారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో కాంగ్రెస్, బిజెపి శ్రేణులు కొట్టుకున్నాయి. గద్వాలజిల్లా థరూర్ మండలంలో  ప్రజలు గ్రామసభలను బహిష్కరించారు. నాగార్ కర్నూలు జిల్లా తెలకపల్లి గ్రామంలో కాంగ్రెస్, బిజెపి శ్రేణులమధ్య పెద్ద గొడవ జరిగింది. ఉమ్మడి ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో గ్రామసభలు ప్రశాంతంగా జరిగాయని చెప్పొచ్చు. 
Publish Date: Jan 25, 2025 11:58AM

అయోధ్యరామిరెడ్డి ఖండించినా.. అగని రాజీనామా ప్రచారం

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి పార్టీకి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు శుక్రవారం (జనవరి 24) సాయంత్రం నుంచీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారం కూడా విజయసాయి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాననీ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా  ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే అయోధ్యరామిరెడ్డి రాజీనామా వార్త ప్రచారంలోకి రావడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ వార్త బయటకు పొక్కిన క్షణాల్లో పలువురు వైసీపీ మాజీ నేతలు అయోధ్యరామిరెడ్డి బీజేపీ గూటికి చేరుతారంటూ విశ్లేషణలు చేశారు. వైసీపీ వర్గాలు కూడా గత కొంత కాలంగా అయోధ్యరామిరెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారనీ, ఆయన ఎప్పుడో అప్పుడు పార్టీ మారుతారని అనుకుంటూనే ఉన్నామని చెప్పుకొచ్చారు.  వైసీపీలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నలుగురైదుగురు నేతలలో కచ్చితంగా అయోధ్యరామిరెడ్డి ఒకరు. రాంకీ అధినేత అయిన అయోధ్యరామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితులలో ఒకరిగా గుర్తింపు పొందారు. అటువంటి అయోధ్యరామిరెడ్డి రాజీనామా వార్తలు వైసీపీలో కలవరం రేపాయి. అయితే ఒకింత ఆలస్యంగానైనా అయోధ్యరామిరడ్డి తన రాజీనామా వార్తలను ఖండించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ ట్వీట్ చేశారు. తాను ప్రస్తుతం విదేశాల్లో  ఉన్నాననీ, వారం రోజుల్లో తిరిగి వస్తాననీ, అప్పుడు మీడియాతో వివరంగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు.   అయోధ్యరామిరెడ్డి తాను వైసీపీలోనే ఉన్నానని కరాఖండీగా చెప్పినప్పటికీ ఆయన మాటలను సొంత పార్టీ శ్రేణులే విశ్వసించడం లేదు. 2024 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత నుంచీ అయోధ్యరామిరెడ్డి పార్టీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించింది లేదు. ఆయన బీజేపీతో టచ్ లోకి వెళ్లారనీ, కమలం కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారనీ గత కొంత కాలంగా వార్తలు వినవస్తూనే ఉన్నాయి. బీజేపీ కూడా ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని కమలం వర్గాలు చెబుతున్నాయి.  
Publish Date: Jan 25, 2025 11:56AM

జగన్ కు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం.. విజయసాయి భయమేంటి?

విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటన.. ఇక తన భవిష్యత్ వ్యాపకం వ్యవసాయమే అంటూ చేసిన రాజకీయ సన్యాసం ప్రకటన రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా వైసీపీ అయితే పూర్తిగా డీలా పడిపోయింది. జగన్ పై పార్టీలో విశ్వాసరాహిత్యం పెచ్చరిల్లిందనడానికి విజయసారి రాజీనామాయే ఉదాహరణ అని పరిశీలకులు అంటున్నారు. తన రాజీనామా విషయంలో విజయసాయి ఎంత చెప్పినా, ఎంతగా తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నా, వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియదని ఎంతగా నమ్మబలికినా ఎవరూ నమ్మడం లేదు. ఎవరిదాకానో ఎందుకు వైసీపీ వర్గాలే ఆయన మాటలను విశ్వసించడం లేదు. జగన్ కు పట్ల అంత విధేయత ఉంటే.. కనీసం ఆయన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే వరకైనా రాజీనామా ప్రకటన చేయకుండా ఉండాలి కదా అంటున్నారు.  వాస్తవానికి విజయసాయి రాజీనామా ప్రకటన కంటే.. ఆ ప్రకటన ఆయన చేయడానికి ఎంచుకున్న సమయం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. విజయసాయి రాజకీయ సన్యాసం వైసీపీ శ్రేణులకు పార్టీకి ఇక భవిష్యత్ లేదన్న సంకేతాన్ని పంపించిందనడంలో సందేహం లేదు. అన్నీ జగన్ కు చెప్పాను, ఆ తరువాతే రాజీనామా నిర్ణయం ప్రకటించాను అని విజయసాయిరెడ్డి చెప్పుకున్నా.. పార్టీలో ఎవరూ నమ్మడం లేదు. ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో విజయసాయి తన రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన చేయడం పార్టీ నేతలు, కేడర్ ను షాక్ కు గురి చేసింది. ఇంతటి కీలక నిర్ణయాన్ని విజయసాయి జగన్ ఆబ్సెన్స్ లో ఆయనతో చర్చించకుండా తీసుకోవడం నిజంగా అందరినీ షాక్ కు గురి చేసింది. అదును చూసి దెబ్బకొట్టాడా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసింది.  ఒక వేళ విజయసాయి తాను చెబుతున్నట్లుగా జగన్ తో తన రాజీనామా విషయం చర్చించి ఉంటే కచ్చితంగా ఆయన వద్దని వారించేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసం తాను విదేశీ పర్యటన నుంచి వచ్చే వరకైనా రాజీనామా నిర్ణయం ప్రకటనను ఆపేవారని చెబుతున్నారు. అది జరగలేదంటే విజయసాయి తన నిర్ణయాన్ని జగన్ కు సూచన ప్రాయంగానైనా తెలియజేయలేదనే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలా జగన్ కు కూడా చెప్పాపెట్టకుండా విజయసాయి రాజీనామా చేశారంటే..విజయసాయి ఏ స్థాయి ఒత్తిడిలో ఉన్నారో అవగతమౌతుంది.  కేసులు, అరెస్టు నుంచి తనను తాను కాపాడుకోవడానికే విజయసాయి ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Jan 25, 2025 11:40AM

