తెలియని తాళం వేసిన అన్ని తలుపులని విద్య తెరవగలదు!

 

‘’విద్య లేనివాడు వింత పశువు” అనే పాత తెలుగు సామెత వినటానికి కొంచెం కఠినంగా అనిపించినప్పటికీ,   మనిషికి విద్య  ఎంత ముఖ్యమో మొట్టికాయ పెట్టి  మరీ చెప్పినట్టు ఉంటుంది. జ్ఞానం అనేది  ఒక శక్తి. అది విద్య నుంచే మొదలవుతుంది.  ఇప్పుడు విద్య అనేది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే కాదు ఒక కనీస అవసరం.  ఇది వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతికి మూలస్తంభం. ఈ రోజుల్లో సమాజంలో మనగలగలగాలంటే  డబ్బు ఎంత ముఖ్యమో, విద్య అంత కన్నా ముఖ్యం. ఒక మనిషిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపగలిగే శక్తి విద్యకుంది. అందుకే  దీని ప్రాముఖ్యతని, అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ  2018లో  విద్య దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి ఏడాది జనవరి 24న  ప్రపంచమంతటా అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి  విద్య ప్రాముఖ్యత  గురించి, అందరికీ విద్య అందించటంలో ఎదురవుతున్న సవాళ్ళ గురించి, వాటిని పరిష్కరించడానికి  కొత్త పరిష్కారాల  గురించి తెలుసుకుంటే.....

అందరికీ విద్య  అవసరమే.....

విద్య ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి మాత్రమే కాకుండా, సమాజం అభివృద్ధికి కూడా కీలకంగా ఉంటుంది. నిరక్షరాస్యతను తగ్గించడం, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటి అంశాల్లో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మెరుగైన ఆర్థిక అవకాశాలను అందించి ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తుంది. మన దేశ జనాభాలో సంపన్నులకంటే దరిద్రంలో బ్రతికేవారి సంఖ్యే ఎక్కువ కనుక  ఆ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే విద్య అనే ఆయుధం చేపట్టాలి. అందుకే ఒక చిన్న కూలిపని చేసుకునే వ్యక్తి కూడా తన కష్టం తమ పిల్లలకి రాకూడదని పిల్లలను  చదివించి వారి  భవిష్యత్తుని తీర్చిదిద్దాలనుకుంటున్నారు.  విద్య  ద్వారానే సమానత్వం సాధ్యమవుతుంది.  అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు కూడా ఎంతో వివక్ష, అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ విద్యనే ఆయుధంగా మలచుకుని గొప్పవాళ్లయ్యారు. దేశ చరిత్రలోనే నిలిచిపోయారు.. ‘విద్య అనేది పులిపాల వంటిది, దాన్ని తాగినవారు గర్జించకుండా ఉండలేరు” అనేది ఆయన మాట. అలాగే లింగ సమానత్వం, సామాజిక అసమానతలను తగ్గించడం వంటి ఇతర  లక్ష్యాలను సాధించడంలో  కూడా  విద్య సాయపడుతుంది.

అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025 థీమ్....

"ఏఐ మరియు విద్య- ఆటోమేషన్ ప్రపంచంలో మానవ ఏజెన్సీని సంరక్షించడం" అనే థీమ్ ను 2025 అంతర్జాతీయ విద్య దినోత్సవం సందర్భంగా ఎంచుకున్నారు. ఈ థీమ్ అంతర్జాతీయ విద్యా సవాళ్లపై ఏ‌ఐ ప్రభావమేంటో తెలుసుకోవటంపైన,  అలాగే సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మానవ స్వేచ్ఛను ఎలా పరిరక్షించాలి, నిర్వహించాలి,  పెంపొందించాలి అనే దానిపై కేంద్రీకృతమవుతుంది. సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకుని, దానిని సమర్థంగా ఆవిష్కరించడానికి వ్యక్తులు, సముదాయాలను సన్నద్ధం చేయడంలో విద్య  శక్తిని గ్రహింపజేస్తుంది.

