నంద్యాల "వేడి" ఇంకా చల్లారలేదా..?

ఎన్నికలు అన్నాకా..అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు అత్యంత సహజం. ప్రచారంలో ప్రజలను ఆకర్షించాలనో..మీడియాలో హైలెట్ అవ్వాలనో నేతలు సవాళ్లు విసురుకుంటూ ఉంటారు. సరే ఎన్నికలు అయిపోయాకా..రిజల్ట్ కూడా వచ్చాకా ఛాలెంజ్‌లు చేసుకుంటే..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. నంద్యాల ఉప ఎన్నికలో కలలో కూడా అనుకోని విధంగా తెలుగుదేశం గెలవడంతో వైసీపీ శ్రేణులను నైరాశ్యం ఆవహించింది. హుషారుగా కనిపించే నేతలు, కార్యకర్తలు చప్పబడిపోయారు..అవమాన భారంతో ఇళ్లు దాటి బయటకు కూడా రావడం లేదట కొంతమంది.

 

తాము చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే గెలిచామని తెలుగుదేశం నేతలు చెప్పుకుంటుండగా..అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం, అక్రమ మార్గాల్లో అధికార పార్టీ గెలుపొందిందని వైసీపీ నేతలు ఆరోపిస్తూ కింద పడ్డా తమదే పైచేయి అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. ఆ ఫస్ట్రేషన్‌లో సరికొత్త సవాళ్లతో నోరు పారేసుకుంటున్నారు. దమ్ముంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించి..గెలిచి చూపించాలంటూ వాదిస్తున్నారు. మరి అధికార పార్టీ వాళ్లు వూరుకుంటారా..? రెండాకులు ఎక్కువే చదివారు కదా..?

 

నిన్నటి దాకా నంద్యాలను రెఫరెండం అన్నవారు..అక్కడ పరువు పోయేసరికి మళ్లీ ఎన్నికలు కావాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ ఎన్నికలకు వెళ్లడానికి అంత ఉత్సాహంగా ఉంటే..అప్పట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్నారు కదా.? అలా వారితో రాజీనామా చేయిస్తే ఎన్నికలు వస్తాయని అప్పుడు ఎవరి సత్తా ఎంటో తేల్చుకోవచ్చని ప్రతి సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్‌కు లోటస్ పాండ్ నుంచి స్పందన రాలేదు. మొత్తానికి నంద్యాల ఉప ఎన్నికతో రాజకీయ వాతావరణం చల్లబడుతుందనుకుంటే అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu