పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పాద‌యాత్ర‌? మ‌రో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అవుతారా?

టైటిల్ చూసి.. అదేంటి? ఇంకా పీసీసీ చీఫ్ కానే లేదు.. అప్పుడే పాద‌యాత్ర న్యూస్‌ ఏంటి? అనుకుంటున్నారా. అదేమ‌రి, రాజ‌కీయం అప్ప‌టిక‌ప్పుడు అనుకుని చేసేది కాదు. భ‌విష్య‌త్ అంతా ముందే డిసైడ్ అయిపోతుంది. ఫ్యూచ‌ర్‌ను బేస్ చేసుకునే ప్ర‌జెంట్ పాలిటిక్స్ చేస్తారు. రేవంత్‌రెడ్డి అలాంటి సత్తాగ‌ల లీడ‌ర్ కాబ‌ట్టే.. నెక్ట్స్ మూడేళ్ల‌కు స‌రిప‌డా మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఈజీగా వ‌రిస్తుంద‌నుకున్న పీసీసీ పీఠం కాస్త ఇబ్బంది పెట్టి, ఇంకాస్త‌ ఆల‌స్య‌మైనా.. ఆ పోస్టుపై త‌న పేరే రాసుంద‌ని ప‌క్కా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు రేవంత్‌రెడ్డి. రేపేమాపో పీసీసీ ప‌గ్గాలు చేతికంద‌గానే.. కేసీఆర్‌పై దండ‌యాత్రే ఆయ‌న అంతిమ‌ల‌క్ష్యం. అయితే, అందుకు తొంద‌రేమీ లేద‌నేది రేవంత్‌రెడ్డి ఉద్దేశ్యంలా ఉంది. 

ఎగిరెగిరి దంచినా.. నిల‌బ‌డి దంచినా.. అదే ఫ‌లితం. అసెంబ్లీ సంగ్రామానికి ఇంకా రెండున్న‌రేళ్ల గడువుంది. అందుకే, ఇప్ప‌టి నుంచే ఆవేశ‌ప‌డకుండా.. తుదిపోరుకు ఎన‌ర్జీ సేవ్ చేసుకునేలా ఆచితూచి అడుగులు వేయాల‌నేది రేవంత్‌రెడ్డి స్ట్రాట‌జీలా క‌నిపిస్తోంది. ఆలోగా ముందు ఇంటిని చ‌క్క‌బెట్టుకోవాల‌ని చూస్తున్నారు. కాంగ్రెస్‌లో త‌న కాలికి అడుగ‌డుగునా అడ్డొస్తున్న ముళ్ల‌ను ఏరిపారేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి ఒక్క‌రే కింగ్ అండ్ కింగ్‌మేక‌ర్ అనేలా పార్టీని పూర్తిగా త‌న చేతుల్లోకి తీసుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నిత్యం మీడియా ముందు అసంతృప్తి స్వ‌రాలు వినిపించే.. అధిష్టానానికి ప‌దే ప‌దే లేఖ‌లు రాసే.. త‌న మీద ఫిర్యాదులు చేసే.. వీహెచ్‌, జ‌గ్గారెడ్డి, న‌ల్గొండ బ్యాచ్ లీడ‌ర్ల‌ను సైడ్ చేసేలా.. పార్టీలో త‌న ఆధిప‌త్యమే చెలామ‌ని అయ్యేలా స్కెచ్ వేస్తున్నారు రేవంత్‌రెడ్డి. అందుకు, గ‌తంలో కాంగ్రెస్‌ను పూర్తిగా క‌బ్జా చేసిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డినే రోల్ మోడ‌ల్‌గా తీసుకుంటున్నారు. అచ్చం.. వైఎస్సార్ అనుస‌రించిన ఎత్తుగ‌డ‌ల‌నే రేవంత్‌రెడ్డి ఇంప్లిమెంట్ చేసేలా స‌న్నద్ద‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. 