అందరికీ విద్య అందించటంలో ఎదురవుతున్న  సవాళ్లు……

విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించినప్పటికీ,  ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది పిల్లలు, యువత విద్యను పొందడంలో లేదా మొదటిపెట్టిన చదువు  పూర్తిచేయడంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. చాలా కుటుంబాలు మౌలిక అవసరాలను తీర్చాటానికే  ఇబ్బంది పడుతూ, పాఠశాల ఫీజులు, యూనిఫాంలు, పుస్తకాలను కొనలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు లక్షలాది మంది విద్యను అడ్డుకుంటూ, పిల్లలను పాఠశాలల నుండి దూరం చేస్తున్నాయి.  చాలా ప్రాంతాల్లో సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక కారణాల వల్ల అమ్మాయిలను విద్య నుండి దూరం చేస్తున్నారు.   ముఖ్యంగా  కుటుంబాల నుండి విడిపోయిన పిల్లలు లేదా చాలా పేదరికంలో ఉన్న పిల్లల విద్యావకాశాలని  చాలా ప్రభావితం చేస్తున్నాయి.
 
అందరికీ విద్య  చేరేలా ఏం చేయగలం.....

244 మిలియన్లకు పైగా పిల్లలు, యువతులు ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. పాఠశాలకు వెళ్లే 600 మిలియన్లకు పైగా పిల్లలు ప్రాథమిక అక్షర, సంఖ్యాజ్ఞానం సాధించలేకపోతున్నారు. ఎందుకంటే విద్యపట్ల అవగాహన లేకపోవటం, నాణ్యమైన విద్య అందకపోవటం జరుగుతోంది.  అప్పట్లో మన ఊళ్లలోనే చదువుకోవటం ఎంత ముఖ్యమో చెప్పటానికి ‘అన్నాదమ్ముల నాటకం’ వేసి అందరికీ అవగాహన కలిగించే ప్రయత్నం చేసేవారు గుర్తుందా.... మరి అలాంటిది సోషల్ మీడియా యుగంలో ఉన్న మనకి విద్య పట్ల అవగాహన వ్యాప్తి చేసే మార్గాలు చాలా ఉన్నాయి. విద్యకి  గ్లోబల్గా ఉన్న సవాళ్ళని గుర్తించి సోషల్ మీడియాలో అందరి దృష్టికీ తీసుకురావాలి. #అందరికీ విద్య, #నాణ్యమైన విద్య  వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి గణాంకాలు, కథనాలు, విశ్లేషణలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలి. ఎదురవుతున్న సవాళ్ళకి పరిష్కారాలు చూపించే  ఆన్‌లైన్ లేదా స్థానిక ఈవెంట్‌లలో పాల్గొనాలి.  విద్యలో సమానత్వం, అందుబాటులో ఉన్న విద్యను ప్రోత్సహించటం వంటి  విద్యా సంస్కరణలను సమర్థించాలి. విద్య కేవలం పాఠశాల స్థాయిలోనే కాకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా ఉండేలా నూతన విద్యా విధానాల అమలు కోసం పిలుపునివ్వాలి.  పర్యావరణ సంరక్షణ, సాంకేతికత, ఆర్థిక సుస్థిరత వంటి అంశాలను విద్య ద్వారా నేర్పించాలి. చదువుకోవాలనే తపన ఉన్న పేదపిల్లలకి  ఆర్ధిక సాయం అందించే మార్గాలు చూపాలి. పనులకి వెళ్ళి చదువుకి దూరమైపోతున్న పిల్లల్ని గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించి, చదువుకి దగ్గర చేయాలి.  ‘అందరికీ విద్య- మనందరి భాద్యత’ అన్న మాటని అందరం నిలబెట్టుకోవాలి.

                            *రూపశ్రీ.