సంగీతం ఒక టానిక్!!

సంగీతం ఓ ఔషధం అంటారు చాలామంది.మనిషిలో కదలికలు తెప్పిస్తుంది, శిలను కరిస్తుంది. భావాలకు ప్రాణం పోస్తుంది. అలాంటి సంగీత సామ్రాజ్యం ఎంతో పెద్దది. సాంప్రదాయక సంగీతం, ఆధునిక సంగీతం అని రెండు భాగాలుగా విభజించబడినా సంగీతం ఒలలాడిస్తుందే తప్ప నిరాశపరచదు.

అలాంటి సంగీతంలో సాంప్రదాయక సంగీతం మరింత విశిష్టమైనది. కర్ణాటక, హిందూస్థానీ, ఫోక్ వంటి వర్గాలుగా ఈ సాంప్రదాయక సంగీతం విభజించబడ్డా వీటిలో కర్ణాటక సంగీతం బహురమ్యమైనది. ఈ కర్ణాటక సంగీతాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన మహానుభావుడు త్యాగయ్య. తన ప్రతి వ్యక్తీకరణను కృతులుగా, గీతాలుగా మార్చి సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన రారాజు త్యాగయ్య. 

తన సంగీతాన్ని ఆ శ్రీరాముడిని స్తుతించడానికి ఉపయోగించాడే తప్ప ఏనాడు తన ప్రతిభను ప్రచారం చేసుకోవడానికే ఉపయోగించని గొప్ప కళాహృదయం కలిగిన వాడు త్యాగయ్య. ఆ శ్రీరామ చంద్రుడిని తొంభై ఆరు కోట్ల సార్లు నామాజపం చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకున్నాడని, శ్రీరామచంద్ర ప్రభువు ఈయనకు దర్శనం ఇచ్చాడని చెబుతారు అందరూ.

స్వరరాగ ప్రయాణం!!

పదమూడు సంవత్సరాల వయసులోనే "నమో నమో రాఘవా" అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరిచి గురువు మెప్పు పొందాడు.  "ఎందరోమహానుబావులు" అంటూ సాగే ఈయన కీర్తన ఎంతో బాగుంటుంది.  తంజావూరు రాజు ఎంతో డబ్బు, బంగారం ఇవ్వబోతే వాటిని సున్నితంగా తిరస్కరించి "నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాలు నిజమా" అంటూ ఆలపించి తనకు అన్నిటికన్నా ఆ రామచంద్రుడిని కృతులలో అర్చించడమే తనకు నిజమైన సంపద అని అదే తనకు తృప్తి అని చెబుతాడు.

సంగీతంలో ఉన్న రాగాన్ని, తాళాన్ని సమర్థవంతంగా ఉపయోగించి ఆయన ఎన్నో కృతులను అందించారు సంగీత సామ్రాజ్యానికి. 

రామ వియోగమూ….దుఃఖసాగరమూ…..

రాముడంటే త్యాగరాజుకు ఎనలేని ప్రేమ. ఆ ప్రేమ అంతా తనకు తండ్రి ఆస్తిలో లభించిన శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలే. ఆ విగ్రహాలను పూజిస్తూ, ద్యానిస్తూ, సేవిస్తూ, అర్చిస్తూ, ప్రేమిస్తూ రాముడిని అన్ని విధాలుగా  అంటిపెట్టుకుని ఉండేవాడు. కానీ రాజు ఇచ్చిన కానుకలను వద్దన్నాడనే కోపంతో త్యాగయ్య గారి అన్నయ్య ఆ శ్రీరాముడి పట్టాభిషేక విగ్రహాలను తీసుకెళ్లి కావేరీ నదిలో పడేసాడు. అప్పుడే ఆయన బాధలో కూడా "ఎందు దాగినావో" అంటూ ఆలపించిన కృతి మనసును కదిలిస్తుంది.   విగ్రహాలు పోయేసరికి రాముడి తనను వదిలిపోయినంత దుఃఖించాడు త్యాగయ్య. వెంటనే ఊరు విడిచి తీర్థయాత్రలకు వెళ్లి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు.

అలా తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళినపుడు అడ్డుగా తెర ఉండటంతో అప్పటికపుడే "తెరతీయగరాదా" అని ఆలపించగానే ఆ తెర దానంతకదే  తొలగిపోయి వెంకటేశ్వరస్వామి దర్శనం కలిగిందని, దాని వెనుక మహత్యం వెంకటేశ్వరస్వామిదే అని అంటారు.  చివరికి ఆ రామచంద్రుడి కరుణకు పాత్రుడయ్యాడు. ఆయన ఆలపించిన "గిరిపై పరితాపం" అవే చివరి పాటలు అయ్యాయి. తరువాత ఆయన ఆ శ్రీరాముడిలో ఐక్యం అయిపోయారు.

ఆరాధనోత్సవాలు!!

ప్రతి సంవత్సరం పుష్యమాసంలో త్యాగరాజు ఆరాధనోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుతారు. అక్కడ ఆయన కృతులతో కన్నులపండుగగా ఉంటుంది. 

పంచరత్నాల  మెరుపులు!!

ఈయన రచించిన అయిదు పాటలు పంచకృతులుగా పేర్కొనబడ్డాయి. ఇవి ఐదూ ఆదితాళంలో ఉంటయి.  పంచరత్న కృతులు పాడే నట గౌళ అరభి వరళీ శ్రీ రాగాలను గాన పంచక రాగాలు అని పిలుస్తారు. వీటికి సంబంధించిన తానం వీణ పై వాయించడానికి చాలా అనువుగా ఉంటాయి. నట వరాళి రాగాలకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. 

ఇంతటి గొప్ప కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి వన్నె తెచ్చిన త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అని మనం పాడుకోవడం కూడా మన అదృష్టమే!!

◆ వెంకటేష్ పువ్వాడ