వైఎస్సార్ ముఖ్య‌మంత్రి కాక‌ముందు కూడా కాంగ్రెస్‌లో ఇలాంటి ప‌రిస్థితే ఉండేది. అప్పుడు సైతం రాజ‌శేఖ‌ర్‌రెడ్డిపై సీనియ‌ర్లు క‌ళ్ల‌మంట‌తో ఉండేవారు. ఆయ‌న్ను ఎలాగైనా తొక్కేయాల‌ని చూసేవాళ్లు. కేడ‌ర్ మాత్రం వైఎస్సార్‌కు స‌పోర్ట్‌గా ఉండేది. ఇప్ప‌టి వి.హ‌నుమంత‌రావు అప్పుడు కూడా వైఎస్సార్‌పై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే ఉండేవాడ‌ని చెబుతారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డిపైనా అలానే హైక‌మాండ్‌కు చాడీలు చెబుతున్నాడ‌ని అంటున్నారు. సీనియ‌ర్ల చేతుల్లో ఉన్న కాంగ్రెస్‌ను త‌న గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వైఎస్సార్ వేసిన తిరుగులేని ఎత్తుగ‌డ‌.. పాద‌య‌త్ర‌. అదే ఆయ‌న రాజ‌కీయ జీవితానికి మ‌రో ప్ర‌స్థానంగా బాట‌లు ప‌రిచింది. చేవెళ్ల‌లో వేసిన తొలి అడుగు.. వైఎస్సార్‌ను ముఖ్య‌మంత్రి పీఠం వ‌ర‌కూ తీసుకెళ్లింది. ఆ పాద‌యాత్ర‌ ప‌దఘ‌ట్ట‌న‌ల‌తో పార్టీలో సీనియ‌ర్లంద‌రినీ తొక్కిప‌డేశారు వైఎస్సార్‌. కాంగ్రెస్‌లో తిరుగులేని నేత‌గా ఎదిగారు. ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రిగా ఇటు పార్టీని, అటు అధిష్టానాన్ని శాసించారు. సేమ్ టూ సేమ్ ఇదే స్ట్రాట‌జీని రేవంత్‌రెడ్డి సైతం ఫాలో కాబోతున్నార‌ని తెలుస్తోంది. 

పీసీసీ ప్రెసిడెంట్‌గా త‌న పేరును ప్ర‌క‌టించాక‌.. పై నుంచి కాకుండా ముందు కింద నుంచి న‌రుక్కొస్తార‌ని అంటున్నారు. ముందుగా డీసీసీల‌పై దృష్టి పెట్ట‌నున్నట్టు తెలుస్తోంది. జిల్లాల వారిగా ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి విశేష అనుచ‌ర‌గ‌ణం ఉంది. వారిలో స‌మ‌ర్థుల‌కు, త‌న అనుకున్న వారికి.. డీసీసీ ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తార‌ట‌. ఇప్ప‌టికే ఆ జాబితా కూడా రెడీ చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఇలా జిల్లాల వారీగా త‌న మ‌నుషుల‌తో పార్టీలో బ‌లం పుంజుకొని.. అప్పుడిక వైఎస్సార్ మాదిరే మ‌హా పాద‌యాత్ర‌తో.. అస‌లైన దండ‌యాత్ర‌కు శ్రీకారం చుడతార‌ని అంటున్నారు. 

పాద‌యాత్ర‌తో టూ బ‌ర్డ్స్ ఎట్ వ‌న్ షాట్ అనేది రేవంత్‌రెడ్డి లెక్క. తెలంగాణ‌లో గ్రామ‌గ్రామాన కాలిన‌డ‌క‌న ప‌ర్య‌టించి.. ఊరూరా త‌న పాద‌ముద్ర వేసి.. ఆ అడుగుల స‌వ్వ‌డితో సీనియ‌ర్ల కూనిరాగాలు వినిపించ‌కుండా చేయ‌డం సులువ‌ని భావిస్తున్నారు. పాద‌యాత్ర‌తో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగి.. ఇటు పార్టీకి.. అటు కేసీఆర్‌కి త‌న స‌త్తా చాటేలా ఎత్తుగ‌డ వేస్తున్నార‌ని తెలుస్తోంది. కేసీఆర్ పాల‌న‌లోని లోటుపాట్ల‌ను ఇంటింటికీ వెళ్లి ఎండ‌గ‌డుతూ.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొస్తార‌ని అంటున్నారు. అయితే, ఈ పాద‌యాత్ర ఇప్పుడే చేస్తారా? లేక‌, ఎల‌క్ష‌న్ల ఏడాది చేయాలా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేద‌ని తెలుస్తోంది. అనుకోకుండా ఈట‌ల రాజేంద‌ర్ పాన‌కంలో బుడ‌గ‌లా బ‌య‌ట‌కు రావ‌డం.. అందులోనూ బీజేపీలో చేరి.. త‌న‌కు పోటీగా నిలిచే అవ‌కాశం ఉండ‌టంతో.. పాద‌యాత్ర‌కు ఇదే మంచి స‌మ‌యం అని అంచ‌నా వేస్తున్నార‌ట‌. గ‌తంలో పాద‌యాత్ర‌ను న‌మ్ముకున్న ఏ ఒక్క‌రు వైఫ‌ల్యం చెంద‌లేద‌ని.. వైఎస్సార్‌, చంద్ర‌బాబు, జ‌గ‌న్‌.. ఆ ముగ్గురూ పాద‌యాత్ర‌తోనే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించార‌ని.. అలానే రేవంత్‌రెడ్డి సైతం పాద‌యాత్రతో సీఎం అయ్యేలా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి, పాద‌యాత్ర‌తో రేవంత్‌రెడ్డి హిస్ట‌రీ రిపీట్ చేస్తారా? కాంగ్రెస్‌లో మ‌రో వైఎస్సార్‌లా తిరుగులేని నేత‌గా నిల‌బ‌డ‌తారా?