విజయసాయి రాజీనామా ఆమోదం

విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆమోదించారు. విజయసాయి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో అందజేయడంతో ఆ రాజీనామాను ఉప రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. ఈ విషయాన్ని విజయసాయి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేశానని పునరుద్ఘాటించారు. అన్ని విషయాలూ వైసీపీ అధినేత జగన్ తో మాట్లాడాననీ, ఆ తరువాతే రాజీనామా చేశానని చెప్పారు. భవిష్యత్ లో ఇక రాజకీయాల గురించి మాట్లాడనని విస్పష్టంగా చెప్పిన విజయసాయి, కేసుల నుంచి బయటపడడానికే తాను రాజీనామా చేశానంటూ వస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎవరి చేతో కేసులు మాఫీ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో తాను లేనని చెప్పారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్ గా మారలేదని చెప్పిన విజయసాయి వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవన్నారు.  
Publish Date: Jan 25, 2025 11:14AM

బిల్ గేట్స్ సోర్స్ కోడ్ బుక్.. చంద్రబాబుకు గిఫ్ట్

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, చంద్రబాబు మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు దార్శనికతకు తాను ఫిదా అయ్యానని బిల్ గేట్స్ పలు సందర్భాలలో చెప్పారు. అటువంటి బిల్ గేట్స్ తో నారా చంద్రబాబు ఇటీవలి దావోస్ పర్యటన సందర్భంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా బిల్ గేట్స్ చంద్రబాబుకు ఒక అపురూప బహుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా మీడియాకు తెలిపారు. ఇంతకీ బిల్ గేట్స్ ఇచ్చిన బహుమతి ఏమిటంటే... తాను కాలేజీ వీడిన తరువాత మైక్రోసాఫ్ట్ కంపెనీని ఎలా ఫ్లోట్ చేశారు, తన జర్నీకి సంబంధించిన అనుభవాలు, విశేషాలతో కూడిన సోర్స్ కోడ్ బుక్. ఔను బిల్ గేట్స్ తన సోర్స్ కోడ్ బుక్ ను చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. దీనికి చంద్రబాబు బిల్ గేట్స్ కు థ్యాంక్స్ చెప్పారు. బిల్ గేట్స్ సోర్స్ కోడ్ బుక్ చాలా స్ఫూర్తిదాయకమని చెప్పిన చంద్రబాబు.. ఆ సోర్స్ కోడ్ బుక్ నవ్యాంధ్ర పురోగమనం విషయంలో తనకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 
Publish Date: Jan 25, 2025 11:03AM

పిల్లి, గురుస్వామి బుజ్జగింపులు విఫలం.. ఎంపీగా రాజీనామా చేసిన విజయసాయి

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చెప్పిన విధంగా శనివారం (జనవరి 25)న ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో  రాజ్యసభ చైర్మన్  జగదీప్ ధన్కడ్ కు అందజేశారు. తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాననీ, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాననీ శుక్రవారం (జనవరి 24) విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.  ఈ ప్రకటనతో వైసీపీ హై కమాండ్ ఉలిక్కిపడింది. ఆయన ఏదో ఒత్తిడితో రాజీనామా నిర్ణయం తీసుకుని ఉంటారనీ, ఆయనతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేయాలన్న పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గురుస్తామిలను హుటాహుటిన ఢిల్లీకి పంపింది. వారిరువురూ వేరువేరుగా విజయసాయి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. అయితే విజయసాయి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. ముందుగా ప్రకటించిన విధంగా తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో జగదీశ్ ధన్కడ్ కు అందజేశారు. విజయసాయి నిర్ణయం తనను షాక్ కు గురి చేసిందని ఎంపీ గురుస్తామి అన్నారు. పిల్లి కూడా విజయసాయి రాజీనామాపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  
Publish Date: Jan 25, 2025 10:25AM