అసమర్ధ నాయకత్వాన్ని వధించే నేటికాలపు బ్రహ్మాస్త్రం ఓటు .. 

 


ఓటూ...ఓటూ నువ్వేం చేయగలవని దాన్నడిగితే,  “నేను మీరంతా ఆరాటపడే డబ్బు నోట్లని రాత్రికి రాత్రే వరదలా పారించగలను... రాజుల్లా బ్రతుకుతున్న రాజకీయ నాయకులని కూడా కూలివాడి ఇంటి ముందు  నిలబెట్టించగలను.. మీరు బాధ్యతగా ఉంటే మీ చేతుల్లో ఆయుధమై దేశ భవిష్యత్తుని, మీ భవిష్యత్తుని  మార్చేయగలను” అని అంటుందేమో.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఉన్న ప్రజలకి  ఓటు విలువ గురించి బాగా తెలిసుండాలి. మనల్ని మనమే బాగుపర్చుకోవటానికి  రాజ్యాంగం మన చేతిలో పెట్టిన బ్రహ్మాస్త్రం లాంటిది ఈ ఓటు. దేశ పౌరులందరూ  ఓటుకున్న నిజమైన విలువ తెలుసుకుని, నామమాత్రపు ప్రలోభాలకి లొంగిపోకుండా దాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడు దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే  ప్రజాస్వామ్యంలో ఓటుకున్న ప్రాముఖ్యత, బలాన్ని ప్రజలకి తెలియజేసే ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము.  

ఎప్పుడు మొదలైంది....

1950, జనవరి 25న భారత ఎన్నికల సంఘం(ECI) స్థాపనకు  గుర్తింపుగా   2011 నుంచి  జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని   జరుపుకోవటం మొదలుపెట్టారు. ఈ రోజు  ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనేలా  ప్రోత్సహించడానికి, అర్హత కలిగిన ప్రతీ పౌరుడు ఓటరుగా నమోదు కావాలనే అవగాహన కలిగించడానికి ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ప్రజలకి  అవగాహన కలిగించడం, ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది జరిగే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం నాటికి  భారత ఎన్నికల సంఘం  స్థాపన జరిగి 75 ఏళ్లు పూర్తవుతుంది.
 
ఓటు  విలువ..

మందుకో, నోటుకో లేక ఇతర ప్రలోభాలకో  అమ్ముడుపోయి  రాజ్యాంగం మనకిచ్చిన  విలువైన ఓటు  హక్కుని  వృధా చేసుకోవద్దనీ, సరిగా వినియోగిస్తే  దేశ భవిష్యత్తును రూపుదిద్దడంలో  ఓటుదే ప్రధాన పాత్ర అనే విషయాల గురించి ప్రజల్లో అవగాహన కలిగాలి.  ఓటు హక్కు వయస్సుని 21 నుంచి 18కి కుదించారు కనుక అధిక యువ జనాభా ఉన్న భారత దేశ భవిష్యత్తుని మార్చగల శక్తి యువ ఓటర్లలో ఉంటుంది. అందుకే బాధ్యతగా ఉండి సరైన నాయకుణ్ణి ఎన్నుకోవటంలోనే తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న నిజాన్ని యువ ఓటర్లు గ్రహించేలా చేయటానికి,  నిష్పక్షపాతంగా  ఎన్నికలు జరిగేందుకు  కృషి చేసిన అధికారులు, భాగస్వాములు, సంస్థలను "ఉత్తమ ఎన్నిక పద్ధతుల పురస్కారాలు" ఇచ్చి గుర్తించడానికి గానూ  ఈరోజు  ఒక వేదికవుతుంది.

ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ..

ఓటుహక్కు అనేది పౌరులకు తమ నాయకులను తామే  ఎంపిక చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలపర్చే అవకాశం ఇస్తుంది.  జవాబుదారీగా ఉండే అవకాశం ఇస్తుంది. ఎన్నికల సమయంలో ఓటర్లు  తీసుకున్న నిర్ణయాలే దేశ విధానాలు, అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఓటు హక్కు అన్ని వర్గాల వారు ఉపయోగించటం వల్ల  అన్ని కమ్యూనిటీల నుండి విభిన్న ప్రతినిధులు ఎన్నికై  వారి భావాలని, బాధలని  దేశానికి  వినిపించేందుకు అవకాశం దొరుకుతుంది.  99.1 కోట్ల ఓటర్లను నమోదు చేసి భారతదేశం ఒక సరికొత్త రికార్డు నెలకొల్పింది. అందులో యువ ఓటర్లు  21.7 కోట్లు మంది ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఓటు హక్కు విలువ ఎంత అంటే.. భారతదేశంలో ఉన్న వందకోట్ల ప్రజానీకం విలువంత..   కాబట్టి ఎవరూ ఓటు హక్కును తృణ ప్రాయంగా త్యజించడం లేదా అవగాహన లేకుండా ఓటు వేయడం చేయకూడదు.


ఓటింగులో ఉన్న సవాళ్లు..

ఇప్పటి ఎన్నికల్లో ఎక్కువగా ఓటు వేయటానికి ఆసక్తి చూపించనిది ఎవరని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.. ఎందుకంటే  విధ్యాబుద్ధులు లేని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే  గిరిజన తెగవారు కూడా ఓటుహక్కు వినియోగించుకుంటుంటే, ఎంతో చదువుకుని నగరాల్లో స్థిరపడి నాగరికత గురించి లెక్చర్లు ఇచ్చేవారు మాత్రం ఓటు వేయకుండా ఎన్నికల రోజుని ఒక సెలవురోజులా చూస్తున్నారు.  ఇది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉంది.  ఓటు హక్కు, ఎన్నికల  ప్రక్రియల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా మంది ఓటు వేయకుండా ఉండిపోతున్నారు. అలాగే జీవనోపాధి కోసం  దూర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు వచ్చే వీలు లేక, తగిన సౌకర్యాలు కల్పించలేకపోవటం వల్ల కూడా  ఓటింగ్ తగ్గుతుందని చెప్పాలి.

ఓటు..  ప్రతి పౌరుడి బాధ్యత..

మన ఒకరి ఓటుతో   పెద్దగా ఒరిగేదెముందిలే? అని ఆలోచించే ప్రతీ ఒక్కరు మరో సారి పునరాలోచించాలి ఎందుకంటే ఒక ఇంటి పెద్ద సరిగా లేకుంటే కుటుంబం ఎలా నాశనమవుతుందో, ప్రజలు ఎన్నుకునే నాయకుడు అవినీతిపరుడో, అసమర్ధుడో అయితే సమాజం, దేశం నాశనమవుతాయన్న నిజాన్ని గ్రహించాలి. అన్నీ తెలిసినవాళ్ళు చదువుకున్న మూర్ఖుల్లా మిగిలిపోకుండా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో ఓటు హక్కు విలువను నలుగురికీ తెలియజేయాలి.  ప్రజాస్వామ్య వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పౌరులంతా భాగస్వాములు కావాలి. అప్పుడే ఓటు విలువ,ఓటు వేసే మనిషి విలువ కూడా పదిలంగా ఉంటుంది.


                                   *రూపశ్రీ.