ఆమె కనే కలలకి రెక్కలనివ్వు.. అంతరిక్షపు అంచులని కూడా తాకగలదు..
posted on Jan 24, 2025 9:30AM

భారతీయ సమాజంలో ఇప్పటికీ ఒక మచ్చలా ఉండిపోయిన అంశం.. ఆడపిల్లని ఒక పెద్ద భారంగా చూడటం లేదా అప్రయోజకురాలని ముందే నిర్ణయించేయటం. కాలం ఎంతలా మారినా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట తల్లిదండ్రుల నోటి నుంచో, ఏ బంధువుల నోటి నుంచో ‘ఆ...డపిల్ల పుట్టిందా..!’ అన్న పెదవి విరుపు మాట వినాల్సి వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇది జరుగుతోందంటే అది నిజంగా మన సమాజపు దౌర్భాగ్యమనే చెప్పాలి. ఊరికో అమ్మవారిని కొలిచే సాంప్రదాయం ఉన్న భారతీయులు తమ ఇంట్లో ఆడపిల్ల పుడితే అపురూపంగా చూడలేకపోతున్నారు. వీర వనితల గురించి, సమాజం మీద వారు చూపించిన ప్రభావం గురించి పురాణాలు, గత చరిత్రలు సాక్ష్యాలుగా నిలుస్తున్నా కూడా ఆడపిల్ల జీవితం అమ్మ కడుపులోనో, రోడ్డు పక్కన చెత్తబుట్టలోనో అంతమవుతూనే ఉంది. ఇప్పుడిప్పుడు కొంత మార్పు మొదలైనా కూడా అదంతా పైపై మెరుగులా స్త్రీ జాతికి ఏదో మేలు జరిగిపోతోందనే మాటలు మాత్రం ఎక్కువ ఉంటాయి. సమాజంలో మహిళల ప్రాధాన్యతపై అవగాహన పెంచడానికి, భారత యువ జనాభాలో కీలక భాగమైన బాలికల ప్రాముఖ్యతను ప్రజలకు చాటి చెప్పడానికి, వారి విద్య గురించి అవగాహన కల్పించడానికి 2008 నుంచి ప్రతీ సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
బాలికలకూ బంగారు జీవితం..
ఆపిడ్డలలు తమ కుటుంబంలోనూ, సమాజంలోనూ చాలా వివక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ వివక్షని నిర్మూలించటానికి, సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చటానికి, మన నాగరికత మనుగడకి బాలికలు కూడా ముఖ్యమేనన్న విషయం అర్ధమయ్యేలా వివరించటానికి జాతీయ బాలికా దినోత్సవం మంచి వేదిక అవుతుంది. ఆడపిల్లలు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్న రోజుల్లోనే వారి విద్య కోసం ఎన్నో కష్టాలని, అవమానాలని ఎదుర్కొని మరీ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మారిన సావిత్రిబాయి ఫూలే, తొలి మహిళా వైద్యురాలిగా మారిన చంద్రపభా సైకియాని, ఫాతిమా షేక్ లాంటి పలువురు సంఘ సంస్కర్తల త్యాగాలను, పోరాటాన్ని ఈ రోజు మనకి గుర్తు చేస్తుంది. ఆడపిల్లల భ్రూణ హత్యలని నిరోధించటం, బాలికల విద్యను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను గుర్తుచేస్తుంది. బాలికల హక్కులు, సమాజంలో వారి పాత్రపై అవగాహన పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. భారతదేశ భవిష్యత్తుకు బాలికలు కూడా కీలకమైన భాగమనీ, వారిని రక్షించడం, విద్యను అందించడం, సమాన అవకాశాలు కల్పించడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.
2025 థీమ్.....
భారత ప్రభుత్వం జాతీయ బాలిక దినోత్సవం 2025కి గానూ, “ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకి సాధికారత కల్పించటం” అనే అంశాన్ని ఎంచుకుంది. ఈ థీమ్ మన దేశ భవిష్యత్తు బాగుండాలంటే దాని నిర్మాణంలో బాలికలకి కూడా సమ ప్రాధాన్యమిచ్చి, సాధికారత కల్పించాలన్న విషయాన్ని తెలియజేస్తుంది. సమాజ అభివృద్ధిలో వారి పాత్రను హైలైట్ చేస్తుంది.
సాధించాల్సిన లక్ష్యాలు....
బాలికల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, సమాజంలో మగవారితోపాటూ సమానావకాశం ఇవ్వాలి. వారికి నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి కలలను సాధించడంలో సహాయం చేయాలి. బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు, స్వయం సమర్థతను పొందేందుకు, స్వంతంగా చురుకైన నిర్ణయాలు తీసుకోగలిగేలా ప్రోత్సహించాలి. భారతదేశంలో బాలికల అభ్యున్నతికి, సంక్షేమానికి మద్దతు ఇచ్చేలా చర్యలు తీసుకోవటం, విధానాలను రూపొందించటం చేయాలి. బాలికల పట్ల అడుగడుగునా జరిగే అత్యాచారాలు, దౌర్జన్యాలని అరికట్టి సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సమాజాన్ని ప్రోత్సహింఛాలి.
బాలికల అభివృద్ధితోనే మన దేశ అభివృద్ధి.....
ప్రతీ బాలికకు తగిన గౌరవం, అవకాశాలు లభించేవరకు ఈ దినోత్సవ లక్ష్యం నెరవేరనట్టే అర్ధం. ప్రతి ఒక్కరూ బాలికలను రక్షించి, వారికి భవిష్యత్తు అందించడానికి కృషి చేయాలి. బాలికలను శక్తివంతం చేసి, సమాజపు మూస ధోరణిలను పగలగొట్టాలి. ప్రతీ బాలికలోనూ అపారమైన సామర్థ్యం ఉందని గుర్తుచేస్తూ, వారి ప్రతిభను గుర్తించి, ప్రశంసించడం ద్వారా మనం మరింత గొప్ప సమాజాన్ని నిర్మించగలుగుతాం. లింగ సమానత్వం ఒక కల కాదు నిజమేనని నిరూపించేలా అడుగులు వేస్తూ, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అందరూ అర్ధం చేసుకోవాలి. వారు అనుకుంటే అంతరిక్షం కూడా చేరుకోగలరన్న నమ్మకాన్ని మన ఇంటి ఆడపిల్లకి ఇచ్చిననాడు, భారతదేశంలోని ఆడబిడ్డలంతా వారి శక్తి సామర్ధ్యాలతో సమాజపు రూపురేఖలనే మార్చగలుగుతారు. ఆడపిల్లే కదా అని అలుసుగా చూడకు... ఆమె లేకపోతే సమాజం ఒంటెద్దు బండిలా కుంటుతూ నడుస్తుందన్న నిజాన్ని గ్రహించు.
*రూపశ్రీ.