పాత లోకేష్ కాదు.. ఇప్పుడు చూడు! వైసీపీకి చుక్కలే..

మొన్నటిదాకా ఆయననే తిట్టారు. ఆయన మీదే ఫోకస్ చేశారు. ఆయన కదిలితే చాలు విమర్శల వర్షం కురిపించారు. ఆయన కొడుకును ఎగతాళి చేయడం తప్ప విమర్శలు చేసేవారు కాదు. ఏమన్నా సరే తీసిపారేసేవారు. అలాంటిది ఇప్పుడు ఆ కొడుకుపైనే కస్సుమంటున్నారు. నీకెంత ధైర్యం అంటూ విరుచుకుపడుతున్నారు. ఊరుకోమంటూ వార్నింగులు ఇస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డిని తిట్టినందుకే లోకేష్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారనుకుంటే పొరపాటు...లోకేష్ స్టయిల్ మారింది..మాట మారింది.. మాటల తూటాలతో చురుక్కుమనిపిస్తున్నాడు. జనం, జనంతో పాటు  టీడీపీ కేడర్ సైతం ఇప్పుడు లోకేష్ ఏం చెబుతున్నాడనేదానిపై దృష్టి పెడుతున్నారు. మారుతున్న ఈ వాతావరణం వైసీపీకి నచ్చలేదు. అందుకే టార్గెట్ మార్చుకున్నారు.. రెచ్చిపోయి దాడులు చేయడం మొదలెట్టారు.

అవును..లోకేష్ స్టయిల్ మారింది. ఈ విషయం రెండు, మూడు నెలల క్రితమే మీడియాలో వచ్చినప్పటికీ... ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. గడ్డం పెంచితే సరిపోదు అంటూ ఓ మంత్రి లోకేష్ పై సెటైర్ వేశాడు. అంతకు ముందు బయటకు రావటం లేదన్నారు. బయటకు వచ్చి విమర్శలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఆ పంచ్ డైలాగులకు ఆశ్చర్యపోతున్నారు. ట్విట్టర్ లో కనపడినప్పుడు..ఎవరితోనో రాయించుకున్నాడని కామెంట్ చేశారు. ఇప్పుడు బయటికొచ్చి అంతకంటే ఘాటుగా డైలాగులు వదులుతుంటే షాకవుతున్నారు. 

గతంలో లోకేష్ పొరపాటున పలికిన పదాలను పట్టుకుని ఆ వీడియోలను వైరల్ చేశారు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్. జగన్ అధికారంలోకి వచ్చాక బయట, అసెంబ్లీలోనూ మాట్లాడిన తప్పులను ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ ఇప్పుడు పదునైన మాటలతో కరకుగా మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఫ్రస్టేషన్ పెంచేస్తున్నారనే కామెంట్లు వినపడుతున్నాయి.
బరువు బాగా తగ్గిపోయిన లోకేష్.. గడ్డం పెంచి.. మాస్ లుక్ లోకి వచ్చేశారు. గతంలో క్లీన్ షేవ్ తో క్లాస్ గా ఉండే లోకేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఎంతలా అంటే... వైసీపీని సమర్ధించే పోర్టల్స్ లో అసలు కొత్త ఫోటోలే వాడటం లేదు.. గతంలోని ఫోటోలనే పెట్టి వార్తలు రాస్తున్నారు. అంటే ఆ లుక్ లో ఎంత ఛేంజ్ వస్తే..దానిని వాడటానికి వారు భయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఫిజికల్ గా కూడా లోకేష్ తన ఫిట్ నెస్ బాగా పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మీడియాలో చూస్తున్న లోకేష్ పర్సనాలిటీకి...గతంలో చూసినదానికి చాలా తేడా కనపడుతోంది. ఇంకొన్ని రోజుల్లో మరింత ఛేంజ్ వస్తుందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చాలా పట్టుదలతో లోకేష్ తన ఫిట్ నెస్ పెంచుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.మొన్నటికి మొన్న టెంత్, ఇంటర్ పరీక్షలపై గట్టిగా పట్టుబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించిన లోకేష్ విజయం సాధించారు. కేవలం లోకేష్ ఆ సమస్యను ఎత్తుకున్నందుకే నిర్ణయం తీసుకోని జగన్..ఇప్పుడు సుప్రీంకోర్టు ఒత్తిడితో నిర్ణయం తీసుకోక తప్పని పరిస్దితిలో పడ్డారు. విజయం ముందే ఫిక్స్ అయిపోయిన పోరాటాన్నిలోకేష్ తెలివిగా తీసుకున్నట్లయింది.

అయితే లోకేష్ ఇంకా అగ్రెసివ్ గా ఉండాలని..సమస్యలపై పోరాటం చేసి చూపించాలని.. కేవలం ట్విట్టర్ లో స్టేట్ మెంట్ ఇవ్వడం.. ఏదైనా ఘటన జరిగితే అక్కడకు వెళ్లి ప్రెస్ తో మాట్లాడటం కాదని.. పార్టీ కార్యకర్తలతో ఆందోళనలను నిర్వహించి..తాను స్వయంగా పాల్గొనాలని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి